సామాన్య శూద్రుడికి సెయింట్‌హుడ్‌ | Sakshi Guest Column Sainthood Kancha Ilaiah | Sakshi
Sakshi News home page

సామాన్య శూద్రుడికి సెయింట్‌హుడ్‌

Published Sat, Jun 18 2022 1:12 AM | Last Updated on Sat, Jun 18 2022 1:13 AM

Sakshi Guest Column Sainthood Kancha Ilaiah

భారతదేశంలో సామాన్య మానవుడైన దేవసహాయం లేదా లాజరస్‌ (1712–1752)ను వాటికన్‌ 2022 మే 15న ‘పునీత హోదా’(సెయింట్‌ హుడ్‌)గా ప్రకటించడం అనేక రకాలుగా చారిత్రాత్మకమైనది. సెయింట్‌ పీటర్‌ లేదా మదర్‌ థెరీసా స్థాయిని కల్పించడంతో ఇది సమానం. పుట్టుక, పెరుగుదల, చావు వరకూ హింసాత్మక జీవితాన్ని గడిపిన అతి సామాన్యుడు సెయింట్‌గా మారడం మానవ మత చరిత్రలో ఎన్నడూ చూసి ఉండం.

నీలకంఠ పిళ్లైగా జన్మించిన దేవసహాయం కుల వ్యవస్థ కారణంగానే తనచుట్టూ ఉన్న లక్షలాది మంది మగ్గిపోతున్నారని గ్రహించాడు. మానవజాతిలోని సమస్త బానిసత్వానికి వ్యతిరేకంగా జీసస్‌ ఎలా దారి చూపాడో, దేవసహాయం కూడా తన మరణం ద్వారా భారత్‌లోని శూద్రులకు అలాంటి దారి చూపాడు.

హిందూ దేవాలయాల్లో ప్రార్థించినట్లు గానే, స్త్రీ పురుషులు తమకు కానుకలు (క్రైస్తవ సంప్రదాయంలో అద్భుతాలు) ఇవ్వాలని దేవసహాయంను వేడుకునే వారు. ఆయన విగ్రహం మెడలో రంగురంగుల పూలదండలను అలంకరించి పూజలు చేసేవారు. పొట్టలోనే మరణించిన తన గర్భస్థ పిండాన్ని తాను ప్రార్థించిన వెంటనే సజీవమైన పసిపాపగా చేశాడని ఒక మహిళ ఆ మహిమ గురించి పేర్కొనడం దేవసహాయంకు సెయింట్‌హుడ్‌ ఇవ్వడానికి గల ఆధారాలలో ఒకటయింది.

శూద్ర మహిళలపై ఘోరమైన కుల, ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధనాలు బిగించిన వ్యవస్థలో దేవసహాయం జన్మించాడు. తల్లి దేవకి అమ్మ. ఈమె కేరళలో నాయర్‌ అని పిలిచే శూద్ర వ్యవసాయ ఉత్పాదక కులానికి చెందిన వ్యక్తి. హిందూ ఆలయంలో పూజలు నిర్వహించే వాసుదేవన్‌ నంబూద్రి అనే బ్రాహ్మణ పూజారికి పుట్టిన సంతానమే దేవసహాయం (మతం మారడానికి ముందుపేరు నీలకంఠన్‌ పిళ్లై).

దేవకి అమ్మ, వాసుదేవన్‌ నంబూద్రి మధ్య ‘సంబంధం’ వారి మధ్య ప్రేమ వ్యవహారం లేదా వారు వివాహం చేసుకున్న కారణంగా ఏర్పడిన సంబంధం కాదు. నంబూద్రికి ఆమె లొంగిపోవడం అనేది నాయర్‌ మహిళలతో లైంగిక సంబంధాలను నిర్బంధపూరితంగా బ్రాహ్మణులు పెట్టుకునే కులకట్టు బాటులో భాగంగా జరిగింది. ఇలాంటి లైంగిక బంధాన్ని ‘సంబంధం’ అని పిలిచేవారు. 

ఒక శూద్రుడిగా ఇలాంటి మానవ హింస ద్వారానే బాల్యం నుంచి పెద్ద వయసు వరకూ అనుభవిస్తూ వచ్చాడు దేవసహాయం. బ్రాహ్మణ నిర్దేశకత్వంలోని ఈ సంబంధంలోని హింసాత్మక భాగం ఏమిటంటే, పిల్లలు తమకు జన్మనిచ్చిన తండ్రి ఎవరు అనేది తెలుసు కోవలసి ఉంటుంది. పైగా ఈ సంబంధం ద్వారా పుట్టిన పిల్లలు తల్లివద్ద లేక ఆమె పుట్టింట్లో పెరగాలి లేదా వ్యవసాయ పనులు చేసుకుంటూ బయట గడపాలి.

చాలామంది నాయర్‌ కుటుంబాలు ఇలాంటి వివాహేతర సంబంధం ద్వారా పుట్టిన తమ కుమార్తెల పిల్లలను ఆమోదించి వారికి కొన్ని ఆస్తి హక్కులు కల్పించేవారు. కానీ ‘సంబంధం’లో పుట్టిన పిల్లలు తండ్రి, తల్లితో పాటు ఇతర పిల్లలు ఉన్న కుటుంబాల్లో జీవించవలసి వస్తే అది ఘోరమైన చిత్రహింస లతో కూడిన జీవితాన్ని కలిగిస్తుంది. దీనిలో ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే ఇలాంటి పిల్లలను దేవుడి బిడ్డల్లాగే చూసేవారు. వీళ్లు దేవుడిచ్చిన దౌర్భాగ్యాన్ని అనుభవిస్తూ దానికి ఎదురు తిరగలేక జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది.

హిందూమతంలోని అలాంటి అమానుష జీవితానికి వ్యతి రేకంగా నీలకంఠన్‌ పిళ్లై తిరగబడి క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. ఆనాటి పూజారి వర్గం, క్షత్రియుల నియంత్రణలో ఉన్న రాజ్యం ఈ మతమార్పిడిని ఘోరాతిఘోరమైన నేరంగా భావించింది. క్రైస్తవు డిగా మారిన తర్వాత, దేవసహాయం కుల వ్యవస్థ కారణంగానే తన చుట్టూ ఉన్న లక్షలాది మంది ప్రజలు మగ్గిపోతున్నారని గ్రహించాడు. దీంతో దిగువ కులాలతో కలవటం ప్రారంభించాడు.

కేరళలో ఇప్పటికీ నాయర్‌ కులం శూద్ర వ్యవసాయ కులంలో ఉన్నత శ్రేణిలో ఉంటోంది. అదే సమయంలో నాయర్లకు జంధ్యం ధరించే హక్కు లేదు. వీరికి సంçస్కృత గ్రంథాలు చదివే హక్కు లేదు. హిందూ ఆలయాల్లో వీరు పూజారులు కాలేరు. 

దేవసహాయం అన్ని కులాల ప్రజలతో కలిశాడనీ, అస్పృశ్యులతో కలిసి భోంచేయడం కొనసాగించాడనీ జనం చెప్పుకునేవారు. ఇది జీసస్‌ స్వయంగా ఇజ్రాయెల్‌లో అన్యజనులు, వ్యభిచారిణిలతో కలిసిన దానితో సమానం అని చెప్పుకోవచ్చు. వికీపీడియాలోని వివ రాల ప్రకారం, రాజ్యంలోని బ్రాహ్మణ పూజారి, భూస్వామ్య ప్రభువులు, రాజకుటుంబ సభ్యులు, నాయర్‌ కమ్యూనిటీ కలిసి దేవన్‌ లేదా రామయ్యన్‌ దలవా వద్ద దేవ సహాయంపై ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

శూద్రుల చారిత్రక బానిసత్వం, అదనంగా సంబంధం పేరిట స్త్రీ పురుషుల బంధంలో అత్యంత అవమానాలు భరించిన నాయర్‌ కమ్యూనిటీ కూడా విముక్తి ప్రదాత అయిన దేవసహాయంను చిత్రహింసలు పెట్టి వధించడంలో పూజారులతో, రాజుతో కలిసి పోయారు.

శూద్రులలోని ఈ ప్రతిఘాతుక చైతన్యమే భారతదేశాన్ని చిరకాల బానిసల భూమిగా మార్చివేసింది. రెండువేల సంవత్సరాల క్రితం మానవజాతిలోని సమస్త బానిసత్వానికి వ్యతిరేకంగా జీసస్‌ ఎలా దారి చూపాడో, దేవసహాయం కూడా తన మరణం ద్వారా భారత దేశంలోని శూద్రులకు అలాంటి దారి చూపాడు. ఇప్పటికీ శూద్రులలో ఆధ్యాత్మిక బానిసత్వం కొనసాగుతోంది.

క్రిస్టియన్‌గా మారిన తర్వాత దేవసహాయం మహారాజా మార్తాండవర్మ రాజ్యంలో నివసించసాగాడు. క్రిస్టియానిటీని స్వీకరిం చిన నాటికి ఆ రాజ్యంలో మంచి స్థానంలోనే ఉండేవాడు. కానీ 40 ఏళ్ల వయసులో అంటే 1752 సంవత్సరంలో అతడిని చంపేశారు.

తమిళ–మలయాళీ ప్రాంతాన్ని చాలా కాలం పరిపాలించిన వర్మలు క్షత్రియులు. జీసస్‌ను శిలువ వేసిన కాలంలో జెరూసలెంలోని ఫరిసీ కౌన్సెల్‌ నాటి రోమన్‌ పాలకులపై ఒత్తిడి తెచ్చినట్లే, భారత ఉప ఖండం మొత్తంలో క్షత్రియులు పాలిస్తున్న రాజ్యాలకు బ్రాహ్మణులు న్యాయ శాసనాలు రచించేవారు.

మరణ శిక్ష విధిస్తున్న సమయంలో రోమన్‌ పాలకుడు పొంటియనస్‌ పిలేట్, జీసస్‌ పట్ల మరీ కఠినంగా వ్యవహరించాలని అనుకోలేదు. కానీ అప్పటి పూజారి వర్గ మండలి అత్యంత క్రూరంగా వ్యవహరించి జీసస్‌కి శిలువ విధించింది. తలపై ముళ్ల కిరీటం పెట్టారు. గోల్గోతాలోని శిలువ వేసే ప్రాంతం వరకూ ఆయనపై శిలువ మోపి నడిపించారు.

బ్రాహ్మణ ఆధిపత్యంనుంచి శూద్రులకు ఏవిధంగానూ విముక్తి లభించని విధంగా ప్రాచీన బ్రాహ్మణ న్యాయ శాస్త్రమైన మను ధర్మ శాస్త్రం శాసనాలు రూపొందిం చింది. అందుకే దేవసహాయం బ్రాహ్మణాధిపత్య హిందూయిజం నుంచి బయటపడినప్పటికీ అతడిని చిత్రహింసలు పెట్టాలని పూజారి వర్గం నిర్ణయించుకుంది. 

దళితులు, మత్స్యకారులు, వడ్రంగులు, గొర్రెల కాపర్లు, కుమ్మ రులు, ఇనుము, బంగారు నగల పనివారితో కలిసి భోంచేయటం ద్వారా దేవసహాయం కుల వ్యవస్థను ధ్వంసం చేయడానికి ప్రయ త్నించాడని ఆరోపించారు. పైగా మతమార్పిడిలను అతడు ప్రోత్స హించాడనీ, విదేశీయులకు సమాచారం ఇవ్వడం ద్వారా రాజద్రోహా నికి పూనుకున్నాడనీ ఆరోపణలు గుప్పించారు. జీసస్‌కి లాగే ముందుగా అతడిని నిర్బంధించి చిత్రహింసల ఏకాంత గదిలో ఉంచారు. మూడేళ్ల తర్వాత దేవసహాయాన్ని గొడ్డును బాదినట్లు బాది, గేదెపై కూర్చోబెట్టారు.

గేదెను పురాణ గ్రంథాల ప్రకారం మృత్యుదేవత అయిన యుముడి వాహనంగా వర్ణించేవారు. గేదె వెనుక వైపు అతడిని తిప్పి గ్రామాల్లో ఊరేగిస్తూ కొరడాలతో కొట్టారు. భారతీయ ఉపఖండం మొత్తంలో అత్యధికంగా పాలను ఇచ్చే జంతువు గేదె. కానీ అది నల్లగా ఉంటుంది కాబట్టి బ్రహ్మణ పూజా రులు, క్షత్రియ పాలకులు దాన్ని దయ్యపు జంతువుగా భావించేవారు.

జీసస్‌కు గాడిద వాహనమైనట్లే, దేవసహాయానికి గేదె దేవుడిచ్చిన వాహనంగా మారింది. ఆ గేదె ముందుకు కదులుతుండగా, రక్తమోడే టట్లు దేవసహాయాన్ని బాదారు. రోజుల తరబడి అతడికి కనీసం ఆహారం, నీరు అందించకుండా గేదెపై ఊరేగిస్తూ చిత్రహింసలు పెట్టారు. అతడిని ఎలా హింసిస్తున్నారో, బాధపెడుతున్నారో అతడి భార్య స్వయంగా చూసేలా నిర్బంధించారు. చివరకు అతడిని రాళ్లు, పొదలతో ఉన్న అడవిలో కాల్చేశారు. 

ఇప్పుడు దేవసహాయం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సెయింట్‌ అయ్యాడు. సెయింట్‌గా మారిన సాధారణ మానవుడు దేవసహాయం. ప్రపంచ ఆధ్యాత్మిక వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రభావం కలిగిస్తుంది.

ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement