
సాక్షి, అమరావతి : విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డీజీపీ నండూరి సాంబశివరావు శుక్రవారం సమావేశమయ్యారు. ఇవాళ చంద్రబాబును వెలగపూడి సచివాలయంలో కలిసిన డీజీపీ పలు అంశాలు ఆయన దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు అనుకూలంగా, వ్యతిరేకంగా విజయవాడలో జరుగుతున్న సమీకరణల అంశాన్ని చర్చించారు. ‘కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు’ అనే పుస్తకాన్ని రచించిన ఐలయ్యపై ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెల్సిందే.
ఈ నేపథ్యంలో ఈనెల 28న (శనివారం) కంచ ఐలయ్యకు విజయవాడలో బహుజన వేదిన ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఐలయ్యకు బ్రాహ్మణసంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఆ బెదిరింపులకు భయపడేదిలేదని ఐలయ్య స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రెండు వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు పెడితే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందుని, ఆ కార్యక్రమాలకు అనుమతి నిరాకరించినట్టు సీఎంకు డీజీపీ వివరించినట్టు తెలిసింది.
భేటీ అనంతరం డీజీపీ మాట్లాడుతూ... కులాలు, మతాలకు సంబంధించిన సభలు, ఆందోళనలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. తుని సంఘటనను దృష్టిలో పెట్టుకుని అనుమతి నిరాకరించామన్నారు. రేపు విజయవాడలో ఎలాంటి సభలకు అనుమతులు లేవని, ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉందని డీజీపీ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే అరెస్ట్‌లు తప్పవని ఆయన హెచ్చరించారు. కంచ ఐలయ్యను హౌస్ అరెస్ట్ చేయమని తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడినట్లు డీజీపీ తెలిపారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పాదయాత్రను నిరోధించాలని తాము ఏమాత్రం అనుకోవడం లేదన్నారు. అనుమతి తీసుకుని ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చని అన్నారు. అగ్రిగోల్డ్ సమస్యను త్వరగా పరిష్కరించేలా సీఐడీ కృషి చేస్తోందని డీజీపీ పేర్కొన్నారు.