ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఎందాకా? | Professor Kancha Ilaiah Article Is India Face China Manufacturing Capacity | Sakshi
Sakshi News home page

ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఎందాకా?

Published Sat, May 16 2020 12:33 AM | Last Updated on Sat, May 16 2020 12:33 AM

Professor Kancha Ilaiah Article Is India Face China Manufacturing Capacity - Sakshi

కోవిడ్‌–19 ఇప్పటికే అమెరికా, చైనా మధ్య ప్రచ్ఛన్న యుద్ధ తరహా పరిస్థితిని సృష్టిం చింది. భారత్‌ ఈ ప్రచ్ఛన్న యుద్ధ ఉద్రిక్తతలో భాగం పంచుకుంటూ అమెరికా పక్షం వహిం చింది. ఇప్పటికైతే అమెరికా, చైనాలు ఆర్థిక, సైనిక శక్తి విషయంలో పోటీపడుతున్నాయి. తమ ఆర్థిక, సైనిక శక్తితో చైనా, రష్యాలు ఒకవైపు చెక్‌ పెడుతున్నప్పటికీ.. ప్రపంచ సామ్రాజ్యవాద నియంత్రణ బలం కలిగిన పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికా. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయానికి, అమెరికాతో అనేక రంగాల్లో చైనా సమాన స్థాయిలో నిలబడటానికి ప్రయత్నిస్తూ వచ్చింది.

ప్రత్యేకించి భారీస్థాయిలో ఉన్న నిపుణ కార్మిక శక్తి ఆధిపత్యంతో చైనా అమెరికాను సవాలు చేస్తోంది. ప్రపంచీకరణ ప్రక్రియను నేర్పుతో నిర్వహించడం ద్వారా ప్రపంచ మార్కెట్లలో అమెరికాను తోసిరాజన్న చైనా.. తన సరుకులు, విని యోగ వస్తువులతో అమెరికా మార్కెట్లనే ముంచెత్తింది. శ్రామిక శక్తితో కూడిన సోషలిజాన్ని చైనా ఆచరణలో పెడుతూ వస్తోంది. పూర్వపు సోవియట్‌ యూనియన్‌ ఇక్కడే దెబ్బతినిపోయింది.

ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన మార్కెట్‌ నియంత్రణదారుగా చైనా అవతరించింది. కొన్ని రంగాల్లో అయితే తన సొంత బ్రాండ్‌తోకూడిన వినిమయ సంస్కృతిని సృష్టించడం ద్వారా యూరో–అమెరికన్‌ మార్కెట్లలోకి కూడా చైనా చొచ్చుకుపోయింది. శ్రమశక్తిని, నైపుణ్యాన్ని, విజ్ఞానశాస్త్రాన్ని మేళవించడం అనే కారల్‌ మార్క్స్‌ స్వప్నాన్ని చైనా ఆవిష్కరించింది. ఉన్నత మానవ జీవితాన్ని సాధ్యం చేసే నూతన ప్రపంచ వ్యవస్థను కూడా చైనా సృష్టించింది. పెట్టుబడిదారీ పాశ్చాత్య ప్రపంచం ప్రకృతి అసమతుల్యతను సృష్టించడం ద్వారా అవసరానికి మించి అధికంగా వినియోగించసాగింది.

ఇప్పుడు కరోనా వైరస్‌ సరిగ్గా ఆ వినియోగదారీ సంస్కృతిలోనే సరికొత్త సంక్షోభాన్ని సృష్టించింది. ఈ పాత వ్యవస్థను మార్చడం ద్వారానే కరోనా అనంతర ప్రపంచం ఆవిర్భవించవచ్చు. బలమైన కమ్యూనిస్టు వ్యతి రేక మనోభావాలు కలిగిన భారతీయ ప్రభుత్వాలు.. చౌక ధరలతో కూడిన సరుకులతో చైనా సాగిస్తున్న మార్కెట్‌ విస్తరణను అడ్డుకోలేకపోయాయి. 130 కోట్లమంది ప్రజలున్న అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారత్‌కు, 1962 యుద్ధం తర్వాత చైనా ప్రాదేశిక విస్తరణకు పూనుకుంటుందన్న భయం ఉన్నప్పటికీ దాని మార్కెట్‌ వృద్ధిని మాత్రం అధిగమించలేకపోయింది.
 

పైగా చైనా బజార్లు మన దేశం లోని దిగువ ఆదాయ తరగతుల జీవన ప్రమాణాలను పెంచడంలో సాయపడ్డాయి. ఈరోజు భారత్‌లోని ప్రతి నగరంలోనూ, ప్రజా బృందాలకు చైనా బజార్లు అందుబాటులో ఉంటున్నాయి. చైనా బజార్లు కారు చౌక ధరలకు సరుకులను అమ్ముతుండటంతో భారతీయ అల్పాదాయవర్గాలు వాటి ముందు క్యూ కడుతున్నాయి. ప్రత్యేకించి అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో 1999–2004 మధ్య కేంద్రంలో సాగిన బీజేపీ ప్రభుత్వం కానీ 2014 నుంచి మోదీ నేతృత్వంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం కానీ కమ్యూనిజాన్ని తమ నెంబర్‌ వన్‌ శత్రువుగా భావిస్తూ వచ్చాయి.

అయినప్పటికీ చైనా సరు కులు భారతీయ మార్కెట్లలో పోటెత్తకుండా వాజ్‌పేయి, మోదీ ప్రభుత్వాలు అడ్డుకోలేకపోయాయి. దీనివెనుక కారణం ఏమిటంటే  ప్రపంచంలోని ప్రతి సమాజం అవసరాలు, అభిరుచులను జాగ్రత్తగా అధ్యయనం చేసిన తర్వాతే, నాణ్యమైన సరుకులను చౌక ధరలకు ఎలా ఉత్పత్తి చేయాలో చైనా కార్మికులు చక్కగా నేర్చుకున్నారు. ఈ తరహా చైనా ఉత్పత్తి ఫార్ములాను దాని నిపుణులు యూరో–అమెరికన్‌ మార్కెట్లలోకి కూడా తీసుకుపోయారు. 

అంతర్జాతీయ సమాజపు బహుళ సంస్కృతి అవసరాలను జాగ్రత్తగా అధ్యయనం చేసిన చైనా.. అటు ఆహార పదార్థాలనుంచి ఇటు పడకగది అలంకరణల వరకు ప్రపంచ జనాభాలోని అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉండే ఉత్పత్తుల తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. చివరకు ఈ చైనా బజార్ల కారణంగానే ఆఫ్రికన్లు, అరబ్బులు సైతం 21వ శతాబ్ది జీవిత సౌకర్యాలను గురించి బాగా తెలుసుకున్నారు. అంతర్జాతీయ ఆధునిక జీవితానికి అవసరమైన అనేక కొత్త వస్తువులను అందించిన చైనా ఇప్పుడు కరోనా వైరస్‌కు కూడా మూలస్థానంగా నిలిచింది. ఈ వైరస్సే ఇప్పుడు అమెరికా, జర్మనీ, జపాన్, భారత్, ఆస్ట్రేలియా వంటి చైనా ప్రత్యర్థులు ఏకం కావడానికి దారి తీసింది. అయితే కరోనా అనంతర ప్రపంచంలోకి చైనా సరుకులు వెళ్లకుండా ప్రత్యర్థులు అడ్డుకోగలరా అన్నదే ప్రశ్న.

ఇప్పుడు ట్రంప్, జిన్‌పింగ్‌ ప్రభుత్వాల మధ్య నడుస్తున్న యుద్ధానికీ, 1950లు, 60లు, 70లలో అమెరికా, సోవియట్‌ యూని యన్‌ మధ్య కొనసాగిన ప్రచ్ఛన్నయుద్ధానికి మధ్య పోలికలే లేవు. ఎందుకంటే సోవియట్‌ యూనియన్‌ తన కాలంలో ఏ దేశంలోనూ గృహ, కిచెన్‌ మార్కెట్‌ని నియంత్రించలేకపోయింది. ఆయుధాల అమ్మకమే యూఎస్‌ఎస్‌ఆర్‌ ఏకైక మార్కెట్‌గా ఉండేది. పైగా వినియోగదారీ సరుకులను భారీగా ఉత్పత్తి చేసే శ్రామికశక్తి నైపుణ్యాలు యూఎస్‌ఎస్‌ఆర్‌కి ఉండేవి కావు. కానీ నేడు చైనా తన 140 కోట్ల ప్రజానీకపు పరిమాణం, నాణ్యత (చక్కటి వ్యవసాయ పునాది, నైపుణ్యాలతో కూడిన కఠిన శ్రమశక్తి)తో కూడిన శ్రామిక శక్తిని ఉపయోగిస్తోంది.

పైగా తాను సాధించిన ప్రతి ఫలితానికి సోషలిస్టు సంస్థాగత నైపుణ్యాలను జోడించింది. ప్రత్యేకించి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో చైనా చౌక ఉత్పత్తులు ప్రజారాశుల జీవన శైలినే మార్చివేశాయి. కోవిడ్‌–19 అనంతర కాలంలో ప్రపంచ మార్కెట్లలో చైనా స్థానాన్ని భర్తీ చేయడానికి తమ హిందుత్వం తోడ్పడుతుందని బీజేపీ సిద్ధాంతకారులు చెబుతున్నారు. అయితే చైనాలోని నిపుణ శ్రామిక శక్తిని సవాలు చేసేలా భారత్‌ తన శ్రామిక శక్తిని సిద్ధం చేయగలదా? చైనా తయారు చేస్తున్న స్థాయిలో చౌక ధరలు, నాణ్యతతో కూడిన సరుకులను, వస్తువులను భారత్‌ తయారు చేయగలదా?

ముస్లిం వ్యతిరేక సాంస్కృతిక జాతీయవాదం తోనే ఆరెస్సెస్‌ 95 ఏళ్లుగా మనగలుగుతూ వచ్చింది. భారత్‌లో దిగువ కులాలనుంచి వచ్చిన శ్రామిక శక్తి నైపుణ్యాలను పెంచడం గురించి ఆరెస్సెస్‌ ఎన్నడూ ఆలోచించలేదు. చైనీయుల కన్ఫ్యూసియనిజం, బుద్ధిజం, మార్క్సిజం మానవుల సమానత్వాన్ని, శ్రమ పట్ల గౌరవాన్ని విశ్వసిస్తాయి. కానీ కౌటిల్యుడు, మనువు, గోల్వాల్కర్‌ ఆలోచనలను మూలంగా కలిగిన ఆరెస్సెస్‌ భావజాలం.. మానవ సమానత్వం, శ్రమను గౌరవించడం గురించి తన చరిత్రలో ఎన్నడూ ప్రచారం చేయలేదు. శ్రమనే జీవి తంగా గడుపుతున్న చైనా శ్రామిక శక్తిని ఆరెస్సెస్‌ భావజాలం ఎలా సవాలు చేయగలదు? ఆరెస్సెస్‌ ప్రవచించే ‘జై శ్రీరామ్‌’ నినాదం ‘వంద పుష్పాలు వికసించనీ, వేయి భావాలు ఘర్షించనీ’ అనే చైనా నినాదాన్ని సవాలు చేయగలదా? సామాజిక, ప్రకృతి శాస్త్రాల మేళ వంతో కూడిన వందభావాల ఘర్షణ ఫలితమే చైనా మార్కెట్‌ విస్తరణ.

‘మేడ్‌ ఇన్‌ చైనా’ అనే ముద్ర ఉంది కాబట్టి చైనా వస్తువులను, సరుకులను కొనుగోలుదారులు ఇష్టపడటం లేదు. చౌక ధరలతో లభి స్తాయి, మన్నికగా ఉంటాయి కాబట్టే ప్రపంచమంతటా చైనా వస్తువులను కొంటున్నారు. రేపు మనం కూడా మేడ్‌ ఇన్‌ ఇండియా బ్రాండ్‌ వేసి చైనాలాగా చౌకగా భారతీయ వస్తువులను ఎగుమతి చేసినా, చైనా సరుకుల్లోని నాణ్యతను ఇవ్వలేకపోతే ఎవరూ మన సరుకులను కొనబోరు. అందుకే ఆరెస్సెస్‌ సిద్ధాంతకారులు తమ సాంస్కృతిక జాతీయ వాదాన్ని విడిచిపెట్టి శ్రమశక్తిని గౌరవించడానికి అధిక విలువనిచ్చే ఉత్పాదక జాతీయవాదం గురించి పాఠాలు నేర్చుకుని తీరాలి.

లేబర్‌ మార్కెట్‌ను కులాలకు అతీతంగా మార్చడాన్ని వారు నేర్చుకోవాలి. చైనా, భారత్‌లకు సరిహద్దులున్నాయి కానీ ఈ రెండు దేశాలు తమ సంస్కృతులను ఎన్నడూ పరస్పరం పంపిణీ చేసుకోలేదు. పూర్తిగా విభిన్నమైన సంస్కృతులతోటే ఇవి మనగలుగుతూ వచ్చాయి. చైనా గ్రామీణ పరిశ్రమ వివిధరకాల సాంస్కృతిక, వాణిజ్య మార్కెట్లకు తగిన సరుకులను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో ఉంటున్నాయి. మరి మన గ్రామీణ పరిశ్రమ పరిస్థితి ఏంటి? ప్రధాని నరేంద్రమోదీ కరోనా అనంతర ఆర్థిక కార్యాచరణ కోసం 20 లక్షల కోట్ల రూపాయలతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. కుటీర పరిశ్రమలను నెలకొల్పడం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ ప్రపంచ మార్కెట్‌ అభిరుచులను సంతృప్తిపరిచే వస్తువులు, సరుకులను గ్రామీణ భారత్‌లోని నిపుణ కార్మికులు తయారు చేయగలరా? ఇక నుంచి మన స్థానిక ఉత్పత్తులు గ్లోబల్‌ బ్రాండ్లు కావాలని మోదీ ఆశి స్తున్నారు. ఎలా సాధ్యం?

గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం లాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా చైనా ద్విభాషా దేశంగా ఉందన్న విషయాన్ని గుర్తించడంలో విఫలమయ్యాయి. చైనా వ్యాప్తంగా మాండరీన్, ఇంగ్లిష్‌ భాషలు రాజ్యమేలుతున్నాయి. ఏ దేశానికి ఎలాంటి ఉత్పత్తులు అవసరం అనే అంశాన్ని గ్రామీణ చైనాలోని బ్రాండ్‌ మేకర్లకు బాగా తెలుసు. 1970ల నుంచి చైనాలో సిద్ధాంతం, ఆచరణల తోడుగా పాఠశాల విద్యా ప్రణాళిక నడుస్తోంది. మరి బీజేపీ ప్రభుత్వం ప్రబోధిస్తున్న స్కూలు విద్యా ఎజెండా ఏంటి? పురాణాలను ఆధునిక శాస్త్రంగా బోధించడం తప్ప పొలం దున్నడం, పంటలు పండించటమే భారతీయ సంస్కృతి అని బోధించడానికి మన పిల్లలను ఉత్పాదక క్షేత్రాల వద్దకు తీసుకుని పోవడం లేదు.

చైనాలోని పిల్లలందరికీ తమ స్కూల్‌ కరిక్యులంలో భాగంగా పొలాల్లో పనిచేయడం నేర్పుతున్నారు. చైనాను మనం సవాలు చేయడం అంటే మనకు వాడుకలో ఉన్న అనేక అంశాల బూజు దులిపి కొత్త అంశాలను నేర్చుకోగలగడమే. ఈ కొత్త అంశాలు ఇప్పుడు జాతీయవాదతత్వంతో కనిపించకపోవచ్చు. నమస్తే ట్రంప్‌ అనే భావజాలంతో చైనాతో ప్రచ్ఛన్నయుద్ధం సాగించడం వల్ల దేశీయంగా కుటీర పరిశ్రమను అభివృద్ధి చేయలేం. పైగా ట్రంప్‌ పక్కా బిజినెస్‌మన్‌. తన ముందు ఎన్నికలు సవాలుగా ఉన్నాయి. ఈసారి కూడా ట్రంప్‌ గెలుపొందితే కచ్చితంగా జిన్‌పింగ్‌తో వాటాలు పంచుకుంటాడు తప్ప మోదీతో దాల్‌ రోటీని పంచుకోడు.
వ్యాసకర్త: ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య షెపర్డ్‌, డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement