రైతు వ్యతిరేకతే లక్ష్యంగా... | Lakhimpur Kheri Farmer Incident Guest Column By Kancha Ilaiah Shepherd | Sakshi
Sakshi News home page

రైతు వ్యతిరేకతే లక్ష్యంగా...

Published Sat, Oct 30 2021 3:02 AM | Last Updated on Sat, Oct 30 2021 3:02 AM

Lakhimpur Kheri Farmer Incident Guest Column By Kancha Ilaiah Shepherd - Sakshi

జాతికి ఆహారధాన్యాలు పండించి ఇస్తున్న రైతుల ప్రాణాలను హీనంగా భావిస్తూ వారిపై తన వాహనం నడిపించి తొక్కించగలననే ఆత్మవిశ్వాసం కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశిష్‌ మిశ్రాకు ఎలా వచ్చింది? తన 96 ఏళ్ల చరిత్రలో ఆరెస్సెస్‌ ఒక రైతు బిడ్డను ఎన్నడూ నాయకత్వ స్థానంలో నిలిపి ఎరుగదు. రైతులు, చేతివృత్తుల వారిగురించి ఒక్క సానుకూల ప్రకటనను కూడా ఎన్నడూ చేసి ఎరుగదు. సర్దార్‌ పటేల్‌ నిర్వహించిన ఏ రైతాంగ ఉద్యమంలోనూ వీరు పాల్గొనలేదు.

స్వాతంత్య్రం తర్వాత కూడా వీరు ఒక్క రైతాంగ ఉద్యమాన్ని కూడా నిర్వహించలేదు. అందుకే రైతులు చేస్తున్న ఆందోళనలను వీరు జాతి వ్యతిరేక ఆందోళనగా ముద్ర వేస్తున్నారు. రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఎలాంటి మక్కువ, ప్రేమాభిమానాలు లేవు కానీ, అదే రైతుల ఓట్ల దన్నుతో వీరు దేశాన్ని పాలిస్తున్నారు. ఇంతకు మించిన హాస్యాస్పదమైన విషయం మరొకటి లేదు.

భారతీయ జనతా పార్టీ... ఆరెస్సెస్‌ రాజ కీయ అనుబంధ సంస్థ. బీజేపీ సభ్యుల ప్రవర్తన, లక్ష్యాలకు సంబంధించిన శిక్షణ మొత్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచే వస్తోందనడంలో సందేహమే లేదు. అజయ్‌ మిశ్రా, అతడి కుమారుడు ఈ సంస్థాగత నిర్మాణంలో భాగమే. లఖీమ్‌పూర్‌ ఖేరీ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ నోరు విప్పకపోవడంపై చర్చ జరుగుతున్నప్పటికీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సైతం అక్కడ జరిగిన హింసాకాండపై మౌనం పాటించడం మరింత చర్చనీయాంశంగా ఉంది.

ఆరెస్సెస్‌ అధినేతలు మోహన్‌ భాగవత్‌ కానీ, దత్తాత్రేయ హొసబలే కానీ ఇంతవరకు లఖీమ్‌పూర్‌ ఘటనపై నోరెత్తిన పాపాన పోలేదు. ప్రధానంగా శూద్రులు, దళితులతో కూడిన భారతీయ ఉత్పాదక శక్తులు–రైతులు, చేతివృత్తుల వారి– పట్ల ఒక సంస్థగా ఆరెస్సెస్‌ నడవడిక, దృక్పథం గురించిన మౌలిక ప్రశ్నలను ఇది లేవనెత్తుతోంది.

ఇక్కడ నేను రెండు విషయాలను ప్రధానంగా పరిశీలనలోకి తీసుకుంటున్నాను. భారతీయ స్వాతంత్య్రోద్యమానికి నాయకత్వం వహించి, ప్రజాస్వామ్యానికి ఊపిర్లూదిన భారత జాతీయ కాంగ్రెస్‌కూ, భారతీయ రైతులు, ఉత్పాదక శక్తుల పట్ల ఆరెస్సెస్‌ దృక్పథానికి మధ్య ప్రాథమికంగా ఉంటున్న వ్యత్యాసాలను పరిశీలిద్దాము.

భారతీయ, స్కాటిష్‌ వలసవాద వ్యతిరేక స్వాతంత్య్రోద్యమ ప్రేమికులు కలిసి 1885లో స్థాపించిన సంస్థే భారత జాతీయ కాంగ్రెస్‌. దాదాబాయి నౌరోజీ, అలెన్‌ ఆక్టోవియన్‌ హ్యూమ్, దిన్షా ఎడుల్జీ వచా వంటివారు భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి సంస్థాపకుల్లో ఉన్నారు. వీరిలో దాదాబాయి నౌరోజీ, దిన్షా ఎడుల్జీ పార్సీలు కాగా, హ్యూమ్‌ స్కాటిష్‌ స్వాతంత్య్ర ఉద్యమకారుడు. జాతీయ కాంగ్రెస్‌ ప్రారంభంలో భారతీయ బ్రాహ్మణ నేత కానీ బనియా నేత కానీ ఏ ఒక్కరూ లేరని గమనించాలి.

బ్రిటిష్‌ పాలకులతో ఘర్షిస్తున్న క్రమంలో అనేక రకాలుగా నష్టపోయిన ప్రముఖ పత్తి వ్యాపారి దిన్షా ఎడుల్జీ ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. భారతీయ నేతల మద్దతు కొరవడినప్పటికీ, కాంగ్రెస్‌ని సంస్థగా నిర్వహించడంలో స్కాటిష్‌ జాతీ యుడైన ఏఓ హ్యూమ్‌ వహించిన కీలకపాత్రను దిన్షా గుర్తించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ కారులకు ఊపిరి పోసిన గొప్పమనిషి హ్యూమ్‌ అని ప్రశంసించారు.

ఆనాడు, భారతదేశంలోని అనేకమంది బ్రాహ్మణులు, బని యాలు, కాయస్థులు, ఖాత్రీలు ఇంగ్లండులో చదువుకుని న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఇంగ్లిష్‌ చదువుకున్న బ్రాహ్మణుల్లో చాలామంది వలసవాద ప్రభుత్వం తరపున పనిచేసేవారు. కాంగ్రెస్‌ ఏర్పడ్డాక ద్విజులు తమ కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీతో కూడా పొత్తు జట్టుకట్టారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ పుంజుకున్న వెంటనే బ్రాహ్మణులు దాని నాయకులైపోయారు.

కానీ శూద్ర రైతులకు మాత్రం ఇంగ్లిష్‌ విద్య అందని ద్రాక్షలాగే ఉండిపోయింది. ఇంగ్లిష్‌ విద్య నేర్చుకున్న తొలి శూద్ర రైతు మహాత్మా జ్యోతిబా పూలే 1827లో జన్మిం చారు. ఆయన కూడా 7వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ప్రభుత్వ సర్వీసులో, న్యాయస్థానాల్లో ఇంగ్లిష్‌ చదువుకున్న బ్రాహ్మణ యువత మాత్రమే పనిచేస్తూ డబ్బు సంపాదించేవారు. శూద్రులు వ్యవసాయంలో, ఇతర చేతివృత్తుల్లో నిమగ్నమవుతూ వచ్చారు. 

దేశంలో బ్రిటిష్‌ విద్య నేర్చుకున్న తొలి శూద్ర రైతు వల్లభాయి పటేల్‌ ఆ తర్వాత లాయర్‌ వృత్తి చేపట్టి 1917లో కాంగ్రెస్‌లో చేరారు. రైతులను ఎలా సంఘటితపర్చాలో కాంగ్రెస్‌ పార్టీకి, మహాత్మాగాంధీకి ఒక మార్గం చూపిన వ్యక్తి పటేల్‌. మంచి లాయర్‌గా చక్కగా ప్రాక్టీసు చేస్తున్న పటేల్‌... ఖేడా, బార్డోలితో సహా గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో రైతాంగ ఉద్యమాలకు నేతృత్వం వహించారు. సోషలిస్టు రైతాంగ విప్లవాల యుగంలో కాంగ్రెస్‌ పార్టీ మితవాద పంథా చేపట్టినప్పటికీ, గ్రామాల్లోకి పటేల్‌ చొచ్చుకుపోయారు. ఒక సహజ సజీవ మేధావిగా ఆయన రైతుల మనసుల్లో నిలిచిపోయారు. 

కానీ 1931లో కానీ పటేల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాలేకపోయారు. రైతు నేపథ్యంలోంచి భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి అధ్యక్షుడిగా లాహోర్‌ కాన్ఫరెన్సులో ఎన్నికైన పటేల్‌.. ‘ఏ భారతీయుడైనా ఆకాం క్షించే కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత పదవికి ఒక సాధారణ రైతును ఆహ్వానించార’ని పేర్కొన్నారు. ‘1931 నాటికి కాంగ్రెస్‌ పార్టీ నాలుగు దశాబ్దాలుగా ఉనికిలో ఉంటూవచ్చిందనీ, కానీ పార్టీ అధ్యక్ష పదవికి రైతాంగ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని ఆ నలభై ఏళ్ల కాలంలో ఎంపిక చేసుకోలేకపోయిందనీ, భారతదేశం తన గ్రామసీమల్లోనే నివసిస్తోం దని మహాత్మాగాంధీ అతిశయించి చెబుతున్నప్పటికీ రైతుకు అధ్యక్ష పదవిని కాంగ్రెస్‌ పార్టీ కట్టబెట్టలేకపోయింద’నీ చరిత్రకారుడు రామచంద్ర గుహ పేర్కొన్నారు.

మహారాష్ట్ర బ్రాహ్మణులు 1925లో ఆరెస్సెస్‌ను స్థాపించారు. ఈ సంస్థలో ఒక పార్సీకానీ, సిక్కు కానీ, బుద్ధిస్టు కానీ లేరు. ఒకే ఒక ముస్లిం మాత్రం ఉండేవారు. తన సైద్ధాంతిక పత్రాల్లో ఈ సంస్థ రైతులు, చేతివృత్తుల వారిగురించి ఒక్క సాను కూల ప్రకటనను కూడా ఎన్నడూ చేసి ఎరుగదు. సర్దార్‌ పటేల్‌ నిర్వహించిన ఏ రైతాంగ ఉద్యమంలోనూ వీరు పాల్గొనలేదు. స్వాతంత్య్రం తర్వాత కూడా వీరు ఒక్క రైతాంగ ఉద్యమాన్ని కూడా నిర్వహించలేదు. 

ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒక పురాతన వారసత్వం నినాదంతో వచ్చిన ఆరెస్సెస్‌.. తన 96 సంవత్సరాల ఉనికిలో ఒక రైతు కుమారుడిని ఎన్నడూ అధినాయకత్వ స్థానంలో నిలిపి ఎరుగదు. వీరిదృష్టిలో గ్రామీణులు జాతిలో కానీ, దాని పురాతన వారసత్వంలో కానీ భాగం కాదు. భారత జాతీయ కాంగ్రెస్‌కు, ఆరెస్సెస్‌కి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే. కాంగ్రెస్‌ పార్టీ తన చరిత్రలో అనేక రైతాంగ ఉద్యమాలను సంలీనం చేసుకుంది. కానీ ఆరెస్సెస్‌ ఆ పని చేయలేదు. కేవలం మైనారిటీలకు వ్యతిరేకంగా పోరాడే బలమైన శక్తిగా మాత్రమే రైతులను ఆరెస్సెస్‌ వాడుకుంది.

తమ మనుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న అంశాలపై రైతులు చేస్తున్న ఆందోళనను మితవాద పక్షం జాతి వ్యతిరేక ఆందోళనగా ముద్ర వేస్తోంది. భారత్‌ అంటే వ్యవసాయంతో ఎలాంటి సంబంధం లేని హిందుత్వ శక్తులకు సంబంధించిన అతి చిన్న భాగమేననేలా మితవాద పక్షం భావిస్తోంది. వీరి సాంస్కృతిక జాతీయవాదం వ్యవసాయాన్ని జాతీయవాదంలో భాగంగా చూడటం లేదు. రైతుల పిల్లలు పూజారులుగా మారి పూజలు నిర్వహించే హక్కేలేని హిందూ ఆలయాలకే ఈ తరహా జాతీయవాదం పరిమితమైపోయింది. వ్యవసాయం గురించి, శూద్ర దళిత ప్రజారాశుల గురించి కనీసం ప్రస్తావించని ప్రాచీన సంస్కృత పుస్తకాల్లో మాత్రమే వీరి జాతీయవాదం ఉనికిలో ఉంది.

జాతికి ఆహారధాన్యాలు పండించి ఇస్తున్న రైతులను వీధికుక్కలకంటే హీనంగా భావిస్తూ వారిపై తన వాహనం నడిపించి తొక్కించగలననే ఆత్మవిశ్వాసం ఆశిష్‌ మిశ్రాకు మెండుగా ఉందంటే అది ఆరెస్సెస్‌ వారసత్వం నుంచే వచ్చింది. ఆరెస్సెస్‌ సంస్థాగత మద్దతుపై ప్రాతిపదికనే ఇతడికి ఇంత అహంభావం పుట్టుకొచ్చింది. అదే సమయంలో దేశం మొత్తానికి ఆహార ధాన్యాలు పండిస్తున్న శూద్రుల వారసత్వమే రైతులది.

ఆరెస్సెస్‌కు తమకు మధ్య ఇంత వ్యత్యాసం ఉందనే విషయం ఈ రైతులకు తెలీదు. అందుకే ఆశిష్‌ మిశ్రా వారసత్వం గురించి దేశం అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. రైతులు, మొత్తం దేశం కూడా ఇప్పుడు బతికి బట్టకట్టాల్సిన అవసరం ఉంది. దీని సాంస్కృతిక జాతీయవాద ఎజెండాకు రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఎలాంటి మక్కువ, ప్రేమాభిమానాలు లేవు. కానీ అదే రైతుల ఓట్ల దన్నుతో వీరు దేశాన్ని పాలిస్తున్నారు. ఇంతకు మించిన హాస్యాస్పదమైన విషయం మరొకటి లేదు.

-ప్రొ.కంచ ఐలయ్య షెపర్డ్‌
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement