హన్మకొండ చౌరస్తా/కోరుట్ల: దాశరథి, కాళోజీ నారాయణరావు తెలంగాణకు ఏం చేశారని వారి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రొఫెసర్ కంచ ఐలయ్య ప్రశ్నించారు. మాజీ మంత్రి సంగంరెడ్డి సత్యనారాయణ ప్రథమ వర్ధంతి సభ మంగళవారం హన్మకొండలో పబ్లిక్‌గార్డెన్‌లో జరిగింది. ప్రజాగాయకుడు గద్దర్, విమలక్కతో కలసి కంచ ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం 1969లో జరిగిన ఉద్యమంలో సంగంరెడ్డి సత్యనారాయణ చురకైన పాత్ర పోషించార న్నారు. విగ్రహాలు పెట్టాలంటే పోరాట యోధులు కుమ్రం భీం, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సత్యనారాయణలవి ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం కొమురవెల్లి మల్లన్న అని.. తాము పులులను పూజించం, ప్రజలను మాత్రమే పూజిస్తామన్నారు.
నేడు సీఎం కేసీఆర్ ఆర్య దేవతలను పూ జిస్తున్నారని, బ్రా హ్మణ సంస్కృతిని పెంచి పోషిస్తున్నార న్నారు. సద్దుల బతుకమ్మకు చీరలు ఇవ్వమని మహిళలు అడిగారా? అని ప్రశ్నించిన కంచ ఐలయ్య.. మీరేమో పట్టుచీరలు కట్టుకుని మాకు పీలికలు ఇస్తారా.. అని దుయ్య బట్టారు. మరోసారి చీరలు ఇచ్చి తెలంగాణ మహిళలను అవమానించాలని చూస్తే సహిం చేది లేదన్నారు. మాదిగలు చెప్పులు, డప్పులు తయారు చేస్తూ పౌరుషంగా బతుకుతారని, మాలలకు కర్రలు తిప్పే దమ్ముందన్నారు. అలాగే, గ్రామాల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఫీజులను వసూలు చేస్తున్న నారాయణ, చైతన్యలను మూసి వేయించే వరకూ పోరాడుతామన్నారు.
ఐలయ్యకు కోరుట్ల కోర్టు సమన్లు
హిందూ దేవుళ్లను అవమానించడంతో పాటు ఆర్యవైశ్యులు దొంగ వ్యాపారాలు చేస్తున్నారని కించపరిచే రీతిలో ‘సామాజిక స్మగ్లర్లు కోమట్లు’అనే రచన చేసిన కంచ ఐలయ్యకు జగిత్యాల జిల్లా కోరుట్ల కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. కోరుట్ల ఆర్యవైశ్య సంఘం నాయకుడు మంచాల జగన్ పదిహేను రోజుల క్రితం కోరుట్ల కోర్టులో అడ్వకేట్ బోయిని సత్యం ద్వారా కంచ ఐలయ్య రచనపై పిటిషన్ వేశారు. విచారించిన కోరుట్ల మున్సిఫ్ కోర్డు జడ్జి ఏ.వెంకటేశ్వరరావు.. కంచ ఐలయ్యను కోరుట్ల కోర్టుకు హాజరు కావాలని కోరుతూ సమన్లు జారీ చేశారు. కాగా, కోర్టు కంచ ఐలయ్యకు కోర్టు సమన్లు జారీ చేయడంపై ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment