ఆర్. నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ: పేపర్ లీక్’ అనే కొత్త సినిమా తీశారు. అది ఇటీవల విడుదలయింది. మూర్తి ఆహ్వానం మేరకు, ప్రైవేట్ థియేటర్‌లో ప్రీ–రిలీజ్ స్పెషల్ షో చూశాను. నారాయణ మూర్తి ప్రభుత్వ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా, పోలీస్ ఆఫీసర్‌గా డబుల్ యాక్షన్‌లో ప్రధాన పాత్రలో నటించారు. నేటి విద్యా వ్యవస్థను ఎడ్యుకేషన్ మాఫియా ఎలా తన గుప్పిట పెట్టుకుంటున్నదో చూపించిన కమర్షియల్ సినిమా ఇది.
మొట్టమొదటిసారిగా పాఠశాల, విశ్వవిద్యాలయ స్థాయి విద్యా మాధ్యమం మీద, ప్రభుత్వ సదుద్దేశానికీ విద్యారంగంలో ప్రైవేట్ మాఫియా విధ్వంసక పాత్రకూ మధ్య వైరుద్ధ్యంపై ఒక సినిమా రూపొందించారు. ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ మీడియం అమలు చేయాలనే సాహసోపేతమైన నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కొత్త ప్రయోగం లేకుండా, చంద్రబాబు నాయుడు మద్దతు ఉన్న ప్రైవేట్ మాఫియా ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణలో కూడా ప్రతికూల పాత్ర పోషిస్తుండటం లేకుండా ఈ సినిమా తీయడం అసాధ్యం.
ఒక తెలుగు పండితుడు తన ఎనిమిది వేళ్లకు వజ్రాల ఉంగరాలు ధరించి ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ‘దేశభాషలందు తెలుగు లెస్స’ ఎందుకవుతుందో గర్జిస్తూ పాఠాలు చెప్పే సన్నివేశంతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. తెలుగువారంతా తెలుగు మాధ్యమంలోనే చదవాలనీ, తెలుగువారు కేవలం తెలుగు మాధ్యమంలో చదివితేనే తెలుగువారి ఆత్మగౌరవం, జ్ఞానం విశ్వగురువు అవుతాయని ఆయన చెప్తారు.
కానీ అదే తెలుగు పండితుడు ఓ పెద్ద ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ కాలేజీని దాని అసలు యజమానిని మోసం చేసి సొంతం చేసుకుంటాడు. దానిని ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మారుస్తాడు. ఆ తర్వాత విపరీతమైన ఫీజుల ద్వారా ప్రజలను దోచుకోవడం ప్రారంభిస్తాడు. ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుతున్న ఒక తెలివైన విద్యార్థి అన్నీ ఫస్ట్ ర్యాంకులు పొందుతున్న ఈ ప్రైవేట్ యూనివర్సిటీకి పంపాలంటూ తల్లి తండ్రులపై ఒత్తిడి చేస్తాడు. అప్పటికే అతడి తల్లి ఈ పిల్లవాడి చదువుకోసం పుస్తెలతాడు అమ్మి ఉన్నందున, అతని తండ్రి తన కిడ్నీని అమ్మి, అతడిని తెలుగు పండిట్ నిర్వహిస్తున్న ప్రైవేట్ ఇంగ్లీషు మీడియం యూనివర్సిటీలో చేర్పిస్తాడు.
నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలకు లాగే, అన్ని నంబర్ వన్ ర్యాంకులూ తెలుగు పండిట్ సొంత విశ్వవిద్యాలయ విద్యార్థులకే వచ్చాయి. అతని విశ్వవిద్యాలయ ప్రకటనలు ఎంత ప్రాచుర్యం పొందాయంటే, గ్రామస్థులు కూడా పుస్తెలమ్ముకుని మరీ వారి అబ్బాయిలను, అమ్మా యిలను ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి పంపేంతగా.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య కోసం ప్రజానీకం పోరాడుతున్నప్పుడు వారిపై దాడి చేసేందుకు ఈ తెలుగు పండితుడు పోలీసులకు లంచం ఇస్తాడు. మంత్రులకు లంచం ఇవ్వ డానికి కూడా ప్రయత్నిస్తాడు కానీ ఇప్పుడిక్కడ నిజాయతీపరుడైన ఈ ముఖ్యమంత్రి ఉన్నారు. తర్వాత ఈ యూనివర్సిటీ వ్యవహారాలపై ఆయన విచారణకు ఆదేశిస్తాడు.
తెలుగు పండితుడు అన్ని దిగువ స్థాయి ప్రభుత్వ వ్యవస్థ లనూ కొనుగోలు చేస్తాడు. పైగా పేపర్ల లీకేజీకి పాల్పడతాడు. తన విశ్వవిద్యాలయంలోని ధనవంతులైన విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకొని వారి బదులు విద్యార్థులు కాని బయటి వారితో పరీక్షలు రాయిస్తాడు. పరీక్షా పత్రాలు దిద్దే మాస్టర్‌లకు డబ్బు చెల్లించడం ద్వారా ప్రభుత్వ విశ్వ విద్యాలయంలోని తెలివైన విద్యార్థులు ఫెయిలయ్యే వ్యవస్థ కోసం అతను ప్లాన్ చేస్తున్నాడు. అలా ఫెయిలైన కారణంగా ఒక తెలివైన విద్యార్థిని ప్రభుత్వ విద్యాలయం క్యాంపస్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థలు ఏమాత్రం సరిగా బోధించడం లేదని ప్రజలు భావించేలా చేయగలుగుతాడు.
రాష్ట్ర స్థాయి సర్వీస్ కమిషన్ పరీక్షల ప్రశ్న పత్రాలను ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయం కూడా మేనేజ్ చేయగలుగుతుంది. పేద విద్యార్థులు డిగ్రీలు పొందినప్పటికీ వారికి ఉద్యోగాలు రాకుండా తెలుగు పండిట్ మేనేజ్ చేయగలుగుతాడు.
తన సొంత విశ్వవిద్యాలయంలోని ఒక నిజాయతీగల విద్యార్థిని... విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరీక్షను ఒకరికి బదులు మరొకరు రాస్తున్న విష యాన్ని తన మొబైల్ ఫోన్‌తో రికార్డు చేసిందనే కారణంతో దారుణానికి ఒడిగడతాడు. ఆ ఏరియా పోలీస్ స్టేషన్‌కి చెందిన తన తొత్తు అయిన సీఐ కుమారుడి గ్యాంగ్‌తో ఆమెను అత్యాచారం చేయించి హత్య చేయిస్తాడు. అలాగే ప్రొఫెసర్ పాత్రలో ఉన్న నారాయణ మూర్తిని సీఐ చంపే స్తాడు, కానీ అదే పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ పాత్రధారి అయిన నారాయణమూర్తి ఎడ్యుకేషన్ మాఫియా లీడర్ అయిన సీఐని చంపేస్తాడు.
నారాయణమూర్తి సినిమాలో సందేశం చాలా స్పష్టంగా ఉంది. ప్రస్తుత ఆంధ్రా మోడల్ విద్యా విధానాన్ని ఆయన ఎత్తిపడుతున్నారు. అదే సమయంలో ప్రైవేట్ విద్యా మాఫియాను ఎండగడు తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రులు అనుస రించిన ప్రైవేట్ అనుకూల విద్యను కేసీఆర్ హయాంలో తెలంగాణలో కొనసాగిస్తున్న విషయం ఆర్. నారాయణ మూర్తి దృష్టిలో ఉంది.
ఈ రకమైన సినిమాలు డాక్యుమెంటరీ రూపంలో కూడా చాలా అరుదు, జనాదరణ పొందిన వాణిజ్య సినిమాలను వదిలివేయండి. ప్రైవేట్ మాఫియా విద్య వల్ల ప్రాణాలను, వనరులను కోల్పోతున్న తల్లితండ్రులు, విద్యార్థులు తప్పక చూడాల్సిన సినిమా ‘యూనివర్సిటీ: పేపర్ లీక్’.
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
విద్యా వ్యవస్థపై సినీ విమర్శనాస్త్రం
Published Mon, Oct 16 2023 1:09 AM | Last Updated on Mon, Oct 16 2023 1:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment