ఉత్తరాదిన కొత్త ఉరుములు | Kancha Ilaiah Comment on Ramcharitmanas Tulasidas criticism Holybook | Sakshi
Sakshi News home page

ఉత్తరాదిన కొత్త ఉరుములు

Published Fri, Feb 3 2023 3:47 AM | Last Updated on Fri, Feb 3 2023 3:47 AM

Kancha Ilaiah Comment on Ramcharitmanas Tulasidas criticism Holybook - Sakshi

పదహారవ శతాబ్దపు భక్తకవి తులసీదాసు రాసిన ‘రామ్‌చరిత్‌మానస్‌’ ఇప్పుడు ఉత్తరాదిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రాచీన, మధ్య యుగాల్లో ద్విజులు రాసిన ఇతర గ్రంథాలకు వ్యతిరేకంగా శూద్ర, దళిత రాజకీయనేతలు నేడు మొట్టమొదటిసారిగా మేధా పోరాటానికి పిడికిలి బిగిస్తున్నారు. ఆ పుస్తకాలను ఆయుధాలుగా చేసుకుని ఆరెస్సెస్, బీజేపీలు సమకాలీన హిందూ జాతీయవాదాన్ని నిర్మించి అన్ని విద్యా సంస్థలపై ఆధిపత్యాన్ని నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నాయన్నది వారి ప్రధాన ఆరోపణ. అందుకే వారు శూద్రులు, దళితులు వర్సెస్‌ ద్విజులు అనే కొత్త వ్యూహంలోకి ఆరెస్సెస్, బీజేపీని లాగడం ద్వారా ఉత్తరాదిన సరికొత్త యుద్ధానికి తెర తీయడానికి సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. 

గోస్వామి తులసీదాస్‌ రాసిన రామ్‌చరిత్‌ మానస్‌ ఇప్పుడు ఉత్తర భారతదేశంలో... ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో కుల యుద్ధాన్ని రాజేస్తోంది. ఆ ప్రాంత బ్రాహ్మణులు, క్షత్రియులు ఈ పుస్తకాన్ని తమ ఆధ్యాత్మిక రామాయణంగా భావిస్తుంటారు. అయితే ఈ పుస్తకంలో శూద్రులకు, దళితులకు వ్యతిరేకంగా అవమానకరమైన ద్విపదలు ఉన్నాయని ఆరోపిస్తూ తాజాగా ఇద్దరు శూద్ర ఓబీసీ నేతలు స్వామి ప్రసాద్‌ మౌర్య (సమాజ్‌వాది పార్టీ–యూపీ), బీహార్‌ విద్యామంత్రి చంద్రశేఖర్‌ (ఆర్జేడి) పుస్తకాన్ని నిషేధించాలన్న డిమాండ్‌తో పోరు ప్రారంభించారు. ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ సైతం తన బలమైన శూద్ర నేపథ్యంతో పుస్తకంపై తీవ్ర వైఖరిని చేపట్టారు. 

సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ 2023 జనవరి 29న ఒక పత్రికా సదస్సులో ప్రసంగిస్తూ... ‘‘నేను శూద్రుడినా లేక శూద్రుడిని కాదా తెలీదు కానీ, నేను రాముడికి వ్యతిరేకం కాదు. మరే ఇతర హిందూ దేవుడికి కూడా వ్యతిరేకం కాదు. అయితే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రామ్‌చరిత్‌మానస్‌ నుంచి శూద్రుల గురించి ప్రస్తావించిన ఆ పంక్తులను పఠించగలరా?’’ అని ప్రశ్నించారు. ఈ అంశం గురించి ఒక జర్నలిస్టు మళ్లీ ప్రశ్నించి చీకాకు పరచినప్పుడు ‘మీకు తెలిసి ఉంటే వాటిని చదవగలరా?’’ అని అడిగారు. అప్పుడు ఆ జర్నలిస్టు ఆ పంక్తిని చదివి వినిపించారు. ‘‘డోలు, నిరక్ష్యరాస్యుడు, శూద్రుడు, పశువు, మహిళ... వీళ్లందరూ శిక్షార్హులే..’’ అన్నది ఆ పంక్తి సారాంశం. అప్పుడు అఖిలేష్‌ ఆ జర్న లిస్టును ‘‘ఆ పంక్తులు శూద్రులను, దళితులను, స్త్రీలను అవమానిస్తు న్నాయా లేదా?’’ అని ప్రశ్నించారు. ‘‘సీఎం యోగి అయినందున ఈ పంక్తులను రాష్ట్ర అసెంబ్లీలో చదవాలని నేను అడుగుతాను’’ అన్నారు. 

అంతకు ముందు అఖిలేష్‌ యాదవ్‌ ఒక ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ఆయనను అడ్డుకోవాలని చూశాయి. రామ్‌చరిత్‌మానస్‌ శూద్రులను, దళితులను, మహిళలను అవమానిస్తోందని, ఆ పుస్తకాన్ని నిషేధించాలని చెప్పిన ఎస్పీ నేత స్వామి ప్రసాద్‌ మౌర్యపై చర్య తీసుకోవాలని ఆ రెండు పార్టీలవారు నినదించారు. మౌర్య హిందువుల మనోభావాలను గాయపర్చారని వారి ఆక్షేపణ. కేసులు పెట్టారు. కానీ ఆయన తన వైఖరికి కట్టుబ డ్డారు. ఆలయం వద్ద అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారికి అఖిలేష్‌ కూడా గట్టిగా సమాధానమిచ్చారు. వెనుకబడిన వర్గాల (ఓబీసీల)ను, దళితులను మొత్తంగా శూద్రులుగా బీజేపీ పరిగణిస్తోందని, బీజేపీలో ఉంటున్నవారితోపాటు, పార్టీకి ఓటు వేస్తున్న శూద్రులను, దళితు లను, మహిళలందరినీ రావ్‌ుచరిత్‌ మానస్‌ అవమానిస్తోందని మౌర్య పేర్కొన్నారు. బీహార్‌ విద్యా మంత్రి ఆర్జేడీ నేత చంద్రశేఖర్‌ కూడా ‘‘రావ్‌ుచరిత్‌మానస్‌ మనుస్మృతి లాగా, ఆర్‌ఎస్‌ఎస్‌ రెండో సర్‌సంఘ్‌ చాలక్‌ (ఛీఫ్‌) ఎమ్‌ఎస్‌ గోల్వాల్కర్‌ రచించిన గ్రంథం ‘పాంచజన్యం’లాగా ఒక విభజన గ్రంథం’’ అని అన్నారు. 

ఈ నేపథ్యంలోనే... ప్రాచీన, మధ్యయుగాల్లో బ్రాహ్మణులు రాసిన కుల గ్రంథాలకు వ్యతిరేకంగా ఉత్తర భారత శూద్ర, దళిత రాజ కీయనేతలు మేధాపోరాటం చేస్తున్నారు. ‘‘ఈ పుస్తకాలను ఉపయో గించుకోవడం ద్వారా ఆరెస్సెస్, బీజేపీలు సమకాలీన హిందూ జాతీయవాదాన్ని నిర్మించి అన్ని విద్యా సంస్థలపై ఆధిపత్యాన్ని నెల కొల్పాలని చూస్తు్తన్నాయి. ఆహార ఉత్పత్తిదారులు, తోలుపని వారు, వడ్రంగులు, కుమ్మరులు, పశుపోషకులు, గొర్రెలకాపర్లు వంటి వారిని గౌరవించకూడని, వారు పనికిమాలిన వారని సూచించడానికి ‘శూద్ర’, ‘చండాల’ భావనలను ఈ పుస్తకాలు చాలా వరకు వ్యాపింపజేశాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదవటానికి, విద్యను అభ్యసించడానికి వీరికి అర్హత లేదని, సమాజంలో గౌరవం పొందే అర్హత వీరికి లేదని ఈ పుస్తకాలు చెప్పాయి. అలాగే ఆలయాల్లో ప్రవేశించడానికి వీరికి అనుమతి లేదని పేర్కొన్నాయి’’ అని ఆరోపిస్తున్నారు. 

ఓబీసీ, దళిత్‌ వంటి సమకాలీక వర్గీకరణలను స్వాతంత్య్రానంతర భారత్‌లో కులాలు, కమ్యూనిటీల కోసం దాదాపుగా వాడేవారు. గతంలో ఓబీసీలు, దళితులు బ్రాహ్మణ పుస్తకాలను నిశితంగా పరిశీ లించలేదు. అందుచేత తమ గురించి ఈ పుస్తకాలు ఏమని పేర్కొ న్నాయన్నది వీరు ఎన్నటికీ అర్థం చేసుకోలేదు. భారతదేశంలోని ఓబీసీలను ఏమాత్రం అర్థం చేసుకోకుండానే శూద్రులు అనే వర్గీ కరణను పై పుస్తకాల్లో రాసేశారు. అందుకే జాతీయవాద సమయంలో జాట్లు, పటేళ్లు, మరాఠీలు, కమ్మవారు, రెడ్లు, లింగాయతులు, నాయర్లు తదితరులు శూద్ర హోదాను కాకుండా క్షత్రియత్వాన్ని తాము పొందవచ్చని ఆలోచించారు. శూద్ర హోదా అవమాన కరమైనదని వారు భావించారు. ప్రాచీన, మధ్యయుగాలకు చెందిన రచనల్లో చాలా మంది బ్రాహ్మణ రచయితలు శూద్ర, చండాల అనే భావనను వారు పనికిరానివారు అని చిత్రించేందుకు ఉపయోగించారు. రుగ్వేదం రచించిన రోజుల నుంచి ఇది చారిత్రకంగా సాగుతూ వచ్చింది. వారు తమను తాము హిందువులుగా ఎన్నటికీ భావించలేదు. ముస్లిం చరిత్రకారుడు అల్‌ బెరూనీ (క్రీ.శ. 973–1053) ‘అల్‌–హింద్‌’ అనే పుస్తకం రాసిన తర్వాతే, హిందూ అనే భావన భారతీయ నిఘంటువులోకి వచ్చి చేరింది. అయితే ఇప్పుడు ఆరెస్సెస్, బీజేపీ భావ వ్యాప్తిలో ముస్లింలకు మొహమ్మద్‌ ఎలాగో, తులసీదాసు కూడా అలాగే గొప్ప హిందూ ప్రవక్త అయిపోయారు. ప్రవక్తను విమ ర్శించేవారు ఎవరైనా సరే, చంపేస్తామనే బెదిరింపులకు లోనయ్యే వారు. ఇప్పుడు స్వామి మౌర్యను అంతమొందించాలని ఒక హిందూ మతగురువు ఇప్పటికే ఫత్వా జారీ చేశారు. కానీ శూద్రులు, దళితుల విషయంలో ఎవరైనా ఇలాంటి విమర్శ చేస్తే వారికి ఏమీ కాదు. 

ఓబీసీ మహాసభ సభ్యులు గత వారం రామ్‌చరిత్‌మానస్‌ పుట లను బహిరంగంగా తగులబెట్టారు. ఈ దేశం అగ్రరాజ్యమని నేడు ఆరెస్సెస్, బీజేపీ శక్తులు పిలుస్తున్నాయి. అయితే శూద్రుల, దళితుల, ఆదివాసీల శ్రమ మాత్రమే ఈ దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇది భారతదేశం గురించిన నూతన భావన. ఆరెస్సెస్, బీజేపీ అధికారంలోకి వచ్చాక, అధికార కుల రాజకీయాలు నిశిత పరీక్షకు గురవుతున్నా యన్న విమర్శ ఉంది. ఎందుకంటే సామాజిక, రాజకీయ ప్రక్రియలో ఈ కులతత్వపు గ్రంథాలను పాలకవర్గ శక్తులు తిరిగి రుద్దాలని కోరుకుంటున్నాయి. తమ ఉనికిని, భవిష్యత్తును సరికొత్త ఉచ్చులోకి దింపే ప్రయత్నం జరుగుతోందని శూద్ర, ఓబీసీ, దళితులు మెల్లగా గుర్తిస్తున్నారు. గతంలో ఓబీసీలు, దళితులు రిజర్వేషన్‌ చుట్టూనే పోరా డుతూ వచ్చారు. ఆరెస్సెస్, బీజేపీలు ఉద్యోగాలను ప్రైవేటీకరించడం ద్వారా, దాదాపు ఈ సమస్యను అసంగతంగా మార్చి వేశాయి. ద్విజ నాయకత్వం కింద ముస్లింలు శత్రువులు అనే ముద్రను బలంగా చొప్పించడం ద్వారా శూద్రులు, దళితులను ద్విజ నియంత్రణలోకి తీసుకురావాలని వీరు కోరుకున్నారు. క్రమంగా ఈ ఎజెండాలో తమను ఉచ్చులోకి లాగుతున్నారని శూద్రశక్తులు గ్రహిస్తున్నాయి. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలని ఆరెస్సెస్, బీజేపీ కోరుకుంటున్నాయి. బెంగాల్, ఒడిషా తప్ప దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు, మండల్‌ విప్లవం తర్వాత పుట్టుకొచ్చిన శూద్ర నేతల ఆధిపత్యంలో ఉంటున్నాయన్నది గమనించాలి.  

శూద్ర, దళిత కమ్యూనిటీల నుంచి మేధావులు ఆవిర్భవిస్తుండటంతో, రామ్‌చరిత్‌మానస్, ఇతర ప్రాచీన సంçస్కృత గ్రంథాల చుట్టూ కొత్త చర్చలు మొదలు కానున్నాయి. అఖిలేష్‌ శూద్రుడు కాబట్టి 2016 యూపీ ఎన్నికల్లో ఓడిపోయి, ముఖ్యమంత్రిగా అధికార నివా సాన్ని ఖాళీ చేసినప్పుడు ఆవు పాలతో, గోమూత్రంతో సీఎం నివా సాన్ని శుద్ధి చేసి యోగి ఆదిత్యనాథ్‌ తనను ఎంతగా అవమానించిందీ అఖిలేష్‌కి, శూద్రులు, దళితులకు ఇంకా గుర్తుంది. ఇప్పుడిక రామ్‌ చరిత్‌మానస్‌ లేవనెత్తిన సమస్యతో ఉత్తర భారతదేశంలో అనేక కుల సాంస్కృతిక పోరాటాలు ప్రధాన భూమికలోకి రానున్నాయి.

ప్రొ‘‘ కంచ ఐలయ్య
షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement