అగ్రిగోల్డ్ వ్యవహారంలో అరెస్టుల్లేవా?
ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది సాధారణ, మధ్య తరగతి ప్రజల నుంచి వేల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి, వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేసిన అగ్రిగోల్డ్ సంస్థ వ్యవహారంలో ప్రభుత్వాల నిర్లిప్తతపై సోమవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతపెద్ద వ్యవహారంలో ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది. కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటే సరిపోతుందా? అంటూ అసహనం వ్యక్తం చేసింది.
డిపాజిట్లపై ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు? ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయి? వాటి పరిస్థితి ఏమిటి? తదితర వివరాలను తమ ముందుంచాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 3కి వాయిదా వేసిన ధర్మాసనం.. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి వ్యక్తిగతంగా నోటీసులు అందజేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రజా సమీర్ అహ్మద్‌ను ఆదేశించింది.