అత్యాచార సంస్కృతి అంతం ఎలా? | Kanche Ilaiah Article On Woman Molestation | Sakshi
Sakshi News home page

అత్యాచార సంస్కృతి అంతం ఎలా?

Published Thu, Dec 12 2019 12:01 AM | Last Updated on Thu, Dec 12 2019 12:01 AM

Kanche Ilaiah Article On Woman Molestation - Sakshi

బాధితులపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేస్తున్న ఘటనలకు కారణం వ్యక్తులు తమ స్వీయ నియంత్రణను కోల్పోవడం ఎంతమాత్రం కాదు. అమ్మాయిలను అవమానించడం అంతకంటే కాదు. నిజానికి ఇవి మన సమాజంలోని పలు దొంతరలను సాంస్కృతికంగా హింసిస్తున్నదానికి వ్యక్తీకరణలు మాత్రమే. కుటుంబం పాఠశాల, మత సంస్థలు, మార్కెట్‌ స్థలాలు అన్నీ కలిసి స్త్రీ, పురుషులు సమానులు అనే భావాన్ని పాటిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటటువంటి సాంస్కృతిక విధానాలను పాటించాలి.. స్త్రీల ఆత్మాభిమానాన్ని, శ్రమగౌరవాన్ని పెంచేటటువంటి సిలబస్‌ను రూపొందించాలి. మహిళల శ్రమ, వారి సృజనాత్మకతే జాతి పురోగమనానికి, అభివృద్ధికి కీలకం అని మన పిల్లలకు పాఠశాలల్లో బోధించనట్లయితే, భవిష్యత్తులో కూడా అత్యాచారాలు, వేధింపుల వంటి ఉపద్రవాలు మనల్ని పీడిస్తూనే ఉంటాయి.

వ్యక్తులు తమ సంతృప్తిని తీర్చుకోవడానికి లేక అణచివేతను ఆయుధంగా ప్రయోగించడానికి ఉపయోగపడుతున్న అత్యాచారాల సంస్కృతి ప్రజల నైతిక ప్రమాణాలను చంపేస్తోంది. నవంబర్‌ 27న హైదరాబాద్, శంషాబాద్‌ సమీపంలో దిశపై జరిగిన పాశవిక సామూహిక అత్యాచారం ఏడేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను మళ్లీ తలపింపజేసింది. ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయను పాశవికంగా హత్యచేయగా, హైదరాబాద్‌లో దిశపై సామూహిక అత్యాచారం జరిపిన తర్వాత ఆమెను దాదాపు సజీవంగానే తగులబెట్టి చంపేశారు. ఈ రెండు ఘటనలపై యావద్దేశం తీవ్రంగా నిరసించింది. కానీ దేశం లోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దిశ కేసులో మాత్రమే రేపిస్టులను కాల్చిచంపారు. నిర్భయ హంతకులు మాత్రం తమపై మరణశిక్ష అమలు కోసం వేచి ఉంటున్నారు. అయితే ఇలాంటి సామూహిక అత్యాచార ఘటనలు ఎన్నో జరుగుతున్నా మీడియా దృష్టికి అవి రావడం లేదు.

ప్రతిరోజూ దేశంలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచార వార్తలు ప్రజల సున్నితత్వాన్ని చంపేస్తున్నాయి. అత్యాచారం అనేది మరొక చెడువార్త.. దాన్ని వదిలేయండి అని భావిస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది. టీచర్లు తమ సొంత విద్యార్థులను పాఠశాలల్లోనే అత్యాచారం చేస్తున్నారు. మత బోధకులు తమ అనుయాయులనే అత్యాచారం చేస్తున్నారు. మన విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు భయాం దోళనలను ప్రేరేపించే సంస్థలుగా మారిపోతున్నాయి. బాధితులపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనలకు కారణం వ్యక్తులు తమ స్వీయ నియంత్రణను కోల్పోవడం ఎంతమాత్రం కాదు. తన దృష్టిలో పడిన అమ్మాయిలను అవమానించడం అంతకంటే కాదు. నిజానికి ఇవి మన సమాజంలోని పలు దొంతరలను సాంస్కృతికంగా హింసిస్తున్నదానికి వ్యక్తీకరణలుగానే చూడాలి. దీనికి మూలాలు ప్రస్తుత కుటుంబం, స్కూలు, మత వ్యవస్థలు, పౌర సమాజంలో దాగి ఉన్నాయి. ఎందుకంటే సామూహిక అత్యాచారాలు చేసేవారు విభిన్న కుటుంబాలు, కులాలనుంచి వస్తున్నారు. ఇలాంటి అనాగరికమైన అత్యాచారాలకు మన యూనివర్సిటీలు కూడా మినహాయింపు కాదు. ప్రత్యేకించి భారతదేశంలో ఇది ఒక సామాజిక, భావజాలపరమైన ట్రెండ్‌గా మారిపోయింది.

నగరం నుంచి గ్రామం దాకా, కుటుంబం నుంచి పాఠశాల, కాలేజీ, ఆలయం, మసీదు, చర్చి వరకు మనం స్త్రీ, పురుష సంబంధాలపై పునరాలోచించుకోవలసి ఉంది. ఏ మతాన్నీ, ఏ పాఠశాలను, ఏ కుటుంబాన్నీ వదలకుండా భారీస్థాయిలో సాంస్కృతిక ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. అత్యాచార విముక్త భారత్‌ కోసం జరిగే సాంస్కృతిక ప్రచారంలో స్త్రీ, పురుషులిరువురు పూర్తిస్థాయిలో పాల్గొనాల్సి ఉంటుంది. కుల వ్యవస్థ, అమానవీకరించిన పితృస్వామిక సంబంధాలు అనేవి ప్రపంచంలోనే ఏ సమాజంలోనూ చోటు చేసుకోనంత హింసకు భారతీయ స్త్రీ, పురుష సంబంధాలను గురి చేశాయి. ఈ సమస్యను విడి విడి ఉదంతాలుగా కాకుండా సర్వసమగ్ర దృష్టితో పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

గ్రామీణ కుటుంబ వ్యవస్థ నుంచి పట్టణాలు, నగరాల్లోని మన కుటుంబాల వరకు పరిశీలిస్తే ఇళ్లలో మనం వాడే భాషలో భయంకరమైన బూతులు దొర్లుతుంటాయి. వీటిలో చాలావరకు మహిళలను కేంద్రంగా చేసుకున్నవే. ఇంట్లో తండ్రీ, తల్లి, తాతా అవ్వలు సాధారణంగా ఆమోదించే జాతీయాలతో బూతు భాషను వాడుతున్నందున అది బాల్యం నుంచే మనలో ఇంకిపోయి ఉంటుంది. తరం నుంచి తరానికి ఇది పయనిస్తూనే ఉంటుంది. మన సమాజంలో ఆడదానిపై మగవాడు చలాయించే అధికారం, ఆజమాయిషీని బట్టే ఘనత వహించిన పురుషత్వం అనేదాన్ని నిర్వచిస్తుంటారు. నిత్యజీవితంలో మహిళను తనతో సమానంగా భావించి వ్యవహరించే పురుషుడిని ఈ సమాజం అసమర్థుడు అంటుంది. దీనికి మించిన పాశవిక సాంస్కృతిక భావం మరొకటి ఉండదు. కానీ అన్ని చోట్లా ఇది ఉని కిలో ఉంటోంది. దీంతో మనం తప్పక పోరాడాలి. 

మన పుస్తకాలు మొత్తంగా ఉత్పత్తి, ప్రకృతి, సైన్స్, స్త్రీపురుషుల మధ్య సహకార సంబంధాలు వంటివాటి కంటే శృంగారం, సెక్స్‌ పైనే ఎక్కువగా కేంద్రీకరిస్తుంటాయి. ఇక పాఠశాలలు, కాలేజీలు మహిళా వ్యతిరేక సాంస్కృతిక భావనలను పెంచిపోషిస్తూ, ఇంటినుంచి పాఠశాలకు బూతు భాషను విస్తృతపరుస్తూ ఉంటాయి. మన పోలీసు స్టేషన్లు భయంకరమైన బూతుభాషను వాడటంలో పేరుమోశాయి. మన సినిమాలు పూర్తిగా హింస, సెక్స్‌తో నిండివుండి  రేపిజానికి మారుపేరుగా ఉంటున్నాయి. వికృతమైన సెక్సు, హింసాత్మక ఘటనలు లేని సినిమా ఒక్కరోజు కూడా థియేటర్లో ఆడలేదు. అటు ప్రేక్షకులు, ఇటు నిర్మాత, హీరోల మనస్తత్వం హింసాత్మక  సెక్స్‌ని లేక వీరోచితమైన భౌతిక హింసను ప్రదర్శిస్తూంటుంది. 

భారతదేశంలో లేక మరెక్కడైనా సరే.. మానవ ప్రాణులను అత్యాచారం చేస్తున్న సంస్కృతి, జంతువుల్లోని ఆడామగ మధ్య లైంగిక కార్యకలాపం సందర్భంగా కనబర్చే ప్రవర్తనకు ఏమాత్రం పోలలేదు. ఆడజంతువు మద్దతు లేకుండా జంతువులు, పక్షులు బలాత్కారంగా సెక్సులో పాల్గొనలేవు. జంతువుల్లోకూడా గమనించలేనంత ఘోరమైన పీడన స్వభావంతో పురుష అణచివేత కొనసాగుతున్నందున దీన్ని అడ్డుకోవడానికి మరింత ఎక్కువగా జంతు ప్రవర్తనా శాస్త్రాలను భారతీయులు నేర్చుకోవలసి ఉంది. కానీ భారతీయ తరహా రేప్‌ సంస్కృతిని ఇతర సమాజాలతో అసలు పోల్చి చూడలేం. ఎందుకంటే యుద్ధ సమయాల్లో తప్పితే.. సామూహిక హత్యలు, వధలు ఆ సమాజాల్లో తక్కువ. సాధారణ పరిస్థితుల్లో ఏ మగాడైనా సరే ఆడదాని శరీరాన్ని తాకాలంటే ఆమె అనుమతి తీసుకోవడం ముందు షరతుగా ఉంటుంది. కానీ భారతదేశంలో దీన్ని చాలావరకు పరిగణించరు. ఇది మన కుటుంబ, విద్యా వ్యవస్థకు పెద్ద సవాలు. మన సమాజం, జాతిలోని ఈ బలహీనతను మనం అంగీకరించాలి, ఆ తర్వాతే నాగరిక ప్రవర్తనకు మారాలి. 

ఈ సమస్యకు మరింత పోలీసింగ్, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు తీర్పులు మాత్రమే పరిష్కారం కాదు. రేపిస్టులను ఎన్‌కౌంటర్‌ చేస్తే ఇది పోయేది కాదు. మన సంస్కృతిలోనే స్త్రీ వ్యతిరేక బూతు ప్రయోగాల సమస్య ఉన్నందున, ఇళ్లలో, బహిరంగ స్థలాల్లో స్త్రీ, పురుషుల సమాన హక్కులను పెంచి పోషించే సంస్కృతిగురించి మనం తప్పక ఆలోచించాలి. దీనికోసం ఇళ్లలో, వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తిలో లేక స్కూల్‌లో, కాలేజీలో, ఆఫీసులో కనీసం మాటల్లో కూడా మహిళలను తిట్టని ‘జీరో టాలరెన్స్‌’ సంస్కృతికి పట్టం కట్టాలి. ప్రతి ఇంటిలో వాడుతున్న భాష తీరును ఇరుగుపొరుగులు పరిశీలిస్తుండాలి. ఇంట్లో కానీ, బయట కానీ ఎవరైనా బూతు భాషను వాడారంటే అలాంటి వారిని ఖండించి, అవమానపర్చాలి.

సామాజిక పరంగా అవమానాలకు గురికావడం, మహిళల దృఢవైఖరి కారణంగా ఇప్పుడు గ్రామాల్లో కూడా ఆడవారిని లేక భార్యను కొట్టడం నుంచి మనం బయటపడుతున్నాం. అలాగని కుటుం బంలో, ఇంట్లో, బయట ఏ మహిళనూ మనదేశంలో ఎవరూ కొట్టలేదని దీని అర్థం కాదు. గతంతో పోలిస్తే మహిళలను చితకబాదడం తగ్గుముఖం పడుతోంది. అదేవిధంగా మహిళలను బూతులాడటం, రేప్‌ చేయడం, చంపడం వంటివి కూడా ఒక క్రమంలో తగ్గిపోతాయి. సమాజంలోని ప్రతి చోటా మహిళలను అమితంగా గౌరవించడాన్ని నేర్పినట్లయితే కొంతకాలానికి మహిళలను వేధించడం, హింసిం చడం పూర్తిగా తగ్గిపోతుంది కూడా. చివరగా, కుటుంబం పాఠశాల, మత సంస్థలు, మార్కెట్‌ స్థలాలు అన్నీ కలిసి స్త్రీ, పురుషులు సమానులు అనే భావాన్ని పాటిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటటువంటి సాంస్కృతిక విధానాలను పాటించాలి. ఏ ఇతర సంస్థల కంటే పాఠశాలకు ఈ అంశంలో మరింత అధిక పాత్ర ఉంది.

స్త్రీల గౌరవాన్ని, శ్రమగౌరవాన్ని పెంచేటటువంటి సిలబస్‌ను రూపొందించాలి. మహిళల శ్రమ, వారి సృజనాత్మకతే జాతి పురోగమనానికి, అభివృద్ధికి కీలకం అని మన పిల్లలకు పాఠశాలల్లో బోధించనట్లయితే, భవిష్యత్తులో కూడా అత్యాచారాలు, వేధింపుల వంటి ఉపద్రవాలు మనల్ని పీడిస్తూనే ఉంటాయి. అందుకే స్త్రీ, పురుషుల సమానత్వం కోసం ఒక సాంస్కృతిక విప్లవాన్నే ప్రారంభిద్దాం రండి. దీనికోసం ఇంట్లో, స్కూల్లో, కాలేజీలో, ఆలయంలో, మసీదులో, చర్చిలో, ఆఫీసుల్లో, షాపుల్లో ప్రతిచోటా ఈ అంశంపై చర్చను ప్రారంభిద్దాం.

ప్రొ‘‘ కంచ ఐలయ్య
షెపర్డ్‌
 
వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌
సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement