వంతెన కింద పడివున్న దంపతుల మృతదేహాలు
సాక్షి, నగరి : మనవడు జులాయిగా తిరగడానికి కారణం మీరేనంటూ కుమారుడు తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురైన తమిళనాడుకు చెందిన వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరి కీళపట్టు కువస్థలీ నది వంతెన వద్ద చోటుచేసుకుంది. ఎస్‌ఐ శివశంకర్ కథనం..తమిళనాడు తిరుత్తణి సమీపంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన దంపతులు ఇ.ఏలుమలై (79), సులోచన (56) చాలా కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు బాబు, గోపి, కుమార్తె సరళ ఉన్నారు. వీరిలో చిన్నకుమారుడు గోపి కొన్నేళ్ల క్రితం మృతిచెందాడు. అతని కుమారుడు వినోద్‌కుమార్‌ను తాత ఏలుమలై, పెదనాన్న బాబు పోషిస్తున్నారు. వినోద్‌కుమార్ జులాయిగా మారడంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి.
ఈ గొడవలు బుధవారం ఎక్కువయ్యాయి, వినోద్‌కుమార్ జులాయిగా మారడానికి మీరే కారణమంటూ తల్లిదండ్రులను బాబు గట్టిగా నిందించాడు. దీంతో మనస్తాపానికి గురైనవారు గురువారం గుడికి వెళ్లి వస్తామని చెప్పి స్వగృహం నుంచి బయలుదేరారు. తమ వద్ద ఉన్న డబ్బులతో పురుగుల మందు కొన్నారు. గురువారం రాత్రి నగరి మున్సిపాలిటీ కీళపట్టు వద్ద కుశస్థలి నది వంతెన కిందకు చేరుకున్నారు. అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం కాలకృత్యాలకు వెళ్లిన స్థానికులు వారి మృతదేహాల ను గమనించి సమాచారం చేరవేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment