త్రిభాషా శిరోభారం ఇంకెన్నాళ్లు? | Guest Column By Professor Kancha Ilaiah Over Language | Sakshi
Sakshi News home page

త్రిభాషా శిరోభారం ఇంకెన్నాళ్లు?

Published Fri, Jun 7 2019 3:37 AM | Last Updated on Fri, Jun 7 2019 6:40 AM

Guest Column By Professor Kancha Ilaiah Over Language - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

విశ్లేషణ

విద్యను సంపూర్ణంగా హిందీలో లేక భారతీయ భాషల్లోనే బోధించాలని చెబుతున్న లోహియా వంచనాత్మక సోషలిస్టు విద్యావిధానంతో పోలిస్తే బీజేపీ ప్రకటించిన నూతన విద్యా విధానం.. ఖచ్చితంగానే మెరుగైనది. సంపన్నులు కార్పొరేట్‌ బిజినెస్‌ స్కూళ్లలో చదువుతూ ప్రపంచ స్థాయిలో ఉద్యోగాలు కైవసం చేసుకోవడం, సాధారణ ప్రజలు హిందీ, తదితర ప్రాంతీయ పాఠశాలలు, కాలేజీల్లో చదువుతూ చౌకీదారులుగా, ఛాయ్‌వాలాలుగా మిగిలిపోతున్న పరిస్థితి ఇకనైనా మారాలంటే ఇంగ్లిష్‌ను భారత జాతీయ భాషగా గుర్తించి దానిలో బోధన చేస్తూ దాంతో పాటు ఒక ప్రాంతీయ భాషలో బోధించే తరహా విధానం అమలు చేయాల్సి ఉంటుంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలన్నింట్లోనూ ఇంగ్లిష్‌ను ప్రవేశపెడతానని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన హామీని నెరవేర్చితే ఆంధ్రప్రదేశ్‌ ఈ అంశంలో దేశానికే నమూనా రాష్ట్రంగా మారుతుంది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం భారతదేశ భాషా విధానం గురించి విస్పష్టంగా ప్రకటించింది. మొట్టమొదటగా ఈ విధానం జాతి మొత్తాన్ని హిందీ మాట్లాడే జాతిగా మార్చాలని ఆశించింది. అయితే దక్షిణ భారతదేశంలో తీవ్ర నిరసనల తర్వాత తమకు హిందీ వద్దంటున్న రాష్ట్రాలపై హిందీని రుద్దకుండా కేంద్రం తన భాషా విధానాన్ని త్రిభాషా విధానంగా సవరించింది. ఏదేమైనా, దేశంలోని పిల్లలందరూ ఇప్పుడు మూడు భాషలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లిష్, తాము పుట్టిన రాష్ట్రానికి చెందిన భాష, ఇతర రాష్ట్రాలకు చెందిన మరొక భాష. హిందీ మాట్లాడే రాష్ట్రాల కంటే ఎక్కువగా హిందీ మాట్లాడని రాష్ట్రాలు ఉంటున్నందున మొట్టమొదటిసారిగా హిందీతోపాటు హిందీ యేతర భాషను కూడా పిల్లలు నేర్చుకోవలసి ఉంటుందని ఈ విధానం తేల్చి చెబుతోంది. ఈ విధానంలో భాగంగా దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడు కూడా ఇంగ్లిష్, తమిళంతోపాటు మరొక రాష్ట్రానికి చెందిన భాషను (దక్షిణభారత్‌కి చెందిన మలయాళం, కన్నడ లేక తెలుగు లేదా హిందీనికూడా) నేర్చుకోవలసి ఉంటుంది. 

దక్షిణ భారత్‌ నుంచి తమ ప్రభుత్వంలోకి తీసుకున్న సొంత పార్టీ మంత్రులు కూడా హిందీ పెద్దగా మాట్లాడలేకపోవడంపై బీజేపీ, ఆరెస్సెస్‌ నాయకులు కలవరపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎంపికైన మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పరిశీలించండి. దక్షిణాదికి చెందిన నిర్మలా సీతారామన్, సదానంద గౌడ ఇంగ్లిష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అందుకే దేశంలోని అన్ని రాష్ట్రాలపైనా హిందీని రుద్దేందుకు పథకం రచించారు. కానీ కొంతకాలం వరకు ఈ విధానానికి కొన్ని ఆటంకాలు తప్పేటట్టు లేవు. కాబట్టి, వీరు హిందీని బలవంతంగా రుద్దే కార్యక్రమం నుంచి వెనక్కు మళ్లారు కానీ భాషా విధానం మాత్రం త్రిభాషా సూత్రంగానే కొనసాగనుంది.

బీజేపీ విద్యా విధానం మొట్టమొదటి సారిగా ఇంగ్లిష్‌ను దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే విషయంపై అంగీకారం తెలిపింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంటుంది కానీ బోధనా మాధ్యమంగా ఆ రాష్ట్రానికి చెందిన భాషే కొనసాగుతుంది. ప్రైవేట్‌ పాఠశాలల్లో బోధనా భాషగా ఇంగ్లిషే ఉంటుంది. అదే సమయంలో రెండు భారతీయ భాషలను బోధించే విధానం అమలులోకి వస్తుంది. అంటే ప్రైవేట్‌ కంపెనీలకు చెందిన ‘ఖాన్‌ మార్కెట్‌ గ్యాంగ్స్‌’ (క్లాస్‌ స్కూళ్లు) నిర్వహించే పాఠశాలలు గతంలో ఇంగ్లిష్‌తో పాటు ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్‌ వగైరా విదేశీ భాషలను ఒక సబ్జెక్టుగా బోధించడానికి బదులుగా ఇకనుంచి రెండు ఇతర భారతీయ భాషలను బోధించాల్సి ఉంటుంది. 

కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనాకాలంలో విద్యా విధానం విదేశీ భాషలను నేర్చుకునే అవకాశాన్ని ఖాన్‌ మార్కెట్‌ గ్యాంగ్స్‌ (సంపన్నుల పిల్లలు చదివే) పాఠశాలలకు మాత్రమే కల్పించింది. కానీ మండీ బజార్‌ (మాస్‌) పాఠశాలలు హిందీ లేదా మరొక ప్రాంతీయ భాషా మాధ్యమంలోనే బోధించవలసి వచ్చేది. సారాంశంలో కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఇంగ్లిష్‌ను బోధించవలసిన అవసరమున్న ప్రధాన భాషగా గుర్తిం చింది. అయితే ఇంగ్లిష్‌ను ప్రైవేట్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో మంచి నాణ్యతతో సంపూర్ణంగా బోధించనున్నారు. అదే ప్రైవేట్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ను భాషా సబ్జెక్టుల్లో ఒక భాషగా బోధించనున్నారు. అయితే నిస్సందేహంగానే బీజేపీ ఒక ప్రగతిశీలమైన చర్యను చేపట్టింది.

అదేమిటంటే భారతీయ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ను బోధించడాన్ని అనుమతించడమే. విద్యను హిందీలో లేక భారతీయ భాషల్లోనే బోధించాలని చెబుతున్న లోహియా వంచనాత్మక సోషలిస్టు విద్యావిధానంతో పోలిస్తే బీజేపీ నూతన విద్యా విధానం.. ఖచ్చితంగానే మెరుగైనది. లోహియా సోషలిజం ప్రకారం పేదపిల్లలు ప్రాంతీయ భాషా మీడియంకే పరిమితం కావాలి, సంపన్నుల పిల్లలకు కోరినంత డబ్బు ఉంటుంది కాబట్టి వారు మంచి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్స్‌లో చదువుకోవచ్చు. భారతీయ కమ్యూనిస్టులు తాము పాలించిన రాష్ట్రాలన్నింటిలో ఉప– జాతీయ సెంటిమెంటును మిళితం చేసి మరీ ఈ రకమైన భాషా విధానాన్ని అమలు చేస్తూ వచ్చారు. దీనికి చక్కటి ఉదాహరణ 40 లక్షల జనాభా కలిగిన త్రిపుర రాష్ట్రం. ధారాళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడగలిగే కామ్రేడ్‌ మాణిక్‌ సర్కార్‌ భారతదేశంలోనే కాకుండా, ప్రపంచమంతటా కూడా ఉద్యోగాలు కైవసం చేసుకోగలిగిన సంపన్నులకు ప్రైవేట్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో చదువుకునే అవకాశాన్ని కల్పించారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలు త్రిపురి మీడియంలో బోధన జరిపేలా చేశారు. అంటే ఈ పాఠశాలల్లో చదువుకున్నవారు 40 లక్షల జనాభాతో కూడిన పారిశ్రామికేతర అర్థ–గిరిజన ఆర్థిక వ్యవస్థలో వేతన జీవులుగా మాత్రమే అవకాశాలు సాధించుకునేవారు. మాణిక్‌ సర్కార్‌ పాతికేళ్ల పాలన పొడవునా ఇలాగే జరుగుతూ వచ్చింది

ఈ తరహా విధానంతో త్రిపురలో గిరిజనులెవ్వరూ చక్కటి ఇంగ్లీషును మాట్లాడటం, మార్క్స్, లెనిన్‌ గురించి మాట్లాడటం చేయలేకపోయారు. దీనివల్లే 34 శాతం గిరిజన జనాభా ఉన్న త్రిపురలో ఒక్క గిరిజనుడు కూడా సీపీఎంలో పాలిట్‌ బ్యూరో సభ్యుడు కాలేకపోయారు. అలాగే పశ్చిమబెంగాల్‌లో కూడా శ్రామిక ప్రజానీకాన్ని 34 ఏళ్లపాటు ఇంగ్లిష్‌ విద్యకు దూరం చేసిన తరహా విద్యావిధానాన్ని సీపీఎం కొనసాగించింది. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి వీరికి ఏం మిగిలిందో మరి! మరోవైపున సంపన్నులైన భద్రలోక్‌ కామ్రేడ్లు ప్రైవేట్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలో చదువుకోగలిగారు. వీరివద్ద ప్రైవేట్‌ విద్యకు చెల్లించేటంత డబ్బు ఉంది మరి.

అదేసమయంలో బెంగాలీ మీడియంతోపాటు ఒక ఇంగ్లిష్‌ సబ్జెక్టుతో కూడిన భాషా విధానాన్ని రుద్దడం ద్వారా పశ్చిమ బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతం మొత్తాన్ని వీరు వెనుకబాటుతనంలో ముంచెత్తారు. ఈ రాష్ట్రంలోనూ జనాభాలో 65 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందినవారే ఉంటున్నారు. వీరిలో ఎవరికీ ఇంగ్లిష్‌లో మాట్లాడే ప్రతిభ లేదు కాబట్టే వీరినుంచి ఒక్క కమ్యూనిస్టు నేత కూడా సీపీఎం పాలిట్‌బ్యూరోలోకి ప్రవేశించలేకపోయారు. సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీలో చదువుకుని, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడైన రాహుల్‌ కూడా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో ఏకీకృత బోధనా భాషను ప్రవేశపెడతానని హామీ ఇవ్వలేకపోయారు. ప్రైవేట్‌ రంగంలో ఇంగ్లిష్‌ మీడియం నమూనాను, ప్రభుత్వ రంగంలో ప్రాంతీయ భాషా మీడియంను ప్రవేశపెట్టటం నెహ్రూ పాలనా విధానాల్లో భాగమే కదా.

మన దేశంలోని ఘనతవహించిన సెక్యులర్, ఉదారవాద కమ్యూనిస్టు మేధావులు సంపూర్ణంగా ఈ  ద్విభాషా విధానాన్ని ఆమోదించేశారని మనం మర్చిపోకూడదు. నరేంద్రమోదీ అభిప్రాయంలో ఖాన్‌ మార్కెట్, మండీ బజార్‌ విద్యావిధానం రెండూ ప్రత్యేకమైనవి. బడా బిజినెస్‌ స్కూళ్ల నుంచి ఇటలీ, ఫ్రెంచ్‌ భాషలను తొలగించి మరొక ప్రాతీయ భాషలో బోధించాలని చెప్పడం ద్వారా ఇప్పుడు బీజేపీ కూడా అదే విధానాన్ని కాస్త ఎక్కువగానో లేక తక్కువగానో ఆమోదించేసింది.ఇంతకు ముందు నెహ్రూవియన్‌ విద్యావిధానాన్ని మనం చూశాం. ఈ విధానం ప్రకారం ఖాన్‌ మార్కెట్‌ సంపన్నులు ఇంగ్లిష్‌ మీడియంలోనూ, మండీ బజార్‌ సాధారణ ప్రజలు హిందీ మీడియంలోనూ చదువుకునేవారు. ఇప్పుడు మనకు భారత మాత స్మృతి ఇరానీ విద్యా విధానం ఉంది. దీని ప్రకారం కూడా స్మృతి పిల్లలు, ఆమె ప్రత్యర్థి ప్రియాంకా గాంధీ పిల్లలు ఖాన్‌ మార్కెట్‌ కాలేజ్‌ అయిన సెయింట్‌ స్టీఫెన్స్‌లో చదువుకుంటూ ఉంటారు, ఇకపోతే మండీబజార్‌ మాస్‌ పిల్లలు ప్రభుత్వ హిందీ మీడియం కాలేజీల్లోనే చదువుకుంటూ చౌకీదార్‌లుగా, ఛాయ్‌వాలాలుగా అవతరిస్తుంటారు. 

ఇప్పుడు మనకెదురవుతున్న ప్రాథమిక ప్రశ్న ఏమిటంటే, ఇంగ్లిష్‌ భారతదేశమంతటా అమలులో ఉన్న భాషగా ఉంటున్నప్పుడు, దాన్ని భారత జాతీయ భాషగా గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని సబ్జెక్టులలో ఇంగ్లిష్‌ బోధనను ఎందుకు విస్తరించకూడదన్నదే. ఇంగ్లిష్‌తో పోలిస్తే మన ప్రాంతీయ భాషలు పొలాల్లో పనిచేసే కూలీల మాతృభాషగా మాత్రమే ఉంటున్నాయి. ఇప్పుడు సంఘ్‌ పరివార్‌కి చెందినవారు అత్యధిక సంఖ్యలో విమాన ప్రయాణీకులుగా ఉంటున్నారు. వీరి పిల్ల లందరూ ఇంగ్లిష్‌ మీడియం ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్నారు.క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితి ఉంటున్నప్పుడు, మనం ద్విభాషా విధానాన్ని (ఇంగ్లిష్‌ ఒక ప్రాంతీయ భాష) ఎందుకు చేపట్టకూడదు? ఇంగ్లిష్‌ను గిరిజన ప్రాంతాల్లోని పిల్లలకు కూడా విçస్తృతస్థాయిలో ఎందుకు బోధించకూడదు? అలాగే ప్రైవేటు పాఠశాలలన్నింట్లో సమాన స్థాయిలో ఈ రెండు భాషలను ఎందుకు బోధించకూడదు?

ఇది సాకారమైనప్పుడు భారతదేశవ్యాప్తంగా మన ప్రజలు భవిష్యత్తులో పరస్పరం ఇంగ్లిష్‌లో మాట్లాడుకోగలరు, తమ రాష్ట్రం పరిధిలో వీరు అటు ఇంగ్లిష్‌లో, ఇటు ప్రాంతీయ భాషలో మాట్లాడుకోవచ్చు. తమిళనాడు చేస్తున్నది ఇదే మరి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఇప్పటికే గ్రామీణ ప్రజానీకానికి వాగ్దానం చేసి ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్‌ మీడియంలోకి మారుస్తాననీ, ఒక సబ్జెక్టును తప్పకుండా తెలుగులో బోధించేలా చేస్తానని ఆయన నొక్కి చెప్పారు. ఈ హామీని ఆయన నెరవేర్చిన రోజున ఆంధ్రప్రదేశ్‌ దేశానికే నమూనా రాష్ట్రంగా మారుతుంది.


ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య
వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌
సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement