
'వాళ్లందరూ బీఫ్ తిన్నవాళ్లే'
హాలియా (నల్లగొండ): పశుమాంసం తినడంలో తప్పులేదని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య అభిప్రాయపడ్డారు. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. మంగళవారం నల్లగొండ జిల్లా హాలియాలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు పశు పరిశ్రమ ఎంతగానో దోహదపడుతుందన్నారు.
ఈ ప్రాంతంలో పశుపరిశ్రమ అభివృద్ధికి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు బీఫ్‌ఫెస్టివల్ ఏర్పాటు చేశారని తెలిపారు. దీనిని ఒక పండుగలా కాకుండా ఉద్యమంలా నిర్వహించాలని సూచించారు. ప్రపంచంలోని గొప్ప మేధావులు, శాస్త్రవేత్తలందరూ బీఫ్ తిన్నవారేనన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అన్ని రకాల ఆహార పదార్థాలు తినేవారని ఈ సందర్భంగా కంచ ఐలయ్య గుర్తు చేశారు.