చెన్నై : పుట్టిన ప్రతి జీవికీ తప్పనిసరిగా వచ్చేది మరణం. అది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరిని ఎలా మృత్యురూపంలో కబళిస్తుందో చెప్పడం కష్టం. నూరేళ్ల నిండిన వారి అనుబంధం గంట వ్యవధిలో ముగిసిపోయంది. వివరాల్లోకెళ్తే.. తమిళనాడులో శతాధిక వృద్ధ దంపతులు ఒకే రోజు తనువు చాలించారు. భర్త మరణం తట్టుకోలేని భార్య మృతదేహం వద్దే ఏడుస్తూ ప్రాణాలు విడిచింది. దీంతో వారి నిండు నూరేళ్ల బంధం, 75 సంవత్సరాల వైవాహిక బంధం ముగిసిపోయాయి. తమిళనాడు రాష్ట్రంలోని పుడుక్కొట్టాయ్ జిల్లాలో కుప్పకూడి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
కుప్పకూడి గ్రామంలో వెట్రివేల్ (104), పిచాయ్ (100) అనే శతాధిక దంపతులు ఉన్నారు. వీరికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. వీరందరికీ వివాహాలు అయిపోయాయి. ఫలితంగా ఈ వృద్ధ జంటకు 23 మంది మనవళ్లు, మనవరాండ్లు, మునిమనువళ్లు ఉన్నారు. వీరంతా ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నారు. వీరిద్దరు మంచి ఆరోగ్యవంతులు. వారి వందేళ్ల జీవిత పయనంలో జబ్బు పడ్డ సందర్భాలు కూడా చాలా తక్కువ. ఇదే విషయాన్ని అనేకసార్లు కుటుంబ సభ్యలతో ప్రస్తావించేవారు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి వెట్రివేల్‌కు ఛాతిలో నొప్పి రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్టు వెల్లడించారు. తర్వాత వెట్రివేల్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. భర్త శవం పక్కనే కూర్చోని ఏడుస్తు భార్య పిచాయి మూర్ఛపోయింది. దీంతో వైద్యులను పిలిపించి పరీక్షించగా, ఆమె కూడా ప్రాణాలు వదిలినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో 75 ఏళ్ల వైవాహిక బంధం ముగిసిపోయింది. ఈ శతాధిక వృద్ధులు చనిపోవడంతో వారి ఇంట్లోనే కాకుండా గ్రామంలో కూడా విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment