
హైదరాబాద్: విజయవాడ సభకు హాజరుకావొద్దంటూ ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు శుక్రవారం ఏపీ పోలీసులు నోటీసులందించి గృహ నిర్బంధం చేశారు. ఈ నెల 28న విజయవాడలో ప్రజా, కుల సంఘాలు, వామపక్షపార్టీలు నిర్వహించే సభకు ఐలయ్యను ముఖ్యఅతిథిగా ఆహ్వానించాయి. ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు.. కోమటోళ్లు’ పుస్తకం వివాదాస్పదమైన నేపథ్యంలో అదే రోజున విజయవాడలో ఆర్యవైశ్య, బ్రాహ్మణ వేదిక నాయకులు పోటీగా మరో బహిరంగసభ నిర్వహించనున్నారు. ఐలయ్య విజయవాడకు వస్తే అడ్డుకుంటామంటూ వేదిక నాయకులు హెచ్చరించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఏపీ పోలీసులు హైదరాబాద్ తార్నాకలోని ఐలయ్య ఇంటికి వచ్చారు. ‘మీరు సభకు హాజరైతే శాంతి భద్రతసమస్య తలెత్తుతుంది.
అందుకే సభకు అనుమతించబోం’అంటూ ఆయనకు నోటీసులు అందించి గృహనిర్బంధం చేశారు. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు, విద్యార్థులు ఆయన ఇంటికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు దురుద్దేశంతో తమ సభను అడ్డుకునేందుకు ఆర్యవైశ్యులతో మరో సభను ఏర్పాటు చేయించారని ఆరోపించారు. విజయవాడ సభకు వెళ్లాలా..? వద్దా అనే విషయమై శనివారం ఉదయం జరిగే టీ–మాస్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment