ఎన్నికల పోరులో ఇదేం భాష? | Sakshi Guest Column On Election Campaign language | Sakshi
Sakshi News home page

ఎన్నికల పోరులో ఇదేం భాష?

Published Sun, Apr 28 2024 4:39 AM | Last Updated on Sun, Apr 28 2024 4:39 AM

Sakshi Guest Column On Election Campaign language

ఈ సృష్టిలో మాట్లాడగలిగే  మహ ద్భాగ్యం మనిషికే ఉంది. ఆ మాటను సవ్యంగా ఉపయోగిస్తే మాటే మంత్రమై గొప్ప గొప్ప పనులు నెరవేరుస్తుంది. లేదంటే ఆ మాటే కార్చిచ్చు అవుతుంది. నేటి ఎన్నికల సమరాంగణంలో భాషా ప్రయోగం ఎలా ఉంది? దాని పాత్ర ఏంటో చూద్దాం.

భాష అంటే మనసులో ఉన్న భావాన్ని మాటల రూపంలో వ్యక్తం చేసే సాధనం. ప్రస్తుత ఎన్నికల వ్యవ హారం చూస్తుంటే అమ్మ భాషకు తూట్లు పొడుస్తున్నట్లుంది. ఎన్నికల్లో పోటీచేసే ప్రతీపార్టీ ప్రతినిధులూ ఓటరు వద్దకు వెళ్లి, ఓటు కోసం అభ్యర్థించడం సర్వసాధారణమైన అంశం. అభ్యర్థించడం అంటేనే ఒక విన్నపం. విన్నపం అంటేనే వినయంగా అడిగేది. కానీ పార్టీ ప్రచార సభల్లో నాయకులు తమ తమ విద్యాస్థాయులు, హోదాలు మరచి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం శోచనీయం.

నేటి ఎన్నికల ప్రచార సభల్లో  కొన్ని రాజకీయ పార్టీల నాయకులు వారి అజెండా ఏమిటి? అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందిస్తారు? వారి భవిష్యత్‌ ప్రణాళికలు ఏమిటి? అనే అంశాలను పూర్తిగా పక్కన పెట్టేసి, ఇతర పార్టీ నాయకులను దుయ్యబట్టడమే అజెండాగా కనిపిస్తోంది. ‘నీ తోలు తీస్తా,  నీ పళ్లు రాలగొడతా, చెప్పుతో కొడతా, చిప్పకూడు తినిపిస్తా...’ వంటి అప్రజాస్వామిక భాషను వాడడం ఎంతవరకు సబబు? కొంతమంది నేతలు, వేరే నాయకులను దూషిస్తూ, కించపరుస్తూ, కొన్ని వర్గాల వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘నిన్ను పాతాళానికి తొక్కేస్తా’ అంటారొకరు. 

ఒక వ్యక్తిని అధికార పీఠం ఎక్కించాలా, దించాలా, పాతాళానికి  తొక్కేయాలా అనేది నిర్ణయించేది వీళ్లు కాదు, కేవలం ఓటరు మాత్రమే. రాజకీయ నాయకులు ఒకరినొకరు పాతాళానికి తొక్కె య్యడం వల్ల ఓటరుకు ఒరిగేదేముంది? ఒకరు మరొక నాయకుడిని ‘నీ అంతు చూస్తా’ అంటాడు. ప్రజాస్వామ్య పాలనలో ఎవరి అంతుచూడాలన్నది ‘ఓటరన్న’కే సాధ్యం అనే గ్రహింపు కలిగి ఉండాలి.  ప్రజా సమస్యలను తుంగలో తొక్కేసి, పర నింద, పరుష నింద వల్ల ఒరిగేదేమిటో వారికే ఎరుక!

మరో నాయకుడు ‘ప్రతి అవ్వకు, ప్రతి తాతకు’అంటూ బంధుత్వాన్ని కలుపుతారు. ఈ మాటలు ఆ నాయ కుడికీ, ఓటరుకీ మధ్య ఒక మనోబంధాన్ని ఏర్పరుస్తాయి. తద్వారా ప్రజలకు ఆ నాయకుడిపై ఒక నమ్మకం, ఒక భరోసా కలిగిస్తాయి.

పార్టీ అజెండా ప్రజలకు అర్థమయ్యే భాషలో, అర్థ మయ్యే విధంగా వివరించాలి. గతకాలంలో చేసిన వాగ్దా నాలు, వాటి నెరవేర్పు ఏమేరకు జరిగింది, వాటి మధ్య ఉన్న అంతరమెంత, ఆ అంతరాన్ని పూరించడానికి ఈ సారి అధికారంలోకొస్తే ఎలాంటి కార్యాచరణ చేస్తారు అనే అంశాలను విశదీకరించాలి. అంతే కాని, మన మాటలు మన వ్యక్తిత్వాన్ని దిగజార్చేవిగా, లేదా ఇతరులను దిగ జార్చేదిగా ఉండకూడదు. మన నైతికత మనకు సిబిల్‌ స్కోర్‌ లాంటిది. అది ఎంత ఎక్కువైతే అంత లాభిస్తుంది. అది ఎంత తక్కువైతే అంత పరోక్ష నష్టం వాటిల్లుతుంది. 

ఇటీవల కాలంలో ఒక పార్లమెంట్‌ సభ్యుడిపై, ఆయన  ప్రత్యర్థులు అతనిని ‘హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన తమ ప్రతివాదులను తిరిగి ఒక్క పరుషమైన మాట మాట్లాడక పోవడం చూపరులను ఆశ్చ ర్యానికి గురిచేస్తుంది. ఇది ఆయన సంస్కార స్థాయిని వ్యక్త పరుస్తుంది. ఇలాంటి వ్యక్తిత్వం కలిగినవారు రాజకీయాల్లో అరుదుగా కనిపిస్తారు. 

​​​​​​​రాజకీయ నాయకులు వాడే అవాంఛనీయ భాష పార్టీల మధ్య కంటే, సామాన్య ప్రజల మధ్య చిచ్చు పెట్టేదిగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో సామా న్యుడు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. అలాగే నాయకులు భాషను భ్రష్టు పట్టించకుండా ఉండాలి. అదే భాషా ప్రేమికుల ఆశ. మాతృ దేవోభవ, పితృ దేవో భవ అనే సంస్కృతిలో పుట్టి పెరిగిన మనం అలాంటి మాటలు మాట్లాడుతున్నామంటే మన సంస్కారం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

భాషను మనం సునిశితంగా పరిశీలించినట్లయితే, భాషలో పబ్లిక్‌ భాష, ప్రైవేట్‌ భాష, తక్కువ స్థాయి భాష, ఎక్కువ స్థాయి భాష, ప్రజాస్వామ్య భాష అనే రకాలు న్నాయి. ప్రజల్లో మాట్లాడేటప్పుడు ప్రజాస్వామిక భాష మాట్లాడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. భాష అనేది రెండు అంచులు గల కత్తి లాంటిది. మనం మంచిగా భాషను వాడితే సత్ఫలితాలనిస్తుంది. లేదంటే దుష్ఫలితాల నిస్తుంది. నాయకులు తమ నాయకత్వాన్ని వర్ధిల్ల చేసు కోవాలంటే, మంచి ‘భాషా శైలి’ ముఖ్యం అనే అంశాన్ని గ్రహించాలి.

డా‘‘ యు. ఝాన్సీ 
వ్యాసకర్త తెలుగు అధ్యాపకురాలు, రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్, నూజివీడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement