సాక్షి, విజయవాడ: వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య సభకు అనుమతివ్వాలని కోరుతూ ఐలయ్య వర్గానికి చెందిన జేఏసీ నేతలతో కలిసి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు. జింఖానా గ్రౌండ్ లో ఐలయ్య సంఘీబావ సభకు రేపు(శనివారం) అనుమతివ్వాలని.. లేకుంటే కందుకురి ఫంక్షన్ హాలులోనైనా అనుమతినివ్వాలని అభ్యర్ధించారు. సభ కోసం అక్టోబర్ 9 నే కార్పొరేషన్‌కు చలనా కట్టామని, అనుమతి కూడా వచ్చిందని తెలిపారు. కానీ ఇప్పుడు పొలీసులు ర్యాలీకి, సభకు అనుమతి నిరాకరించడం దుర్మార్గమన్నారు.
తమకు కందుకూరిలో అనుమతినిచ్చి ఆర్యవైశ్యులకు మరో ప్రాంతంలో అనుమతినివ్వాలని తెలిపారు. పోలీసులు అనుమతినిచ్చినా ఇవ్వకున్నా సభ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ముకాస్తోందని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా సభ నిర్వహించుకుంటామని, కావాలని కొన్ని సంఘాలు సభను అడ్డుకోవాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.