సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన ‘కోమటోళ్లు -సామాజిక స్మగ్లర్లు’ అనే నవలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం రాసినందుకు ఆయనపై మల్కాజ్‌గిరి, కోరుట్ల, కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు కేసులను నమోదు చేశారు. ఈ కేసులను కొట్టేయాలని కోరుతూ కంచ ఐలయ్య గురువారం హైకోర్టులో వేర్వేరుగా మూడు పిటిషన్లు దాఖలు చేశారు. నమోదు చేసిన కేసులు తన ప్రాథమిక హక్కులను భంగం కలిగించే విధంగా ఉన్నాయని ఆయన పిటిషన్లలో పేర్కొన్నారు.
తాను ఏ కులాన్ని, వర్గాన్ని కించపరిచే ఉద్దేశంతో ఆ పుస్తకం రాయలేదని వివరించారు. పూర్వకాలంలో ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకునే ఆ పుస్తకం రాశానని తెలిపారు. కోమట్ల చరిత్ర, సమాజంలో వారి పాత్ర, వారి ఆర్థిక స్థితిగతులు తదితర విషయాల గురించే రాశానన్నారు. స్మగ్లర్ అన్న పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే సమస్యలు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్మగ్లర్ అన్న పదానికి నిఘంటువుల్లో ఉన్న అర్ధాలను వివరించారు.
రచయితగా తనకున్న వాక్ స్వాతంత్ర్యాన్ని పట్టించుకోకుండా పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని వివరించారు. తన పుస్తకంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సైతం కొట్టేసిందన్నారు. తన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ రచయితగా తనకుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని అన్నారు. పుస్తకం మొత్తం చదవకుండా అందులోని కొన్ని అంశాలనే తీసుకుని ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారని ఆయన తెలిపారు.
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఫిర్యాదులు ఇవ్వడం జరిగిందన్నారు. పోలీసులు కూడా కనీస పరిశీలన చేయకుండానే కేసులు నమోదు చేశారని, అందులోనూ వర్తించని అనేక సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారని వివరించారు. అందువల్ల ఆ కేసులను కొట్టేయాలని ఆయన కోర్టును కోరారు. అంతేకాక ఒకే అంశానికి సంబంధించి పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చెల్లదని కంచ ఐలయ్య అన్నారు. ఈ వ్యాజ్యాలు శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment