పలు కేసుల్లో నిందితురాలికి విశిష్ట మర్యాదలు చేస్తున్న పోలీసులు
వివాదాస్పదంగా మారిన విజయవాడ పోలీసుల వైఖరి
ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే విజయవాడ పోలీసుల అతి
అదే అదనుగా పోలీసులనే బ్లాక్‌మెయిల్ చేస్తున్న జత్వానీ
సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం : వలపువల విసిరి బడా బాబులను బురిడీ కొట్టించే కాదంబరి జత్వానీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఏకంగా విశిష్ట అతిథిగా మారిపోయారు. ఫోర్జరీ పత్రాలతో భూములు విక్రయించే మోసానికి పాల్పడిన కేసులో నిందితురాలైన ఆమెను రాష్ట్ర ప్రభుత్వ మర్యాదలు లభిస్తుండటం విస్మయపరుస్తోంది.
తాను చెప్పింది చేయాలంటూ ఏకంగా పోలీసు శాఖనే బ్లాక్‌మెయిల్ చేసే స్థాయిలో ఆమె చెలరేగిపోతుండటం.. విజయవాడ పోలీసులు ఆమె డిమాండ్లకు జీహుజూర్ అంటుండటం వెనుక ప్రభుత్వ పెద్దల వత్తాసు ఉందన్నది స్పష్టమవుతోంది. విజయవాడ పోలీసులు అధికారులు, సిబ్బందితో కూడిన బృందాన్ని అనధికారికంగా కేటాయించడం, ఆమెకు ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేయడం విస్మయపరుస్తోంది.
కొన్ని రోజులుగా విజయవాడలోనే ఉంటున్న ఆమెకు విజయవాడ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ అతిథి స్థాయిలో ప్రొటోకాల్ మర్యాదలు అందిస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడలోని స్టార్ హోటల్ వరకు ఆమెకు పోలీసులు ఎస్కార్ట్‌గా ఉంటున్నారు.
పోలీసులనే బ్లాక్ మెయిల్
కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఆమెను ఓ సాధనంగా మలచుకున్నారు. తాము చెప్పినట్టుగా కొందరికి వ్యతిరేకంగా ఫిర్యాదులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు ఆమెకు చెప్పినట్టు సమాచారం. ఏకంగా పోలీసు అధికారులనే బ్లాక్ మెయిల్ చేసే స్థాయిలో ఆమె వ్యవహరిస్తున్నారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తనను వేధించారంటూ విజయవాడలో గతంలో పనిచేసిన ముగ్గురు పోలీసు అధికారులతో పాటు పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌పై కేసు నమోదు చేయాలని ఆమె పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఐపీఎస్ అధికారులపై కేసు నమోదు చేయాలని ఒత్తిడి చేయడంపై పోలీసు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఆమె శుక్రవారం సాయంత్రం హఠాత్తుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసి.. వెంటనే కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. కేసు నమోదు చేసేవరకు పోలీస్ స్టేషన్ నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు.
జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుని తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. కాగా ఇప్పటికే కేసు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు వ్యవహరిస్తున్నారని సమాచారం. అసలు జత్వానీకి ఏ హోదాతో అంతటి ప్రాధాన్యం ఇస్తున్నారన్నది పోలీసువర్గాల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment