
మండల్ శక్తులను ముందుకురికించిన వీపీ సింగ్ గురించి అరుణ్ శౌరీ తప్పు అంచనా వేశారు. కానీ తన సొంత శైలిలో దేశాన్ని పాలిస్తున్న మోదీ విషయంలో కూడా శౌరీ అంచనా తప్పింది. మోదీ ప్రధాని పీఠం అధివసించినప్పటికీ శౌరీలాంటి ఫారిన్ డిగ్రీ హోల్డర్లు తామే వ్యవస్థను నడపగలమని భావించి ఉంటారు. కానీ మోదీ వారి స్థానమేంటో చూపించారు. అయితే శౌరీ దృష్టిలో మోదీ చేసిన సీరియస్ తప్పు ఏదంటే, తాను ధిక్కరించిన అంబేడ్కర్‌నే మోదీ ఆరాధించడం! అంబేడ్కర్ ఒక కొత్త దేవుడిగా ఆవిర్భవించారనీ, కానీ అది చెల్లిపోయే పరిణామం కావచ్చనీ 1990లలో శౌరీ వంటివారు భావించి ఉంటారు. కానీ అంబేడ్కర్ నిజమైన ప్రజాస్వామ్య సంరక్షకుడిగా వెలిగిపోతున్నారు.
కాస్త ఆలస్యంగా అయినా సరే, అరుణ్ శౌరీ మీడియా వర్గాల్లో మళ్లీ క్రియాశీలంగా ఉంటు న్నారు. ప్రస్తుత మోదీ ప్రభుత్వంపై తన అభిప్రాయం గురించీ, గతంలో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఎడిటర్‌గా తన పాత్ర గురించీ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. 1999–2004లో వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా బీజేపీతో తన సంబంధం గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. వీపీ సింగ్, నరేంద్రమోదీ గురించి తన అంచనా తప్పిందనీ... 1989లో, 2014లో వీరిద్దరినీ ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థులుగా బలపర్చడంలో తాను పొరపాటు చేశాననీ చెప్పారు.
1990లలో పెల్లుబికిన రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలకు అను కూలంగా బలమైన వాణిని వినిపించిన వారిలో అగ్రగామి అరుణ్ శౌరి. ఆ సమయంలో బీజేపీ ఒక పార్టీగా వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు పలికింది. కానీ బీజేపీ విద్యార్థి, యువజన విభాగాలు మండల్ రిజర్వేషన్లపై హింసాత్మకంగా వ్యతిరేకించాయి. బోఫోర్స్ కుంభకోణాన్ని ఎండగట్టిన వీపీ సింగ్ ఆ నేపథ్యంలోనే ప్రధానమంత్రి అయ్యారు. అందుకే కాంగ్రెస్ పార్టీకీ, వీపీ సింగ్ నేతృత్వంలోని జనతాదళ్‌కూ బద్ధ శత్రుత్వం ఏర్పడింది. ఆ కారణం వల్లే అరుణ్ శౌరీ, వీపీ సింగ్‌కి సన్నిహిత మిత్రుడైపోయారు. మండల్ కమిషన్ నివేదికను అమలు పర్చడానికి ముందు వరకు వీపీ సింగ్‌కి బలమైన మద్దతుదారుగా కొనసాగారు. ఆ తర్వాతే వీపీ సింగ్‌కి వ్యతిరేకంగా మారారు. ఈ క్రమంలోనే వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసింది.
ఆ తర్వాత కూడా ప్రతిభా సిద్ధాంతానికి అత్యంత క్రియాశీలక మైన మద్దతుదారుగా శౌరీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తన దూషణ పర్వాన్ని కొనసాగించారు. ‘ప్రతిభా సిద్ధాంతం’ అనేది 1990లలో ద్విజ మేధావులు నిర్మించిన బోగస్ సామాజిక శాస్త్ర సిద్ధాంతం. ఈ సిద్ధాంత ప్రతిపాదకులు ఏ స్థాయికి వెళ్లారంటే మన దేశంలోని కులవ్యవస్థ బ్రిటిష్ వలసవాద సృష్టి అని ఆరోపించే సాహసానికి ఒడిగట్టారు. ఈ సిద్ధాంతం వెనుక మాస్టర్ మైండ్ అరుణ్ శౌరీనే అంటే ఆశ్చర్యపోవలసిన పనిలేదు. బ్రిటిష్ కుల గణనలో తప్ప భారత దేశంలో కులం అనేదే ఉనికిలో లేదని చెప్పే రచనలను ఎన్నింటినో ఆయన ప్రోత్సహించారు. ఆ సమయంలోనే ‘వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్ – అంబేడ్కర్, అండ్ ద ఫ్యాక్ట్స్ విచ్ హావ్ బీన్ ఎరేజెడ్’ అనే ఒక అసహ్యకరమైన గ్రంథరాజాన్ని కూడా రాసిపడేశారు.
అదే సమయంలో ఇంగ్లిష్ మీడియాలో మండల్ అనుకూల శక్తుల స్వరాలకు చోటే లేకుండా పోయింది. ఈ విధంగా శౌరీ మండల్ వ్యతిరేక శక్తుల మేధోవంతమైన హీరోగా మారిపోయారు. ఆ సమయంలోనే నేను ఆంధ్రప్రదేశ్‌లో ఒక చిన్న గ్రూపు నిర్వహిస్తున్న ‘నలుపు’ అనే తెలుగు పక్షపత్రికలో ‘పరాన్న భుక్కులకు ప్రతిభ ఎక్కడిది’ అనే వ్యాసం రాశాను. మా దృష్టిలో అరుణ్ శౌరీ ఒక సజీవుడైన కౌటిల్యుడు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు శౌరీ ప్రేరేపించిన మండల్ వ్యతిరేక వాదంపై పోరాడాలని మేం భావించాం. ఆ సమయంలోనే సుప్రసిద్ధ విప్లవ గాయకుడు, రచయిత గద్దర్ ‘అరుణ్ శౌరిగా... నీకు ఆకలనేదేమెరుక’ అని ఒక పాట కూడా రాశారు.
ఇక్కడ ఒక పంజాబీ బ్రాహ్మణ కులతత్వ మేధావి ఈ దేశంలోని ఉత్పాదక కమ్యూనిటీలన్నింటినీ ప్రతిభారహితులు అని నిందిస్తు న్నాడు. క్రమంగా మండల్ అనుకూల శక్తుల నంబర్ వన్ శత్రువుగా అరుణ్ శౌరీ మారిపోయారు. వీపీ సింగ్ ప్రభుత్వం కుప్పగూలి పోయాక, బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిపోయాక, శౌరీ బీజేపీకి సంబంధించి పూర్తికాలం మేధావిగా మారిపోయారు. పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రిగా, ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగా నికి ఉద్యోగాలను మళ్లించడం అనే ఏకైక ఎజెండాతో పనిచేశారు. ఆ విధంగా వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆయన రిజర్వేషన్ వ్యతిరేక లక్ష్యం నెరవేరింది.
శౌరీ రిజర్వేషన్ వ్యతిరేక ప్రచార కాలంలో లేక అడ్వాణీ రథయాత్ర ప్రచార కాలంలో మోదీ ఒక ఈవెంట్ మేనేజర్‌గా ఉండే వారు. శౌరీ అనేక సందర్భాల్లో నరేంద్రమోదీని గొప్ప రాజకీయ వాదిగా కాకుండా ఈవెంట్ మేనేజర్ మాత్రమేనని చెప్పేవారు. మోదీని ప్రధాని అభ్యర్థిగా శౌరీ ఎలా అంచనా కట్టారనేది సందేహం. మోదీపై తన అంచనా తప్పు అని ఇప్పుడెలా గ్రహించారు? ఏ అంశాలను బట్టి తన అంచనా తప్పు అని భావిస్తున్నారనేది ప్రశ్న. మోదీ తన ఓబీసీ కులాన్ని ఉపయోగించుకుని 2014 నాటి ఎన్నికల్లో గెలుపు సాధించలేరని వాజ్‌పేయి కాలం నాటి పాలక ద్విజ నేతలు చాలామంది భావించి ఉంటారు. ఒకవేళ మోదీ ప్రధాని పీఠం అధివసించినప్పటికీ శౌరీ లాంటి మరికొందరు ఫారిన్ డిగ్రీ హోల్డర్లు, ప్రపంచ బ్యాంకు నిపుణులు తామే వ్యవస్థను నడపగలమని భావించి ఉంటారు. కానీ మోదీ మాత్రం శౌరీనీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా వంటి అహంభావపు సీనియర్లనూ పక్కన పెట్టేశారు. అదే శౌరీకి తగిలిన మొట్టమొదటి షాక్. పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని శౌరీ భావించి ఉంటారు. కానీ అరుణ్ శౌరీ శత్రువులకు సంబంధించిన పునాదే మోదీ ఓటు పునాదిగా మారిపోయింది.
అయితే శౌరీ దృష్టిలో అన్నిటికంటే మోదీ చేసిన సీరియస్ తప్పు ఏదంటే, తాను ధిక్కరించిన ‘ఫాల్స్ గాడ్’ అంబేడ్కర్‌నే మోదీ ఆరాధించడం. అంబేడ్కర్ ఒక కొత్త దేవుడిగా ఆవిర్భవించారనీ, కానీ అది చెల్లిపోయే పరిణామం కావచ్చనీ 1990లలో శౌరీ వంటివారు భావించి ఉంటారు. కానీ తాను దూషించిన ఆ ఫాల్స్ గాడ్ అంబే డ్కరే, శౌరీ రియల్ దేవుడు మహాత్మా గాంధీకంటే ఎక్కువ అను యాయులను కలిగి ఉన్నారు. శౌరీ ఆరాధించే మరొక దేవుడైన వివేకానందుడు అతడి హిందుత్వ భక్తులకు సందర్భానుసారం ఉల్లేఖనల్లో మాత్రమే ఉనికిలో ఉంటూ వచ్చారు. లేదా శశిథరూర్ వంటి ఐక్యరాజ్య సమితిలో శిక్షణ పొంది వచ్చిన కాంగ్రెస్ మేధావుల ఉల్లేఖనలకే వివేకానందుడు పరిమితమవుతూ వచ్చారు. అదే అంబే డ్కర్ విషయానికి వస్తే దళిత ఓబీసీ, ఆదివాసీ గృహాల నుంచీ, అన్ని మేథో ఫోరంలలో, పండుగల సందర్భాల్లో, కోర్టు తీర్పుల్లో, యూని వర్సిటీ చర్చల్లో, వార్తా పత్రికల కాలమ్‌లలో ఒక ప్రజాస్వామ్య సంరక్షకుడిగా వెలిగిపోతున్నారు.
రాజ్యాంగాన్ని రాసిన అసలు రచయిత అంబేడ్కర్ కాదని అరుణ్ శౌరీ చేసే వాదనను మందమతి సైతం అంగీకరించడు. జీవిత పర్యంతం ప్రతిభా సిద్ధాంతానికి వ్యతిరేకిగా, ప్రజాస్వామ్యానికి అనుకూలవాదిగా ఉంటూ థియరీ, ఆచరణ రెండింటినీ ప్రారంభిం చిన అంబేడ్కర్ జాతి మొత్తం ఆలోచనల్లో ఇప్పుడు వెలుగొందు తున్నారు. కానీ నిరాశా నిస్పృహలతో సతమతమవుతున్న హిందూ ప్రాణిగా ఇప్పుడు తాను చనిపోవడానికి వేచి ఉంటున్నానని శౌరీ స్వయంగా చెప్పుకున్నారు. మండల్ వ్యతిరేక ద్విజ మేధావుల సర్కిల్‌లో మోదీ ఒక ప్రతిభ లేని ఓబీసీ! కానీ పాలనలో వారి స్థాన మేంటో మోదీ చూపించారు. దేశాన్ని మొత్తంగా తానే ఏలుతున్నారు. తన సొంత కారణాలతో మండల్ శక్తులను ముందుకురికించిన వీపీ సింగ్ గురించి శౌరీ తప్పు అంచనా వేశారు. కానీ తనలాంటి మేధావులను పక్కన బెట్టి, తన సొంత శైలిలో దేశాన్ని పాలిస్తున్న మోదీ విషయంలో కూడా శౌరీ అంచనా తప్పింది.
మండల్ కాలంలో నా స్వరం ఎలా మూగబోయిందో అలాగే మోదీ కాలంలో శౌరీ స్వరం కూడా మూగబోయినందుకు ఒకరకంగా నేను సంతోషిస్తాను. అంబేడ్కర్ ఇప్పుడు నిజమైన దేవుడిగా మారి పోయారు. తనపై అంత ధిక్కారపూరితమైన పుస్తకం రాసినందుకు శౌరీని బహుశా అంబేడ్కర్ శిక్షించాలని భావించి ఉండరు. కానీ భారతీయ వాస్తవికత పట్ల మేధోపరమైన అలక్ష్యానికి గానూ శౌరీ తనపై తానే జాలి పడాల్సి ఉంది. అంబేడ్కర్ లేకుండా మండల్ రాజకీయాలు లేవు. మండల్ రాజకీయాలు లేకుండా ఈరోజు మోదీ ప్రధాని అయివుండేవారు కాదు.
వ్యాసకర్త: ప్రొ.కంచ ఐలయ్యషెపర్డ్
ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment