దళపతి విజయ్ కొన్ని గంటల్లో తన అభిమానులను కలవనున్నాడు. తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించిన తర్వాత తను తొలిసారి భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నాడు. దీంతో రాజకీయాలపై ఆసక్తి ఉన్న దేశ ప్రజలు అందరూ ఆయన ఏం మాట్లాడనున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలైలో విజయ్ పార్టీ తొలి మహానాడు కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే.
ప్రపంచం కీర్తించే రీతిలో వీసాలైలో పార్టీ ఆవిర్భావం, సిద్ధాంతాల వేడుకను జరుపుకుందామని కేడర్‌కు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ పిలుపునిచ్చారు. మహానాడుకు కొంత సమయం మాత్రమే ఉండడంతో కేడర్‌కు పిలుపునిస్తూ విజయ్ లేఖ రాశారు. రేపు జరిగే మహానాడు ప్రపంచమే కీర్తించే వేడుకగా నిలవబోతోందని, ఆమేరకు వేడుక జరుపుకుందామని కేడర్‌కు సూచించారు. పార్టీ జెండాలతో తరలిరావాలని, వీసాలైలలో అందరికీ ఆహ్వానం పలికేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. బ్రహ్మాండ ఏర్పాట్లు జరిగాయని, ఈ సిద్ధాంతాల వేడుకకు తన గుండెల్లో గూడు కట్టుకున్న ప్రతి అభిమాని, కేడర్‌ను సగర్వంగా ఆహ్వానిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
తొలి మహానాడులో అందర్నీ తాను నేరుగా కలవనున్నట్లు వ్యాఖ్యలు చేశారు. ఇది సిద్ధాంతాల విజయపు వేడుక అని, రెండు చేతులు చాచి ఆహ్వానం పలుకుతున్నానని ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, భద్రత, సురక్షితంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. హృదయం అనే తలుపును వీసాలై సరిహద్దుల్లో తెరచి ఉంచి ఆహ్వానిస్తుంటానని, మహానాడులో కలుద్దాం..తమిళ మట్టి గెలుపు కోసం శ్రమిద్దాం...2026 మన లక్ష్యం అని ముగించారు. కాగా, ఈ మహానాడు కోసం చేసిన ఏర్పాట్లపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. జాతీయ రహదారి వెంబడి ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు హోరెత్తించడంతో వాటిని తొలగించే విధంగా హుకుం జారీ చేశారు. అలాగే, కోయంబత్తూరులో అయితే విజయ్, అన్నాడీఎంకే దివంగత నేత ఎంజీఆర్ చిత్ర పటాలతో ఫొటోలు, ఫ్లెక్సీలు వెలిశాయి.
Comments
Please login to add a commentAdd a comment