కీలకమైన ఎన్నికల్లో విజయం సాధించి కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రెండోసారి ఎన్నికవడం శుభవార్త అనే చెప్పాలి. ప్రజా సంక్షేమ రాజకీయాలకూ, మత రాజకీయాలకూ మధ్య జరిగిన ఎన్నిక ఇది. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాదరణ, స్థిరమైన లౌకిక ప్రజాస్వామ్య వ్యూహాలు సిద్ధ రామయ్యను నిజమైన మాస్ లీడర్‌గా మార్చాయి. దేశం మతతత్వం నుండి ప్రజాస్వామ్య సంక్షేమం వైపు మళ్లాల్సిన అవసరం ఉన్నందున, కర్ణాటక ఎన్నికలు దేశానికి చాలా ముఖ్యమైనవి. మహాత్మా ఫూలే, బి.ఆర్. అంబేడ్కర్, పెరియార్‌లు రాజకీయాలలో మతం ప్రమేయం లేకుండా సానుకూల ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు. సిద్ధరామయ్య మతపరమైన భావజాలానికి చోటివ్వకుండా లౌకికవాద భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్లే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందన్న కథనం ఢిల్లీ నుంచి వినిపిస్తోంది. ఇది ఒక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. కానీ రాష్ట్ర స్థాయిలో ఒక బలమైన మాస్ లీడర్ లేకుండా ఏ జాతీయ పార్టీ కూడా రాష్ట్ర ఎన్నికల్లో గెలవలేదు. శూద్ర ఓబీసీల కోసం నిబద్ధత కలిగి, మంచి పరిపాలనాదక్షుడిగా, చిల్లర అవినీతి రాజకీయాలకు అతీతంగా తనను తాను నిరూపించుకున్న సిద్ధరామయ్య లాంటి బలమైన లీడర్ లేకుండా కాంగ్రెస్ గెలవలేక పోయేది.
అవినీతికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నప్పటికీ, ఆయన పార్టీకి చెందిన కర్ణాటక నేతలు మాత్రం ఆయన మాట తప్పని నిరూపించారు. కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ కాంగ్రెస్ గెలుపులో మంచి పాత్ర పోషించినప్పటికీ, సిద్ధరామయ్యకు ఉన్న ప్రజాపునాది, క్లీన్ ఇమేజ్ ఆయనకు లేదు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రెండోసారి ఎన్నికవడం యావత్ భారతదేశానికి శుభవార్త అనే చెప్పాలి. అయినప్పటికీ, ఆయన రెండవ టర్మ్... మోసపూరిత బీజేపీని అదుపులో ఉంచడం, శివ కుమార్ తక్కువ స్థాయి ఆకాంక్షలను నియంత్రించడంతోపాటు మోదీని ఓడించిన ప్రజలను మాత్రమే కాకుండా స్థానిక నాయకులను సంతృప్తిపరిచేలా పరిపాలనను నడపడం వంటి సవాళ్లను కలిగి ఉంది.
ఇది ఆర్‌ఎస్‌ఎస్ తదుపరి సర్‌సంచాలక్ దత్తాత్రేయ హొసబలే సొంత రాష్ట్రం. బహుశా ఈయన కూడా ఢిల్లీలోని మొత్తం బలాన్ని ఉప యోగించి, అన్ని విధాలుగా రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవాలను కున్నారు. హొసబలే బ్రాహ్మణ నాయకుడు. అంతేకాకుండా మోదీకి బలమైన మద్దతుదారు. 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా తీసుకు రావడానికి హొసబలే కారణమని చెబుతున్నారు. అందుకే మోదీ ఓబీసీ కార్డ్‌ని, మతతత్వాన్ని ఉపయోగించి కర్ణాటకను గెలవడానికి తన ప్రభుత్వ బలాన్ని, తన సమయాన్ని, తన శక్తిని ఉపయోగించి నట్లనిపించింది.
ప్రతి గ్రామ వ్యవసాయ సమాజాన్నీ, చేతివృత్తుల సంçఘాన్నీ కలిసిన సిద్ధరామయ్య... మోదీ కంటే భిన్నమైన ఓబీసీ నాయకుడని తెలియజేస్తోంది. సిద్ధరామయ్య 75వ జన్మదినోత్సవానికి 16 లక్షల మంది హాజరైనట్లు ‘వికీపీడియా’ రాసింది. ‘‘సిద్ధరామయ్య తన 75వ పుట్టినరోజును 2022 ఆగస్టు 3న దావణగెరెలో జరుపుకొన్నారు. జనం దాన్ని సిద్ధరామోత్సవ అని పిలిచారు, సిద్ధరామయ్య అను యాయులైన 16 లక్షల మంది ఆనాటి కార్యక్రమానికి హాజర య్యారు’’. రాహుల్ గాంధీ కూడా హాజరైన ఈ జన్మదిన వేడుకల్లో, పైన చెప్పిన సంఖ్యలో సగం మంది హాజరైనా కూడా, లక్షలాది మంది జనం ఒక నాయకుడి చుట్టూ గుమికూడటం భారతీయ చరిత్ర లోనే అపూర్వం.
ఆయన పెద్ద లేదా చిన్న పట్టణ వ్యాపార నేపథ్యం నుండి కానీ, కొత్తగా చేర్చబడిన ఓబీసీ నేపథ్యం నుండి కానీ రాజకీయ అధికారానికి రాలేదు. ఆయన ఋగ్వేదం రాసిన రోజుల నుండి విద్య, ప్రభుత్వో ద్యోగం, మానవ గౌరవ హక్కుల నిరాకరణకు గురైన చారిత్రక శూద్ర గొర్రెల కాపరి కుటుంబానికి చెందిన ఓబీసీ. ఢిల్లీలో అధికారాన్ని ఓబీసీ ఓటు నిర్ణయిస్తుందని గ్రహించిన ఆరెస్సెస్–బీజేపీ శక్తులు, చాలా మంది శూద్రేతర నాయకులను ఓబీసీలుగా ప్రచారం చేస్తున్నాయి. మండల్ రిజర్వేషన్ ను వ్యతిరేకించిన తర్వాత ఓబీసీ ఓట్లు లేకుండా ఢిల్లీని చేజిక్కించుకోలేమని వారు గ్రహించడమే దీనికి కారణం. మోదీ, సుశీల్ మోదీ తరహాలో ఇప్పుడు ఓబీసీ కార్డు వాడు తున్న బీజేపీ నాయకులు ఆనాడు మండల్ రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తూ మిలి టెంట్ కమండల్ ఉద్యమ నాయకులుగా పనిచేశారు.
సిద్ధరామయ్య బలమైన మండల్ ఉద్యమ నాయకుడు. గొర్రెల కాపరి కుటుంబం నుండి వచ్చి, బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీలు పొందారు. ఆ రోజుల్లో ఇది ఒక కురుబ బాలుడు ఊహించనిది. ఎల్‌ఎల్‌బి పూర్తి చేసిన తర్వాత మైసూర్ ప్రాంతంలో సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నప్పుడు లా ప్రాక్టీస్‌లోకి ప్రవేశించారు. ఈ అసాధారణ యువ కురుబ న్యాయవాది 1980వ దశకం ప్రారంభంలో రైతు ఉద్యమంలో సుప్రసిద్ధ నాయకుడైన ఎం.డీ. నంజుండస్వామి దృష్టిని ఆకర్షించారు. ఆయనే సిద్ధరామయ్యను రాజ్య రైతు సంఘం ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించారు. అలా 1983లో గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు. తరువాత జనతా పార్టీలో చేరారు. వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ మంత్రి కాగలిగారు.
దేవెగౌడ పదవీ విరమణ చేసిన తర్వాత తాను ముఖ్యమంత్రి కావాలనే ఆశతో, పేదల అనుకూలత, నిబద్ధత కలిగిన ఓబీసీ, ఎస్సీ, ఆదివాసీ ప్రతినిధిగా జేడీ (యూ)లో చేరారు. ఆయన మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. కానీ సిద్ధరామయ్యను పట్టించు కోకుండా దేవెగౌడ తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేశారు. దేవెగౌడ సంప్రదాయవాద అర్ధ–హిందుత్వ నాయకుడు. కాగా, సిద్ధరామయ్య శూద్ర ఆధ్యాత్మిక భావజాలం కలిగిన హేతువాది.
ఆ తర్వాత జేడీ (యూ)ను విడిచిపెట్టి ‘అహిందా’ పార్టీని స్థాపించారు. అంటే ‘అల్పసంఖ్యాక, హిందూళిద, దళిత’ అని! హిందూళిద అంటే కన్నడంలో వెనుకబడినది అని అర్థం. వాస్తవానికి ప్రధాన స్రవంతి మీడియా సిద్ధరామయ్య నాటి దశను ఆయన రాజకీయ జీవితానికి ముగింపుగా చూసింది. మాస్ లీడర్ లేని సమయంలో ఆయన కాంగ్రెస్ లోకి వచ్చారు. ఓబీసీ ఎజెండా, లౌకిక వాదం, హేతువాదంపై తనకున్న బలమైన నిబద్ధతను వదలకుండా కాంగ్రెస్‌లోకి ప్రవేశించారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అన్ని ప్రకటనల్లో కుల వ్యతిరేకత, సెక్యుల రిజం, హేతువాదం పట్ల ఆయన నిబద్ధతను చూడవచ్చు.
ఎల్లప్పుడూ తన మణికట్టుకు కాషాయ దారాలను ధరించే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్ శైలితో దీన్ని పోల్చి చూడవచ్చు. కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విచిత్రంగా దేవాలయాలకు వెళ్తూ శివుడు (రాహుల్), హనుమంతుడి (ప్రియాంక) పూజలు చేస్తున్నారు. కానీ సిద్ధరామయ్య అలా చేయ లేదు. తన ఆధ్యాత్మిక నాయకుల సంప్రదాయంగా బసవ, అక్క మహా దేవిలను ఉదాహరిస్తారు. దేవాలయాల చుట్టూ తిరగరు.
సిద్ధరామయ్య, పినరయి విజయన్, ఎం.కె.స్టాలిన్, కె.చంద్ర శేఖరరావు, జగన్‌మోహన్ రెడ్డి– దక్షిణాదిలోని ముఖ్యమంత్రులందరూ శూద్ర వ్యవసాయ, చేతివృత్తుల నేపథ్యం ఉన్నవారే. ఉత్తరాదిలో అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, నితీశ్ కుమార్, భూపేశ్ బఘేల్, అశోక్ గెహ్లోత్ కూడా శూద్ర వ్యవసాయ నేపథ్యం నుండి వచ్చినవారే. వీరందరూ 2024లో మెజారిటీ పార్లమెంటు స్థానాలు గెలిస్తే బీజేపీ ఓడిపోతుంది.
జాతీయ శూద్ర–ఓబీసీ నాయకులు ఏకమై సానుకూల ప్రజా స్వామ్య సంక్షేమం దిశగా దేశాన్ని నడిపించాల్సిన సమయం ఇది. ఓబీసీ రాజకీయాల పేరుతో జరుగుతున్న మతతత్వాన్ని అంత మొందించాలి. వ్యవసాయాధారిత జాతీయవాదాన్ని అగ్జ్రపీఠిన ఉంచడం; ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు కానివారు భారీ మొత్తంలో కూడగట్టిన క్రోనీ క్యాపిటల్ సమీకరణను తనిఖీ చేయడం ప్రస్తుతం చాలా ముఖ్యం.
తమకు భాగస్వామ్యం లేని క్రోనీ క్యాపిట లిజానికి ఓబీసీలు మద్దతు ప్రకటిస్తే, అది భారతదేశ ప్రజాస్వామ్య పెట్టుబడిదారీ మార్గాన్ని నాశనం చేస్తుంది. మహాత్మా ఫూలే, అంబే డ్కర్, పెరియార్‌లు రాజకీయాలలో మతం ప్రమేయం లేకుండా సానుకూల ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు. సిద్ధరామయ్య తన జీవితంలో ఏ సమయంలోనైనా మతపరమైన భావజాలానికి చోటివ్వ కుండా లౌకికవాద భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
Comments
Please login to add a commentAdd a comment