సాక్షి, న్యూఢిల్లీ : తీవ్ర దుమారం రేపిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం పై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమ కులాన్ని అవమానపర్చేలా ఉన్న పుస్తకాన్ని తక్షణమే నిషేధించాలంటూ ఆర్యవైశ్య సంఘం నేత, ప్రముఖ న్యాయవాది రామాంజనేయులు గత నెలలో దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం నేడు కొట్టివేసింది.
పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘పుస్తకాన్ని మేము నిషేధించలేము. అలా చేస్తే భావప్రకటనా స్వేచ్ఛను హరించినట్లు అవుతుంది. అయితే, రచయితలు స్వీయనియంత్రణ పాటించాలేతప్ప, వివాదాస్పదమైన కారణంగా పుస్తకాన్ని రద్దు చేయాలని ఆదేశించలేము’’ అని న్యామూర్తులు వ్యాఖ్యానించారు.
స్వాగతించిన ఐలయ్య : పుస్తకాన్ని నిషేధించలేమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య స్వాగతించారు. తమపై ఒక పుస్తకం వచ్చినందుకు కోమట్లు గర్వించాలని, పుస్తకాలు నిషేధిస్తే భావప్రకటనా స్వేచ్ఛను హరించినట్లవుతుందని తీర్పు అనంతరం మీడియాతో అన్నారు.
వివాదం ఇలా.. : కంచె ఐలయ్య రచించిన ‘పోస్ట్ హిందూ ఇండియా’ పుస్తకం.. 2006లో ‘హిందూ మతానంతర భారతదేశం’ గా తెలుగులోకి అనువాదమైంది. ఆ పుస్తకంలోని ఒక అధ్యయాన్ని ఇటీవలే ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పేరుతో విడిగా ముద్రించారు. దీనికి రచయిత మరో ముందుమాటను రాశారు.
పుస్తకం టైటిల్‌తోపాటు, అందులోకి సూత్రీకరణలు తమను అవమానపర్చేలా ఉన్నాయంటూ ఆర్యవైశ్యులు ఆగ్రహించారు. తెలంగాణ, ఏపీల్లో ఐలయ్యకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ఒక దశలో ఐలయ్యపై ఆర్యవైశ్యుల దాడియత్నం వివాదాన్ని మరింత పెద్దదిచేసింది. ఐలయ్యకు మద్దతుగా దళిత, బహుజన సంఘాలు పోటీర్యాలీలు నిర్వహించే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment