DGP sambasivarao
-
ఏపీ నూతన డీజీపీగా మాలకొండయ్య
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా మాలకొండయ్య నియమితులయ్యారు. ప్రస్తుతం మాలకొండయ్య ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డీజీపీగా ఉన్న సాంబశివరావు ఈనెల 31న (ఆదివారం) పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మాలకొండయ్యను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మరోవైపు డీజీపీ సాంబశివరావుతో కలిసి మాలకొండయ్య ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. కాగా మాలకొండయ్య 1985 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన గుంటూరు జిల్లా ఎస్పీగా, డీఐజీగా కీలక పదవులు నిర్వహించారు. -
సీఎం చంద్రబాబుతో డీజీపీ సమావేశం
సాక్షి, అమరావతి : విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డీజీపీ నండూరి సాంబశివరావు శుక్రవారం సమావేశమయ్యారు. ఇవాళ చంద్రబాబును వెలగపూడి సచివాలయంలో కలిసిన డీజీపీ పలు అంశాలు ఆయన దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు అనుకూలంగా, వ్యతిరేకంగా విజయవాడలో జరుగుతున్న సమీకరణల అంశాన్ని చర్చించారు. ‘కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు’ అనే పుస్తకాన్ని రచించిన ఐలయ్యపై ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈనెల 28న (శనివారం) కంచ ఐలయ్యకు విజయవాడలో బహుజన వేదిన ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఐలయ్యకు బ్రాహ్మణసంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఆ బెదిరింపులకు భయపడేదిలేదని ఐలయ్య స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రెండు వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు పెడితే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందుని, ఆ కార్యక్రమాలకు అనుమతి నిరాకరించినట్టు సీఎంకు డీజీపీ వివరించినట్టు తెలిసింది. భేటీ అనంతరం డీజీపీ మాట్లాడుతూ... కులాలు, మతాలకు సంబంధించిన సభలు, ఆందోళనలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. తుని సంఘటనను దృష్టిలో పెట్టుకుని అనుమతి నిరాకరించామన్నారు. రేపు విజయవాడలో ఎలాంటి సభలకు అనుమతులు లేవని, ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉందని డీజీపీ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే అరెస్ట్‌లు తప్పవని ఆయన హెచ్చరించారు. కంచ ఐలయ్యను హౌస్ అరెస్ట్ చేయమని తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడినట్లు డీజీపీ తెలిపారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పాదయాత్రను నిరోధించాలని తాము ఏమాత్రం అనుకోవడం లేదన్నారు. అనుమతి తీసుకుని ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చని అన్నారు. అగ్రిగోల్డ్ సమస్యను త్వరగా పరిష్కరించేలా సీఐడీ కృషి చేస్తోందని డీజీపీ పేర్కొన్నారు. -
ఏపీ డీజీపీ పోస్టుపై రాజకీయ నీడలు!
సాక్షి, అమరావతి : శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన డీజీపీ పోస్టు రాజకీయ చట్రంలో చిక్కుకుంది. డీజీపీ నండూరి సాంబశివరావు సర్వీస్ పొడిగింపు(ఎక్స్టెన్షన్)పై నిన్న మొన్నటి వరకు సుముఖంగా ఉన్న ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మనసు మార్చుకోవడంతో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖను ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలై 26వతేదీ నుంచి పాదయాత్ర చేసేందుకు ప్రయత్నిస్తున్న ముద్రగడను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ముద్రగడ ఆగస్టు 27న పోలీస్ వలయాన్ని చేధించి కిర్లంపూడి నుంచి రాజుపాలెం వరకు పాదయాత్ర కొనసాగించటంతో ప్రభుత్వానికి మింగుడు పడలేదు. ఇదే అదనుగా కొందరు మంత్రులు దీన్ని డీజీపీ మెడకు చుట్టినట్టు తెలిసింది. సీఎం సీరియస్ కావడంతో ముద్రగడను అరెస్టు చేస్తారా? నేనే రావాలా? అంటూ డీజీపీ నేరుగా తూర్పుగోదావరి పోలీస్ అధికారులను హెచ్చరించారనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు రాజుపాలెం వద్ద ముద్రగడను అరెస్టు చేసి ఇంటికి తరలించిన పోలీసులు గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్నారు. అయితే డీజీపీపై ప్రభుత్వ పెద్దల ఆగ్రహం మాత్రం ఇంకా చల్లారలేదు. రేసులో ముగ్గురు.. డీజీపీ సాంబశివరావు ఈ ఏడాది డిసెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన సర్వీస్‌ను మరో రెండేళ్లు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని భావించినా కొందరు అడ్డుపడటంతో సీఎం మనసు మారినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 1985 బ్యాచ్‌కు చెందిన మాలకొండయ్య, 1986 బ్యాచ్‌కు చెందిన కౌముదిలతోపాటు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ పేర్లను డీజీపీ పోస్టు కోసం ఐపీఎస్ ప్యానల్‌కు ప్రతిపాదిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్న మాలకొండయ్యకు మరో ఏడాది ఆర్టీసీ ఎండీగా ఎక్స్టెన్షన్ ఇస్తామని నచ్చజెప్పి రేసు నుంచి తప్పించాలని భావిస్తున్నారు. ఏపీ క్యాడర్‌కు చెందిన కౌముది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఎ)లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ఆయనను ఏపీకి తీసుకొచ్చి డీజీపీ పోస్టు ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు ఆసక్తి చూపడంలేదు. ఈ నేపథ్యంలో ఠాకూర్‌ను డీజీపీగా చేయాలని ఓ యువనేత పట్టుబడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. -
24న డీజీపీ సాంబశివరావు రాక
అనంతపురం సెంట్రల్ : రాష్ట్ర పోలీస్‌బాస్(డీజీపీ) సాంబశివరావు ఈనెల 24న జిల్లాకు వస్తున్నారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి జిల్లాకు వస్తున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు హయాంలో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ముఖ్యంగా కోర్టురోడ్డులో నిర్మించిన పెట్రోల్‌బంక్‌ను డీజీపీ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో పోలీసుల ఆధ్వర్యంలో పెట్రోల్‌బంక్‌లు నిర్వహించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో దీన్ని నిర్మించారు. కనుక డీజీపీ చేతులు మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. 25,26 తేదీల్లో ఎస్పీ రాజశేఖరబాబు రిలీవ్ : డీజీపీ సాంబశివరావు జిల్లా పర్యటన ముగిసిన తర్వాతే ఎస్పీ రాజశేఖరబాబు రిలీవ్, నూతన ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాలు ఉంటాయని పోలీసువర్గాలు వెల్లడించాయి. జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు చిత్తూరుకు, విజయవాడ డీసీపీ అశోక్‌కుమార్‌ను జిల్లాకు నియమించిన విషయం విదితమే. -
డీజీపీని కలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు
విజయవాడ: ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం డీజీపీ సాంబశివరావును కలిశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారు ఈ సందర్భంగా డీజీపీకి విజ్ఞప్తి చేశారు. అనంతరం శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రాష్ట్రంలో అన్యాయంగా వైఎస్ఆర్ సీపీ నేతలపై కేసులు పెడుతున్నారన్నారు. గుంటూరు జిల్లా ఘటనపై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేయడానికి స్థానిక పోలీసులు మూడుసార్లు ఎఫ్ఐఆర్ను మార్చారన్నారు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకు వెళ్లామని తెలిపారు. పార్టీ నేత మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ... టీడీపీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, అధికార పార్టీ నాయకులే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
అగ్రిగోల్డ్ దర్యాప్తులో సీఐడీకి అధికారాలు
విజయవాడ: అగ్రిగోల్డ్ కేసులో కోర్టుల ఆధ్వర్యంలో దర్యాప్తునకు సీఐడీకి పూర్తి అధికారాలున్నాయని డీజీపీ సాంబశివరావు తెలిపారు. సీఐడీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ ఆస్తుల గుర్తింపు, వేలం ప్రక్రియ కొనసాగుతుందని ఆయన శుక్రవారమిక్కడ చెప్పారు. రాష్ట్రంలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని, వారికి రూ.4వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని డీజీపీ వెల్లడించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 30 అమలులో ఉన్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో కాపునేత ముద్రగడ చేపట్టే పాదయాత్రకు అనుమతి లేదని చెప్పారు. జిల్లాలో పాదయాత్రలో అసాంఘిక శక్తులు చొరబడి హింసకు పాల్పడుతారనే సమాచారం తమకు ఉందని అన్నారు. ఇక వైఎస్ఆర్ జిల్లాలో బలిజ శంఖారావం సభకు అనుమతి కోసం పోలీసులకు ఎటువంటి దరఖాస్తు అందలేదని వెల్లడించారు. -
కమాండ్ కంట్రోల్‌ను పరిశీలించిన డీజీపీ
తిరుపతి క్రైం: ఈస్ట్ పోలీస్‌స్టేషన్ మిద్దెపైనున్న కమాండ్ కంట్రోల్‌ను డీజీపీ సాంబశివరావు పనితీరును పరిశీలించారు. తిరుపతి చేరుకున్న ఆయనకు ఈస్ట్ సబ్ డివిజనల్ డీఎస్పీ మురళీకృష్ణా, సీఐ రాంకిషోర్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నిమిత్తం తిరుమల, తిరుపతికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా చూడాలని చెప్పారు. అవసరమైతే మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ–చలానా ఆన్లైన్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ రూంలో సీసీ కెమెరాల ద్వారా పరిష్కరించిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఫొటోగ్యాలరీని పరిశీలించి, చక్కగా ఉందని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు, అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి, ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ, ట్రాఫిక్ డీఎస్పీ దిలీప్ కిరణ్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలి
డీజీపీ సాంబశివరావు విజయవాడ (భవానీపురం) : పుష్కరాలకు వచ్చే భక్తులతో స్నేహపూర్వక వాతావరణంలో పనిచేయాలి తప్ప, వారితో అమర్యాదగా వ్యవహరించవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని డీజీపీ ఎన్.సాంబశివరావు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం పున్నమిఘాట్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజులతో పోలిస్తే ఆదివారం భక్తులు రెట్టింపుగా రావడంతో పుస్కరఘాట్లు కళకళలాడుతున్నాయన్నారు. దుర్గగుడి, పున్నమి, భవానీ ఘాట్లవైపు ఉచిత బస్సు సౌకర్యాని ఆదివారం నుంచి కల్పించామని, అయితే భక్తుల రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో దుర్గాఘాట్ వద్ద కొంతసేపు ట్రాఫిక్‌ను నియంత్రించామని చెప్పారు. పరిస్థితినిబట్టి అవసరమైతే మళ్లీ ఉచిత బస్సులను పునరుద్దరిస్తామని తెలిపారు. -
విశాఖలో ఆక్టోపస్
ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తం వచ్చే నెల విశాఖలో సైబర్ క్రై మ్పై ప్రత్యేక సెమినార్ డీజీపీ ఎన్.సాంబశివరావు వెల్లడి సాక్షి, విశాఖపట్నం: పీఎల్‌జిఏ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తమయ్యామని డీజీపీ ఎన్.సాంబశివరావు అన్నారు. ఇందులో భాగంగా ఆయన బుధవారం విశాఖ మన్యంలో హెలికాఫ్టర్‌లో పర్యటించారు. అనంతరం గ్రేహౌండ్స్ అధికారులు, రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, ఇంటెలిజెన్స్ ఐజీ చంద్రశేఖరరావులతో విశాఖలోని గ్రేహౌండ్స్ కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు. నగర పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించి కమిషనర్ టి,యోగానంద్‌తో పాటు ఉన్నతాధికారులతో నేర సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించి ఉన్నతాధికారులను, ప్రజా ప్రనితిధులను అప్రమత్తం చేశామన్నారు. మావోయిస్టుల ఉ ద్యమం 32 ఏళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు ఏమంత లేదన్నారు. విశాఖలో గ్రే హౌండ్స్ ఇప్పటికే ఉండగా, ఆక్టోపస్ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. సైబర్‌క్రై మ్స్, రాత్రివేళ గహల్లో దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నట్లు నగర నేర సమీక్షలో గుర్తించామన్నారు. త్వరలోనే కొన్ని కొత్త విధానాలు ప్రవేశపెట్టి వీటిని తగ్గించడానికి ప్రయత్నిస్తామన్నారు. మోసాలు చేసేవాళ్లు ఎక్కువయ్యారని, సాంకేతిక పరిజ్ఙానాన్ని వాడుకొని నేరాలకు పాల్పడుతుంటే అందుకు తగ్గట్టుగా నిందితులను పట్టుకోవడంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ బాగానే పోలీసులు పరిష్కరిస్తున్నారన్నారు. సైబర్ నేరాలను ఎలా అరికట్టాలనేదానిపై వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిపుణులను రప్పించి వర్క్‌షాప్ నిర్వహించున్నట్లు ఆయన వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, కొద్ది రోజులుగా వస్తున్న ఆ మార్పు గమనించవచ్చని తెలిపారు. ఊహించని చోట్ల ప్రపంచంలో ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో వారి కదలికలను తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని సాంబశివరావు తెలిపారు. కృష్ణా పుష్కరాలకు 24వేల మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. డిప్లొమా, ఇంటర్మీడియెట్ చదివిన వారికి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో అవకాశంపై పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. డీజీపీకి సాదర స్వాగతం గోపాలపట్నం : విశాఖ విమానాశ్రయంలో డీజీపీ సాంబశివరావుకు పోలీసు ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. హైదరాబాదు నుంచి వచ్చిన ఆయన్ని పోలీసు కమిషనర్ యోగానంద్, రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, సహాయ పోలీసు కమిషనర్ భీమారావు తదితర అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. -
కొత్త పోలీస్ బాస్‌గా సాంబశివరావు బాధ్యతలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కొత్త పోలీస్ బాస్‌గా సాంబశివరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. డీజీపీగా ఇవాళ పదవీ విరమణ చేసిన రాముడు... సాంబశివరావుకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న సాంబశివరావును ప్రభుత్వం ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు సాంబశివరావుకు అభినందనలు తెలిపారు. పోలీసుల్ని వృత్తి నిపుణులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని డీజీపీ తెలిపారు. టెక్నాలజీ సాయంతో ప్రజలకు సేవ చేసేలా పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తానన్నారు. గోదావరి పుష్కరాల్లో లోపాల్ని దృష్టిలో పెట్టుకొని కృష్ణా పుష్కరాలను సమర్ధవంతంగా నిర్వహిస్తామని డీజీపీ సాంబశివరావు హామీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారుడు సంతృప్తికరంగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూస్తామని సాంబశివరావు తెలిపారు.