సాక్షి, న్యూఢిల్లీ: కంచ ఐలయ్య రాసిన వివాదాస్పద పుస్తకం ‘సామాజిక స్మగ్లర్లు– కోమటోళ్లు’ను నిషేధించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి తన అభిప్రా యాలను వ్యక్తం చేయడం ప్రాథమిక హక్కు అని, రచయితకు వ్యక్తిగతంగా తన భావా లను వ్యక్తపరిచే హక్కు ఉందని పేర్కొంది. ఈ మేరకు పిటిషన్‌ను కొట్టివేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐలయ్య రాసిన ఈ పుస్తకాన్ని నిషేధించాలంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కేఎల్‌ఎన్‌వీ వీరాంజ నేయులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్ లతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా వీరాంజనేయులు వాదిస్తూ.. ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకుని కంచ ఐలయ్య ఈ పుస్తకాన్ని రాశారని, దానిని నిషేధించాలని విన్నవించారు. దీంతో ‘‘ఆ పుస్తకాన్ని ఎందుకు నిషేధించాలి?’అని ధర్మాసనం ప్రశ్నించగా... ‘హిందువులను, ప్రత్యేకంగా ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకుని వారిని కించపరుస్తూ అందులో రాశారు..’అని పిటిషనర్ వివరించారు. దీంతో ధర్మాసనం జోక్యం చేసుకుని.. ‘‘మిత్ (పురాణం) అంటే ఏమిటి? దానిని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఎవరి అవగాహనలు వారికి ఉంటాయి. వాటిలో మనం ప్రవేశించలేం. మరీ ముఖ్యంగా జీవనం, సంప్రదాయం, ఆచారాలు, సాంస్కృతికం తదితర అంశాలపై ఎవరి రూపకాలు వారివి. వాటిని మనం వారి అవగాహనలుగా, వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే చూడాలి. మీకు నచ్చని అభిప్రాయాలు ఉన్నప్పుడు మీరు వాటిని చదవకండి..’అని వ్యాఖ్యానించింది. 1880 లో బెంగాలీ రచయిత మైఖేల్ మధుసూదన్ దత్తా రామాయణానికి ‘మేఘనాథ్ వధ్ కావ్య’పేరుతో రాసిన పుస్తకంపై విమర్శలు, నిషేధించాలన్న డిమాండ్లు వచ్చాయని.. కానీ అది చెలామణిలో ఉందని పేర్కొంది.
భావ ప్రకటనా స్వేచ్ఛను కాదనలేం..
ఒక రచయితగా తన భావాలను వ్యక్తపరిచే హక్కు ఐలయ్యకు ఉందని, మీ గురించి రాసినందుకు మీరు గర్వపడాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.‘‘భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. ప్రతి రచయిత భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును కలిగి ఉన్నారు. రాజ్యాంగానికి లోబడి వారి అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. అందువల్ల తన వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తీకరించిన ఒక రచయిత పుస్తకాన్ని నిషేధించాలని చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతున్నాం..’’అని తీర్పులో పేర్కొంది. ఈ ఉత్తర్వులు రాతపూర్వకంగా శనివారం వెలువడే అవకాశముంది.
భావ ప్రకటనా స్వేచ్ఛకు గౌరవం: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: సుప్రీం తీర్పు భావ ప్రకటనా స్వేచ్ఛకున్న గౌరవాన్ని స్పష్టం చేసిందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కంచ ఐలయ్య పుస్తకంపై వివాదం మొదలైన నాటి నుంచి సీపీఎం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని తెలిపారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా రచయితకు చట్ట పరిధిలో తన భావాలను వ్యక్తపరిచే అవకాశముందని తీర్పులో స్పష్టం చేసిందన్నారు.ఈ తీర్పును అందరూ గౌరవించాలని, పాలకపక్షాలు రెచ్చగొడుతున్న పరిస్థితిని గమనించి.. చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు.
సుప్రీం తీర్పు హర్షణీయం: కంచ ఐలయ్య
సాక్షి, హైదరాబాద్: తన పుస్తకంపై నిషేధం విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంపై కంచ ఐలయ్య హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, న్యాయ వ్యవస్థపై తనకు మరింత నమ్మకం పెరిగిందంటూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛపై తాను చేస్తున్న పోరాటానికి మద్దతు పలికిన రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment