తడబడి నిలబడిన.. ఈపీఎస్‌ – ఓపీఎస్‌! | AIADMK government completed three years | Sakshi
Sakshi News home page

తడబడి నిలబడిన.. ఈపీఎస్‌ – ఓపీఎస్‌!

Published Mon, Dec 2 2019 5:09 AM | Last Updated on Mon, Dec 2 2019 5:09 AM

AIADMK government completed three years - Sakshi

చెన్నై: పురచ్చితలైవి జయలలిత ఆకస్మిక మరణానంతరం తమిళనాట ఏర్పడిన ఏఐఏడీఎంకే ప్రభుత్వం మూడేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకోబోతోంది. అంతర్గత కలహాలు, అంతగా ప్రజాదరణ లేని నేతలతో ఎప్పుడు పడిపోతుందో అన్నట్లుగా ఉన్న ఈ.పళని స్వామి(ఈపీఎస్‌), ఓ.పన్నీర్‌ సెల్వం(ఓపీఎస్‌)ల ప్రభుత్వం స్థిరంగా నిలిచి తలలుపండిన రాజకీయ విశ్లేషకుల అంచనాలను సైతం తలకిందులు చేసింది. ఈపీఎస్, ఓపీఎస్‌..ఈ ఇద్దరు నేతల్లో దిగ్గజ నేత జయలలిత నమ్మిన బంటు ఒకరైతే, జయలలిత రాజకీయ ఉత్థాన పతనాలను దగ్గర్నుంచి చూసిన శశికళను ఒప్పించి, మెప్పించి ఎదిగిన నేత మరొకరు. తొలి వ్యక్తి ఓపీఎస్‌ రాజకీయాల్లో ఆరితేరిన వాడైనా పళని స్వామి రాజకీయ చతురతకు వెనక్కితగ్గక తప్పలేదు.

నిజానికి టీటీవీ దినకరన్‌ పార్టీలో ఉన్నంత కాలం శశికళ అనుయాయుడిగా మాత్రమే పళనిస్వామి ఉండేవారు. శశికళ జైలుకెళ్లడంతో 2017 ఫిబ్రవరిలో అనూహ్యంగా ఎడప్పాడి పళనిస్వామికి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. అంతగా అనుభవంలేని ఈపీఎస్‌కు తిప్పలు తప్పవని అప్పట్లో అంతా భావించారు. ప్రభుత్వం నిలుస్తుందో లేదోనన్న బెంగ మొదట్లో ఆయనలోనూ ఉంది. అదే భయాన్ని తన ఎమ్మెల్యేల మెదళ్లలోకి ఇంకేలా చేయడంలో సఫలీకృతమయ్యారు పళని స్వామి. కలిసికట్టుగా లేకున్నా, ఒకే మాటపై నిలబడకున్నా ప్రభుత్వం పడిపోవడమే కాదు, వారికి భవిష్యత్తు కూడా ఉండదని ఈపీఎస్‌ హెచ్చరికలను ఎమ్మెల్యేలు ఆకళింపు చేసుకున్నారు. ఓపీఎస్‌నూ, ఆయన 10 మంది ఎమ్మెల్యేలనూ తనవైపు తిప్పుకోవడంతో జయలలిత లేకున్నా ఏఐఏడీఎంకే ప్రభుత్వం తమిళనాట సుస్థిరంగా నిలబడగలిగింది.

బీజేపీ పాత్ర ఎంత?
తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకేలను నిలువరించేందుకు ఈపీఎస్‌–ఓపీఎస్‌ల కలయిక అనివార్యమని చెప్పి ఇరుపక్షాలనూ ఒప్పించడంలో బీజేపీ కీలకంగా వ్యవహరించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి తగు మద్దతిస్తానని మాటిచ్చి.. అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే– బీజేపీ పొత్తు కుదిరింది. అయితే, ఆ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసిన డీఎంకే.. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేక పోయింది.

ఉప ఎన్నికల్లో ఈపీఎస్‌ ప్రభుత్వం నిలబడటానికి కావాల్సిన 9 సీట్లను ఏఐఏడీఎంకే దక్కించుకోగలిగింది. ఏమాత్రం అనుభవం లేని ఈపీఎస్‌ సారథ్యంలోని ఏఐఏడీఎంకే విజయాన్ని చూసి విస్తుపోవడం డీఎంకే వంతయింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సుస్థిరపరుచుకోవడమే ఈపీఎస్‌ లక్ష్యం. అందుకే ఆయన ఎన్నికల్లో సీట్ల గెలుపుపైనే  దృష్టిపెట్టారు. తన ఎమ్మెల్యేలకు కావాల్సిన కాంట్రాక్టులిచ్చి లక్ష్యం సాధించుకున్నారు. దీనికితోడు తమిళనాడులోని విక్రవాండీ, నాన్‌గునేరీ ఉప ఎన్నికల్లో ఏఐఏడీఎంకే విజయం ఈపీఎస్‌కి ఉన్న యాక్సిడెంటల్‌ సీఎం అన్న పేరును మార్చివేసి, ఆయన భవిష్యత్తును చెప్పకనే చెప్పింది.

పన్నీర్‌ సెల్వంకు ఏం దక్కింది?
ఈపీఎస్‌–ఓపీఎస్‌ వర్గాల కలయికతో పన్నీర్‌ సెల్వంకు ఏం మిగిలిందన్న విషయం పక్కనబెడితే ప్రభుత్వం మాత్రం నిలదొక్కుకో గలిగింది. ఓపీఎస్‌కి డిప్యూటీ సీఎం పదవి, పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టి, పళనిస్వామి మాత్రం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఫలితంగా ఓపీఎస్‌కు ఎటువంటి నిర్ణయాధికారాలూ లేకుండా పోయాయి. దక్కిన డిప్యూటీ సీఎం పదవితోనూ పెద్దగా ఫలితం లేదన్నది వాస్తవం. తమ రెండు వర్గాల కలయికతో ఈపీఎస్‌కే తప్ప తనకు ఫలితం శూన్యమన్న విషయం ఓపీఎస్‌కు ఆలస్యంగా అర్థమైంది. దీంతోపాటు పార్టీ విలీనం తరువాత ఓపీఎస్‌ పక్షం ఎమ్మెల్యేలందరినీ ఏదో రకంగా ఈపీఎస్‌ తనవైపు తిప్పుకో గలిగారు. కేంద్రంలో ఓపీఎస్‌ కొడుక్కి సాయం చేస్తానన్న హామీ కూడా నెరవేకుండానే మిగిలిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement