ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడ్డాయి. కర్ణాటకలో ఉత్కంఠకు మాత్రం తెరపడలేదు. బీజేపీ సర్కార్‌ను మట్టి కరిపించిన కాంగ్రెస్ విజయగాథ ఇంకా పూర్తిగా ప్రచారం కాక ముందే, విజయ సారథులైన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, శాసనసభా పక్షా నేత సిద్దరామయ్యల మధ్య సీఎం సీటుకై సాగుతున్న పోటాపోటీ ప్రధాన వారై్త కూర్చుంది. సోమవారం కథ బెంగళూరు నుంచి ఢిల్లీకి మారింది.
కాంగ్రెస్ అధిష్ఠానం కోర్టులోకి కొత్త సీఎం ఎంపిక బంతి వచ్చి పడింది. పోటీదారు లిద్దరినీ ఎలా బుజ్జగించి, ఎవరి పేరును సీఎంగా ప్రకటిస్తుందన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాజీ ఫార్ములా ఏమైనా, వ్యవహారం అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్ల నిత్యకుంపటి రాజస్థాన్‌లా కాకూడదన్నదే ప్రస్తుతం కాంగ్రెస్ అజెండాగా కనిపిస్తోంది.
అధిక భాగం ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, సాక్షాత్తూ సిద్ద రామయ్య సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోమవారం దేశరాజధానికి విమానమెక్కారు. పుట్టినరోజు వేడుకలు, పూజా కార్యక్రమాల బిజీ మధ్య డీకే ఢిల్లీ పయనం ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కూ ఊగిసలాడింది.
అధిష్ఠానం ఆదేశించినా ఆఖరి క్షణంలో అనారోగ్యమంటూ వెళ్ళక డీకే తన అసంతృప్తిని పైవాళ్ళకు చెప్పకనే చెప్పారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలున్న వేళ సిద్ద, డీకేలలో ఒకరిని కాదని మరొకరిని ఎంపిక చేయడం కాంగ్రెస్ పెద్దలకు సైతం క్లిష్టమైన పనే. ఇద్దరూ సమర్థులే. ఇద్దరూ పార్టీ విజయానికి కష్టపడ్డవారే.
ప్రజానేతగా, గతంలో ప్రజానుకూల సీఎంగా తెచ్చుకున్న పేరు, పాలనానుభవం సిద్దకు కలిసొచ్చే అంశాలు. మరోపక్క పార్టీని పలువురు వదిలే సినా, కేంద్ర దర్యాప్తు సంస్థలు వేటాడినా కాంగ్రెస్‌కే కట్టుబడి, అంగ, అర్థబలాలతో భారీ విజయం కట్టబెట్టిన కార్యదక్షత డీకే ప్రధాన ఆకర్షణ. ఎవరినీ దూరం చేసుకోలేకే కాంగ్రెస్ వంతులవారీ సీఎం సీటనే లోపాయకారీ ఫార్ములాతో శాంతపరచజూస్తోంది. కాకపోతే ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో లాగా ఆ ఫార్ములా ఆచరణలో అమలుకాదేమో అన్నది రెండో వంతులో సీఎం కావాల్సినవారి భయం.
ఎన్నికల వేళ కలసి ప్రత్యర్థి పార్టీపై పోరాడిన కర్ణాటక కాంగ్రెస్ దిగ్గజ నేతలు తీరా ఫలితాలు వెలువడిన మరుక్షణమే సీఎం సీటుకై పాత ప్రత్యర్థులుగా మారిపోవడం విచిత్రమే. బీజేపీతో ఢీ అంటే ఢీ అనడానికి ఇప్పుడిప్పుడే సర్వశక్తులూ ఒడ్డుతున్న పార్టీకి ఇది పెద్ద తలనొప్పే కాక ప్రజాక్షేత్రంలోనూ తలవంపులే. దీని నుంచి బయటపడడం ఇప్పుడు ఆ పార్టీ, ఆ పార్టీ నేతల చేతుల్లోనే ఉంది.
నిజానికి, 224 స్థానాలున్న కీలక దక్షిణాది రాష్ట్రంలో 42.9 శాతం ఓటు షేర్‌తో 135 సీట్లు గెలవడం మోదీ ప్రవేశానంతర రాజకీయ క్షేత్రంలో కాంగ్రెస్‌కు పెద్ద సాంత్వన. 2018 ఎన్నికలతో పోలిస్తే, 4.8 శాతం ఓటు షేర్, 55 సీట్లు అధికంగా ఆ పార్టీ దక్కించుకోవడం విశేషం. బీజేపీ మాత్రం అర శాతం లోపే ఓటు షేరు తగ్గినా, 38 సీట్లు చేజార్చుకొని 66 స్థానాల్లోనే గెలుపొందగలిగింది. బీజేపీ ప్రభుత్వ పాలనావైఫల్యానికి దర్పణంగా డజనుమంది మంత్రులు ఓటమిపాలై, ఇంటి దారి పట్టాల్సొచ్చింది.
పాలనలో లోపంతో పాటు పేరుకున్న అవినీతి, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, లింగాయత్ వర్గాన్ని దూరం చేసుకోవడం – ఇలా బీజేపీ ఓటమికి అనేక కారణాలు. రాష్ట్రంలో 16–17 శాతం జనాభాతో, ఒకప్పుడు కమలానికి బలమైన ఓటుబ్యాంక్‌గా నిలిచిన వీరశైవ లింగాయత్‌లు ఈసారి హస్తం గుర్తుకు జై కొట్టారు. ఉత్తర కర్ణాటకలో వచ్చిన ఫలితాలు, బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పక్షాన గెలిచిన లింగాయత్ ఎమ్మెల్యే అభ్యర్థుల సంఖ్యే అందుకు సాక్ష్యం.
బీజేపీలో తమకు అవమానం జరిగిందంటూ తమ వైపు మొగ్గిన ఈ బలమైన లింగాయత్ వర్గాన్ని అలాగే నిలుపుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్‌దే. మరో బలమైన ఒక్కళిగ వర్గానికి చెందిన డీకేనూ దూరం చేసుకోలేదు. పైగా, లోక్‌సభ ఎన్నికల్లోనూ 28 సీట్ల కన్నడసీమలో ఇదే విజయ దరహాసం పునరావృతం కావాలంటే పార్టీని సమర్థంగా నడిపే కార్యశూరులే కావాలి. 75 లక్షల సంస్థాగత బలంతో, సిద్ద, డీకే లాంటి స్థానిక నేతలతోనే తాజా విజయం సాధ్యమైందని అధిష్ఠానానికీ తెలుసు.
ఒక రకంగా కర్ణాటక ఫలితాలు గెలిచిన కాంగ్రెస్‌కూ, ఓడిన బీజేపీకీ రెంటికీ స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి. జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలు, సారథులు, ప్రజా సంక్షేమ వాగ్దానాలు, బడుగు బలహీన వర్గాల, దళిత, మైనారిటీల ఏకీకరణ రాజకీయంతో మోదీ, షా లాంటి బలమైన ప్రత్యర్థుల్ని సైతం ఢీకొట్టవచ్చని గ్రాండ్ ఓల్డ్ పార్టీ నేర్వాల్సిన పాఠం. అతి జాతీయవాదం, మను షుల్ని చీల్చే మతతత్వం, ‘ఒకే దేశం ఒకే భాష’తో ఆసేతు హిమాచలాన్ని చాపచుట్టేయాలనుకుంటే అది కుదరని పని అనేది కాషాయపార్టీకి కర్ణాటక చావుదెబ్బ చెబుతున్న గుణపాఠం.
మోదీపై బీజేపీ అతిగా ఆధారపడితే లాభం లేదు. స్థానికంగా పార్టీ, నాయకత్వం బలంగా ఉంటేనే ఆ మోళీ పని చేస్తుందనడానికి యూపీ, అస్సామ్, మధ్యప్రదేశ్‌లే తార్కాణం. 2014 మే తర్వాత జరిగిన 57 అసెంబ్లీ ఎన్నికల్లో సగానికి పైగా వాటిలో మోదీ ఉన్నా ఆ పార్టీ ఓడిపోయిందనేది కఠిన వాస్తవం. అది తెలిసి నడుచుకోకుంటే బీజేపీకి కష్టం. ఇక, కర్ణాటక ఫలితాలతో లోక్‌సభపై ఆశలు పెంచుకుంటున్న ప్రతిపక్షాలు అతిగా లెక్కలేసి, సంబరపడితే సరిపోదు.
జాతీయ స్థాయిలో నేటికీ తిరుగులేని మోదీకి ప్రత్యామ్నాయంగా నిలవాలంటే, నిందలు, ఆరోపణల కన్నా ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలి. బలవంతుడైన ప్రత్యర్థిపై కలసికట్టుగా పోరాడాలి. సీఎం సీటు చేజారవచ్చనే నిస్పృహలో ‘ధైర్య సాహసాలు నిండిన ఒక్క వ్యక్తి వల్లే మెజారిటీ సాధ్య’మని గర్జిస్తున్న డీకేకి సైతం ఆ సంగతి తెలీదనుకోలేం. మరిన్ని సవాళ్ళు ముందున్న వేళ పార్టీకైనా, వ్యక్తులకైనా ఐకమత్యమే మహాబలం.
ఈ ఎన్నిక ఏం చెబుతోంది?
Published Tue, May 16 2023 12:23 AM | Last Updated on Tue, May 16 2023 12:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment