కీలక ఆధారాలు ధ్వంసం చేసే దిశగా చర్యలు
జత్వానీ అరెస్టు సమయంలో ఫోన్లు స్వాధీనం
ప్రభుత్వం మారిన తర్వాత ఫోన్లు ఇవ్వాలని కోరిన జత్వానీ
వెంటనే వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి విజయవాడ తెచ్చిన పోలీసులు
న్యాయస్థానాన్ని విస్మరించి మరీ ఫోన్ల అప్పగింతకు నిర్ణయం!
ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీసుల దుందుడుకు చర్య!
సాక్షి, అమరావతి : అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీ నేతలను వేధించాలన్న రాజకీయ కుట్రతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బరితెగిస్తోంది. ఏకంగా న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశాల్లో కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. వలపు వల (హనీట్రాప్)తో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలను బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతున్న ఈ ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసేలా విజయవాడ పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు ఇటువంటి దుందుడుకు చర్యలకు దిగుతున్నారు.
కీలక సాక్ష్యాలు సేకరించిన ఆనాటి పోలీసులు
హనీట్రాప్‌తో కాదంబరి జత్వానీ మోసాలపై 2019 ఫిబ్రవరిలో ఫిర్యాదు వచ్చింది. ఆమె తనను వేధిస్తోందని, జగ్గయ్యపేట వద్ద ఉన్న తన 5 ఎకరాలను ఫోర్జరీ పత్రాలు సృష్టించి మరీ విక్రయించేందుకు యత్నిస్తోందని కుక్కల విద్యాసాగర్ అనే పారిశ్రామికవేత్త ఆధారాలతోసహా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై బాధ్యతాయుతంగా స్పందించిన విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయస్థానం అనుమతితో ముంబై వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో ఆమెను అరెస్ట్ చేశారు.
ఆమెను విచారించి కీలక ఆధారాలు సేకరించారు. జత్వానీ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను ముంబైలోని న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్ వారంట్‌పై విజయవాడకు తీసుకువచ్చి ఇక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో విజయవాడలోని సబ్ జైలుకు తరలించారు.
ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షల నిమిత్తం న్యాయస్థానం అనుమతితో ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించారు. ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉంది. కీలక ఆధారాలైన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఫోరెన్సిక్ లేబొరేటరీలోనే ఉన్నాయి.
టీడీపీ ప్రభుత్వం రాగానే..
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ కేసును నీరుగార్చే కుట్రకు తెరలేచింది. అంతేకాదు.. ఆనాటి ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపునకు ఈ కేసును వక్రీకరిస్తూ టీడీపీ ప్రభుత్వం కుతంత్రానికి తెరతీసింది. టీడీపీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల కనుసన్నల్లో ఈ కుట్రను అమలు చేశారు. కాదంబరి జత్వానీతో ఆనాటి ఐపీఎస్ అధికారులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించారు.
అనంతరం ఆమె విజయవాడ వచ్చి గతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న తన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అప్పగించాలని కోరారు. ఆమె కోరిందే తడవుగా ప్రస్తుత విజయవాడ పోలీసులు ఆఘమేఘాలపై స్పందించారు. ఫోరెన్సిక్ లేబొరేటరీలో ఉన్న ఆమె ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విజయవాడ తెచ్చేశారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసులో కీలక ఆధారాలు తీసుకువచ్చేందుకు న్యాయస్థానం అనుమతి తీసుకోవాలన్న ఆలోచన కూడా పోలీసులు చేయలేదు.
దీనిపై కిందిస్థాయి పోలీసు అధికారి ఒకరు అభ్యంతరం తెలపడంతో వాటిని ప్రస్తుతానికి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. కొద్ది రోజుల్లోనే వాటిని జత్వానీకి అప్పగించాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులో కీలక ఆధారాలు ధ్వంసం కాకుండా పోలీసులను కట్టడి చేయాలని ఫిర్యాదుదారు కుక్కల విద్యాసాగర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కీలక ఆధారాలు ధ్వంసం చేసే కుట్రే!
కాదంబరి జత్వానీ కుట్ర, మోసానికి సంబంధించిన కీలక ఆధారాలను ధ్వంసం చేసేందుకే విజయవాడ పోలీసులు ఆమె ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఆమెకు అప్పగించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం కేసులో కీలక ఆధారాలను నిందితులకు, మరెవ్వరికీ కూడా అప్పగించకూడదు. కేసు ముగిసేవరకు వాటిని ఫోరెన్సిక్ లేబొరేటరీ లేదా పోలీసులు లేదా న్యాయస్థానం ఆధీనంలోనే ఉంచాలి. కానీ జత్వానీ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆమెకు అప్పగించేందుకు నిర్ణయించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment