కొంచెం మోదం! కొంచెం ఖేదం!!
► మోదీ మూడేళ్ల పాలనలో మిశ్రమ ఫలితాలు
► మళ్లీ అభివృద్ధి పథంలోకి ఆర్థికవ్యవస్థ
► ఉద్యోగాల కల్పన అంతంత మాత్రమే
► దిగివచ్చిన ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు
► బ్యాంకుల్లో పెరిగిన మొండి బకాయిలు
► ఆర్థిక సంస్కరణలు వేగంగా అమలు
► నత్తనడకన నల్లధనం వెలికితీత పనులు
‘అచ్ఛే దిన్’ హామీతో ఎన్నికల్లో గెలిచిన నరేంద్రమోదీ సరిగ్గా మూడేళ్ల కిందట ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మోదీ మంచి రోజుల మాటను విశ్వసించిన జనం 2014 ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య మెజారిటీని కట్టబెట్టారు. అనంతరం ఢిల్లీ, బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ దేశంలో మోదీ హవా తగ్గలేదని ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తేటతెల్లమైంది. ఇంకో రెండేళ్ల తర్వాత జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ మోదీ రెండోసారి గెలవడం నల్లేరు మీద నడకేనని రాజకీయ పండితులంతా జోస్యం చెప్తున్నారు.
మరి.. అవినీతిని అంతం చేస్తామని, పరిగెడుతున్న ధరలను అదుపు చేస్తామని, ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని, ఉద్యోగాలను సృష్టిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మోదీ సర్కారు ఈ మూడేళ్లలో ఎంతవరకూ అమలు చేసింది? మోదీ మూడేళ్ల పాలనపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? అనే అంశాలను ఒకసారి పరిశీలిస్తే.. కొన్ని సానుకూలతలు, మరికొన్ని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కీలక సంస్కరణల అమలు విషయంలో, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి మార్గంలోకి మళ్లించడంలో మోదీ సర్కారు విజయం సాధించినట్లేనని భావిస్తున్నారు. అయితే.. ఉద్యోగాల కల్పన, నల్లధనం వెలికితీత, బ్యాంకుల్లో మొండి బకాయిల వంటి విషయాల్లో ఇంకా బలమైన ముందడుగు పడలేదనే చెప్పాలి. మోదీ మూడేళ్ల పాలన తీరుతెన్నులపై నిపుణల విశ్లేషణల సారాంశం ఇదీ...
ధరలకు ముకుతాడు: మోదీ సర్కారు ఈ మూడేళ్లలో హోల్‌సేల్, రిటైల్ధరలు రెండిటినీ గణనీయంగా తగ్గించిందని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. సరుకుల సరఫరా పెంచడం, గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పంట కోతల తర్వాత పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడం, నిత్యవసరాల ఎగుమతులను నియంత్రించడం, రాష్ట్రాల్లో అక్రమ నిల్వలపై చర్యలకు పిలుపునివ్వడం తదితర చర్యలు చేపట్టింది. సరుకుల రవాణాకు ఉపయోగించే చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో తగ్గడం కూడా.. ద్రవ్యోల్బణం నియంత్రణ కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు కలిసివచ్చింది. దీంతో.. బీజేపీ అధికారంలోకి వచ్చినపుడు సుమారు 10 శాతం ఉన్న రిటైల్ద్రవ్యోల్బణం ప్రస్తుతం అటూ ఇటూగా మూడు శాతానికి తగ్గిపోయింది.
ద్రవ్యలోటు నియంత్రణ: మోదీ సర్కారు అధికారంలోకి వచ్చినపుడు ద్రవ్యలోటు జీడీపీలో 5.31గా ఉండగా.. ఇప్పుడు అది 3.2 శాతానికి తగ్గింది. ఇందుకు ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం. దానివల్ల ప్రభుత్వ పెట్రోలియం రాయితీ వ్యయం తగ్గడంతో ఆమేరకు ద్రవ్యలోటు కూడా గణనీయంగా తగ్గింది.
సంస్కరణల పరుగులు: అవినీతిని నిర్మూలించడం కోసం, వాణిజ్య పరిస్థితులను మెరుగుపరచడం కోసం, ప్రజల జీవన పరిస్థితులను బాగు చేయడం కోసం మోదీ సర్కారు పలు సాహసోపేత సంస్కరణలను వేగంగా అమలు చేస్తోంది.
⇒ అందులో భాగంగా అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు దేశాన్ని ఒక కుదుపు కుదిపినప్పటికీ దీర్ఘకాలంలో అది సానుకూల ఫలితాలనిస్తోందని నిపుణులు చెప్తున్నారు.
⇒ డిజిటిల్లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్రం చేస్తున్న కృషి కూడా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.
⇒ దేశంలో ప్రస్తుతమున్న సంక్లిష్ట పన్నుల వ్యవస్థను సమూలంగా సంస్కరించే లక్ష్యంతో రూపొందించిన వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ)ను జూలై 1వ తేదీ నుంచి అమలులోకి తేనుంది. ఇందుకోసం ఎన్నో అవరోధాలను సమర్థవంతంగా అధిగమించిన సర్కారు.. దేశ ప్రజలను ఈ కీలక సంస్కరణ కోసం సమాయత్తం చేస్తోంది.
⇒ రైల్వే మౌలిక సదుపాయాలు, రక్షణ, వైద్య పరికరాలు, నిర్మాణ అభివృద్ధి, ప్రసార, బీమా, పెన్షన్, విమానయాన తదితర రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)పై పరిమితిని తొలగించడంతో పాటు.. దేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ‘మేక్ఇన్ఇండియా’ వంటి పథకాలను మోదీ సర్కారు అమలు చేయడంతో ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్‌కు పదిలమైన స్థానం లభించింది.
వృద్ధి పథంలో ఆర్థికరంగం: మోదీ సర్కారు చేపట్టిన చర్యలతో 201617 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 6000 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు తగ్గిపోయాయి. దీని ఫలితంగా భారత దేశంలో స్టాక్‌మార్కెట్లు గణనీయంగా లాభపడ్డాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి కూడా బలపడింది. భారతదేశం ఇప్పుడు 7 శాతం వార్షికాభివృద్ధి రేటుతో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. 2013లో బ్రెజిల్, ఇండొనేసియా, టర్కీ, దక్షిణాఫ్రికాలతో పాటు ప్రపంచంలో ‘ఫ్రాగైల్ఫైవ్’ (బలహీనమైన పంచ దేశాలు)గా అభివర్ణించిన ఐదు దేశాల్లో ఒకటిగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఈ మూడేళ్లలో తిరిగి అభివృద్ధి పట్టాలెక్కింది.
‘స్మార్ట్’గా.. ‘స్వచ్ఛ’ంగా.. ముందుకు...
జన్‌ధన్‌యోజన: ప్రజలందరినీ ముఖ్యంగా పేద వర్గాల వారిని కూడా ప్రధాన ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించేందుకు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా ఆయా ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా ప్రధానమంత్రి జన్ ధన్యోజనను మోదీ సర్కారు అమలులోకి తెచ్చింది. ఇప్పటివరకూ 28.38 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరిచారు. అందులో 63,960 కోట్ల మేర నిధులు కూడా ఉన్నాయి.
స్మార్ట్‌సిటీలు: దేశంలో 2019 నాటికి 100 స్మార్ట్‌సిటీల నిర్మాణం లక్ష్యంగా ప్రకటించన మోదీ సర్కారు 60 నగరాల్లో అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందుకు రూ. 1.33 లక్షల కోట్లు పెట్టుబడులను మంజూరు చేసింది. మరో 20 నగరాల్లో రూ. 1,600 కోట్ల వ్యయంతో ప్రాజెక్టులు పూర్తికావస్తున్నాయి. ఇంకో 40 నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు మొదలు పెట్టాల్సి ఉంది.
స్వచ్ఛ భారత్: ఈ కార్యక్రమం కింద దేశంలో మొత్తం 4,041 నగరాలు, పట్టణాలను 2019 నాటికి బహిరంగ మలవిసర్జన రహితం (ఓడీఎఫ్)గా మార్చాలన్నది లక్ష్యం. ఇందులో ఆంధ్రప్రదేశ్, గుజరాత్రాష్ట్రాలతో పాటు 633 నగరాలు ఓడీఎఫ్‌గా ప్రకటితమయ్యాయి. రూ. 62,009 కోట్ల వ్యయంతో 32 లక్షల ఇళ్లలో మరుగుదొడ్లు, 1.25 లక్షల పబ్లిక్టాయిలెట్లు నిర్మించారు. ఇంకా 3,400 నగరాల్లో ఈ పథకం అమలు చేయాల్సి ఉంది.
అందుబాటు ధరలో ఇల్లు: పట్టణ ప్రాంత పేదలకు 2019 నాటికి రెండు కోట్ల ఇళ్లు నిర్మించాలన్నది లక్ష్యం. ఇప్పటివరకూ 18.76 లక్షల ఇళ్లు మంజూరు చేయగా మూడేళ్లలో 3.55 లక్షల ఇళ్లు పూర్తిచేశారు. ఇంకా 1.78 కోట్ల ఇళ్లు నిర్మించాల్సి ఉంది.
మోదీ ప్రధాన వైఫల్యాలివీ...
ఉద్యోగాల కల్పనలో విఫలం: మోదీ సర్కారు వైఫల్యాల్లో ప్రధానమైనది ఉద్యోగాల సృష్టి. బీజేపీ అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు కల్పిస్తుందని మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఆ హామీని నెరవేర్చడానికి ఎన్డీఏ సర్కారు మేక్ఇన్ఇండియా, స్టార్టప్ఇండియా వంటి కార్యక్రమాలను ప్రారంభించింది. షాపులు, రెస్టారెంట్లు, సినిమాలు వంటి వాణిజ్య సంస్థలు 24 గంటల పాటూ తెరిచి ఉంచేలా మోడల్చట్టాన్నీ తెచ్చింది. కానీ దేశంలో తయారీ రంగం అభివృద్ది చెందుతుందని, భారీగా ఉద్యోగాలు లభిస్తాయని ఆశించిన ఫలితాలు రాలేదు. దేశంలో ‘ఉద్యోగ కల్పన రేటు మందకొడిగా ఉంద’ని 201617 ఆర్థిక సర్వే వెల్లడించింది.
201314లో 4.9 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 201516 నాటికి 5 శాతానికి పెరిగింది. మోదీ సర్కారు మొదటి మూడేళ్లలో ఎనిమిది ప్రధాన రంగాల్లో కొత్తగా సృష్టించిన ఉద్యోగాల సంఖ్య 15.1 లక్షలు. ఇది అంతకుముందు మూడేళ్లలో కల్పించిన ఉద్యోగాల సంఖ్య 24.7 లక్షల కన్నా 39 శాతం తక్కువ. ఈ రంగంలో ఎన్డీఏ సర్కారు మరింత కృషి చేయాల్సిన అవసరముంది.
కొలిక్కిరాని నల్లధనం వెలికితీత: విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెలికితీస్తామని మోదీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు కూడా పెద్దగా ముందడుగు పడలేదు. నిజానికి 2014లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. దోపిడీదారులు విదేశీ బ్యాంకుల్లో దాచిన డబ్బునంతటినీ వెనక్కు తెస్తే దేశ ప్రజలు ఒక్కొక్కరికి 15, 20 లక్షల రూపాయలు వస్తాయని కూడా మోదీ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ఎం.బి.షా సారథ్యంలో మోదీ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
సిట్ఆ తర్వాత నల్లధనం విషయంలో కేంద్రానికి పలు సిఫారసులు చేసింది. విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని వెల్లడించడానికి 2015లో నల్ల ధనం చట్టం చేసింది. దీనికింద రూ. 4,164 కోట్ల ఆస్తులు ప్రకటించారు. మళ్లీ 2016లో తెచ్చిన ఆదాయ ప్రకటన పథకం కింద మరో రూ. 55,000 కోట్ల ఆస్తులను వెల్లడించారు. అలాగే.. బినామీ లావాదేవీల చట్టం, రాజకీయ విరాళాల్లో సంస్కరణలు, షెల్కంపెనీలపై దాడులు, నగదు లావాదేవీలపై పరిమితులు వంటి చర్యల వల్ల మున్ముందు నల్లధనం పోగుపడటం తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. కానీ.. విదేశాల్లో దాచిన నల్లధనం విషయంలో మాత్రం ఏమాత్రం ముందడుగు పడలేదు.
నోట్ల రద్దుతో తిప్పలు: కరెన్సీ ఆధారిత దేశ ఆర్థిక వ్యవస్థలో అకస్మాత్తుగా రాత్రికి రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ సర్కారు అమలు చేసిన నిర్ణయం దేశ ప్రజలను ఒక కుదుపు కుదిపింది. అసంఘటిత రంగాన్ని గట్టిగా దెబ్బతీసింది. తాత్కాలికంగానే అయినా సరఫరా వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైంది. డిమాండ్పడిపోయింది. ఆటోమొబైల్, రియల్ఎస్టేట్, వ్యవసాయ రంగాలపై ప్రతికూల ప్రభావం చూపింది. దేశంలో దాచిన నల్లధనం వెలికితీస్తామని, అవినీతిని అంతమొందిస్తామని చెప్తూ అమలు చేసిన ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు కూడా తీవ్రంగా తప్పుపట్టారు.
దీంతో మోదీ కూడా తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. కొత్త నోట్లను మార్కెట్లోకి పంపించిన తర్వాత ఆర్నెల్లకు కానీ పరిస్థితి కుదుటపడలేదు. అయితే.. నోట్ల రద్దు నేపథ్యంలో అధిక మొత్తంలో నగదు జమచేసిన 60,000 మంది వ్యక్తులను ఆదాయ పన్నుశాఖ గుర్తించి అందులో చాలా మందికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు.. ఆదాయ పన్ను చెల్లింపులు పెరగడం, ఎక్కువ మంది ఆదాయ పన్ను పరిధిలోకి రావడం, డిజిటల్లావాదేవీల వైపు ప్రజలు పయనించడం వంటి సానుకూల ఫలితాలూ వచ్చాయి.
బ్యాంకుల బకాయిల భారం: బడా కార్పొరేట్‌సంస్థలకు ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చిన అప్పులు భారీగా పేరుకుపోవడం, అప్పుల ఎగవేతలతో నిరర్థక ఆస్తులు పోగుపడటం వంటి పరిణామాలతో ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా కనిపిస్తోంది. దేశంలో 26 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2014 జూన్‌నాటికి రూ. 2.34 లక్షల కోట్లుగా ఉన్న మొండి బకాయిలు.. 2016 డిసెంబర్‌నాటికి రూ. 6.46 లక్షల కోట్లకు పెరిగాయి. ఇక వీటికి పనర్వ్యవస్థీకరించిన రుణాలు, కొట్టివేసిన బకాయిలు తదితరాలన్నీ కలిపితే రూ. 20 లక్షల కోట్ల వరకూ ఉంటాయని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్కె.సి.చక్రవర్తి లెక్కిస్తున్నారు.
ఇక వేల కోట్ల మేర అప్పులు ఎగవేసిన విజయ్‌మాల్యా సర్కారు బ్రిటన్‌కు పారిపోవడం మోదీ సర్కారుకు ఇబ్బందికరంగా పరిణమించింది. ఆయనను వెనక్కు రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఇంకా ఫలించలేదు. ఈ మొండి బకాయిలన్నీ యూపీఏ సర్కారు పుణ్యమేనని ఆరోపిస్తున్న మోదీ సర్కారు.. బ్యాంకులను గట్టెక్కించేందుకు నిరర్థక ఆస్తులను గుర్తించి పరిష్కరించే అధికారాన్ని భారతీయ రిజర్వు బ్యాంకుకు కట్టబెడుతూ ఆర్డినెన్స్జారీ చేసింది.
(మరిన్ని వివరాలకు చదవండి)
(మోదీ మ్యానియా)
(57 విదేశీ పర్యటనలు)
(ఇండియా ఫస్ట్)
(మోదీ ప్రజల ప్రధానే..!)
(సాక్షి నాలెడ్జ్సెంటర్)