విశాఖలో ఆక్టోపస్
-
ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన
-
పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తం
-
వచ్చే నెల విశాఖలో సైబర్ క్రై మ్‌పై ప్రత్యేక సెమినార్
-
డీజీపీ ఎన్.సాంబశివరావు వెల్లడి
సాక్షి, విశాఖపట్నం: పీఎల్‌జిఏ వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తమయ్యామని డీజీపీ ఎన్.సాంబశివరావు అన్నారు. ఇందులో భాగంగా ఆయన బుధవారం విశాఖ మన్యంలో హెలికాఫ్టర్‌లో పర్యటించారు. అనంతరం గ్రేహౌండ్స్ అధికారులు, రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, ఇంటెలిజెన్స్ ఐజీ చంద్రశేఖరరావులతో విశాఖలోని గ్రేహౌండ్స్ కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు. నగర పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించి కమిషనర్ టి,యోగానంద్‌తో పాటు ఉన్నతాధికారులతో నేర సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టులు పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించి ఉన్నతాధికారులను, ప్రజా ప్రనితిధులను అప్రమత్తం చేశామన్నారు. మావోయిస్టుల ఉ ద్యమం 32 ఏళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు ఏమంత లేదన్నారు. విశాఖలో గ్రే హౌండ్స్ ఇప్పటికే ఉండగా, ఆక్టోపస్ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. సైబర్‌క్రై మ్స్, రాత్రివేళ గహల్లో దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నట్లు నగర నేర సమీక్షలో గుర్తించామన్నారు. త్వరలోనే కొన్ని కొత్త విధానాలు ప్రవేశపెట్టి వీటిని తగ్గించడానికి ప్రయత్నిస్తామన్నారు.
మోసాలు చేసేవాళ్లు ఎక్కువయ్యారని, సాంకేతిక పరిజ్ఙానాన్ని వాడుకొని నేరాలకు పాల్పడుతుంటే అందుకు తగ్గట్టుగా నిందితులను పట్టుకోవడంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ బాగానే పోలీసులు పరిష్కరిస్తున్నారన్నారు. సైబర్ నేరాలను ఎలా అరికట్టాలనేదానిపై వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిపుణులను రప్పించి వర్క్‌షాప్ నిర్వహించున్నట్లు ఆయన వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, కొద్ది రోజులుగా వస్తున్న ఆ మార్పు గమనించవచ్చని తెలిపారు. ఊహించని చోట్ల ప్రపంచంలో ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో వారి కదలికలను తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని సాంబశివరావు తెలిపారు. కృష్ణా పుష్కరాలకు 24వేల మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. డిప్లొమా, ఇంటర్మీడియెట్ చదివిన వారికి కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో అవకాశంపై పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
డీజీపీకి సాదర స్వాగతం
గోపాలపట్నం : విశాఖ విమానాశ్రయంలో డీజీపీ సాంబశివరావుకు పోలీసు ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. హైదరాబాదు నుంచి వచ్చిన ఆయన్ని పోలీసు కమిషనర్ యోగానంద్, రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, సహాయ పోలీసు కమిషనర్ భీమారావు తదితర అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.