కరోనా వైరస్ సృష్టికర్త చైనాయే కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కరోనా వల్ల కలిగిన తీవ్ర నష్టానికి చైనానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్–19 మహమ్మారి వూహాన్ ప్రయోగశాలలోనే పుట్టిం దని, అది లీక్ అయి బయటపడి ఉత్పాతం సృష్టించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇతర అత్యున్నతాధికారులు పదే పదే ఆరోపిస్తూ వస్తున్నారు. కానీ కరోనా వైరస్‌ని చైనాయే కృత్రిమంగా సృష్టిం చినట్లు చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అంతర్జాతీయ జీవాయుధ నిపుణులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో అమెరికా ఆరోపణలు ఏమేరకు చెల్లుబాటు అవుతాయన్నది సందేహాస్పదంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్లుగా ప్రపంచానికి సరుకుల సరఫరా కేంద్రంగా ఉంటూ వచ్చిన చైనాపై అతిగా ఆధారపడటం తగ్గించుకోవాలని అమెరికా, యూరప్ దేశాలు భావిస్తున్నాయి.
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో నేతృత్వంలో భారత్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియాతో సహా ఏడు దేశాల విదేశాంగ మంత్రులు ఇటీవలే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని కరోనా సాంక్రమిక వ్యాధి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని దుష్ప్రభావాలు, ప్రపంచం ముందున్న మార్గాల గురించి చర్చించారు. ప్రయోగాత్మక ఆన్‌లైన్ డిప్లొమసీగా పేర్కొన్న ఈ సదస్సులో ప్రపంచంలో ఒకే ఒక్క దేశం నుంచి అంటే చైనా నుంచి సరుకుల సరఫరాపై ఆధారపడటాన్ని తగ్గిం చుకోవడం ఎలా అన్న అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. పైగా, గత కొంతకాలంగా పారిశ్రామిక వస్తువుల సరఫరా మార్గాలను చైనా వెలుపలకు తరలించే పథకాల గురించి ట్రంప్ యంత్రాంగం తరచుగా ప్రస్తావిస్తూ వస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి, కరోనా వంటి ఉత్పాతం ఇక ఎన్నడూ జరగని విధంగా వస్తు సరఫరా మార్గాలను పునర్నిర్మించే మార్గాలను కనుగొనడానికి అమెరికా ప్రభుత్వం ఆస్ట్రేలియా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, వియత్నాంలతో కలిసి పనిచేస్తోందని ఏప్రిల్ 29న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు.
భారత్ తరపున ఈ సదస్సుకు హాజరైన విదేశాంగమంత్రి జైశంకర్ ఈ కాన్ఫరెన్స్‌లో కరోనా వైరస్ పట్ల ప్రపంచ స్పందన, ప్రపంచ ఆరోగ్య నిర్వహణ, వైద్య సహకారం, ఆర్థిక పునరుద్ధరణ, పర్యాటక నిబంధనల వంటి పలు అంశాలపై చర్చించినట్లు ట్వీట్ చేశారు. ఇప్పుడు ప్రపంచ దేశాల సెంటిమెంట్ మొత్తంగా కరోనా నుంచి బయటపడటంపైనే నడుస్తోంది. మునుపటి వైరస్‌లు ప్రపంచంలో కొన్ని పరిమిత ప్రాంతాలపైనే విరుచుకుపడ్డాయి. కానీ కరోనా వైరస్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా దీర్ఘకాలం విస్తరించేలా ఉంది. కాబట్టి మిత్ర దేశాల మధ్య ఏ పునరుద్ధరణ ప్రణాళికకైనా దీర్ఘకాలిక పరిష్కారాలు, సహకారమే ప్రాతిపదికగా ఉండాలి. అయితే ప్రపంచ నేతల సంభాషణ మొత్తంగా చైనా, వైరస్‌పై దాని స్పందనపై చర్యల చుట్టూనే తిరుగుతోంది.
కరోనా సృష్టికర్త చైనాయేనా?
నా ప్రపంచాన్ని ప్రమాదపు అంచుల్లోకి నెట్టిందెవరు? ప్రకృతా లేక ఒక ప్రయోగశాలలో జరిగిన తప్పు ఫలితమా? ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా భూతం ఎలా ఆవరించిందో ఈ ప్రశ్న కూడా చిక్కుముడులు తెలీని ప్రశ్నగా అందరినీ వేధిస్తోంది. మరణ భయంకంటే వైరస్ బారిన పడతామన్న భీతి ప్రపంచంలోని వందల కోట్ల ప్రజానీకాన్ని ఇప్పుడు చుట్టుముడుతోంది. మానవ సంబంధాలను, అభివృద్ధిని ఈ వైరస్ ఛిద్రం చేసిపడేసింది. యావత్ ప్రపంచంలోని ప్రజలకు కోవిడ్–19 కలిగించిన షాక్ అలాంటిది మరి. నేను బయోమెడికల్ సైంటిస్టుని. న్యూయార్క్‌లో నివసిస్తున్నాను. మొదట్లో కోవిడ్–19 వైరస్ ప్రకృతి పరిణామ క్రమంలో ఒక అత్యంత సహజమైన భాగం అనుకున్నాను.
అందుకే ఈ వైరస్ గురించి భయపడాల్సిన పనిలేదని గతంలో వచ్చిన ఫ్లూ వంటి వైరస్‌లాగే ఇదీ వెళ్లిపోతుందని చెబుతూ వచ్చాను. అయితే నేను పదే పదే ఎదుర్కొన్న ప్రశ్న ఏదంటే.. ఈ ప్రమాదాన్ని శాస్త్రజ్ఞులు ఎందుకు ఊహించలేకపోయారు? కనుగొనలేకపోయారు? హెచ్చరించలేకపోయారు? ఈ ప్రమాదాన్ని ఎందుకు తప్పించలేకపోయారు అనే. నిజానికి వైరస్‌ల అధ్యయనంలో ప్రపంచ వ్యాప్తంగా 11,329 పరిశోధనా సంస్థలు పనిచేస్తున్నాయి.
ప్రతి ఏటా దీనికోసం 200 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నారు. కానీ ఒక కంటికి కనిపించని ఒక సూక్ష్మ జీవి వైరస్ మానవజాతికే సవాలు విసురుతుం దన్న వాస్తవాన్ని ప్రజలకు ముందే వివరించడంలో ఇవన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వైరస్ పరిశోధనపై అధ్యయనం చేస్తూ వచ్చిందంటూ చైనాను నిందిస్తోంది. ఈ అధ్యయనమే కోవిడ్–19కు మూలమై నిలిచిందట. ఎందుకు?
మానవుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, వ్యాధులను నిరోధించే లక్ష్యంతో శాస్త్రజ్ఞులు తమ ప్రతిపాదనలకు అనుమతించమని ప్రభుత్వాలను కోరుతుంటారు. వాటి మెరిట్, సమాజానికి వాటి అవసరం ప్రాతిపదికన ప్రభుత్వాలు అలాంటి ప్రాజెక్టులకు నిధులందిస్తూంటాయి. కోవిడ్–19కి సంబంధించిన రంగంపై డాక్టర్ ఝెంగ్–లి షి పరిశోధిస్తూ్త వచ్చారు. ఈమె గబ్బిలాల నుంచి సోకే కరోనా వైరస్‌పై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త. చైనాలోని వూహాన్ నగరంలోని వైరాలజీ సంస్థలో పనిచేస్తున్నారు. ప్రాన్స్‌లో పీహెచ్.డి చేశారు. అమెరికన్ మైక్రోబయాలజీ అకాడమీలో సభ్యురాలు కూడా.
ప్రయోగశాలలో వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది, వ్యాక్సిన్‌లు, చికిత్సలు అందుబాటులో లేనప్పుడు అది మానవులకు ప్రాణాంతకంగా ఎలా తయారవుతుంది అనే అంశంపై ఆమె పనిచేస్తూ వచ్చారు. కాబట్టి ఆమె పరిశోధన బయోసేఫ్టీ లెవల్ 4 ల్యాబ్‌లో జరిగింది. ఇది జీవ రక్షణలో ముందు జాగ్రత్తలకు సంబంధించిన అత్యున్నత ప్రమాణాలతో కూడిన ల్యాబ్. వూహాన్‌లో ఉన్న ఈ ల్యాబ్‌ని ఫ్రెంచ్ ప్రభుత్వ సహకారంతో నిర్మించారు. దీనికోసం అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థ నేరుగా, పరోక్షంగా నిధుల్ని అందించింది.
ఇలాంటి నిధులను 1985 నుంచి అమెరికా నేరుగా చైనాలో పరిశోధనలకు అందిస్తూ వస్తోంది. 2013లో ఆమె సార్స్ వంటి బాట్ కరోనా వైరస్‌లు ఎంజైమ్ 2ను ఉపయోగించుకుంటాయని తద్వారా అవి మానవులకు సోకుతాయని కనుగొన్నారు. 2015లో మానవుల కణాల్లో గణనీయంగా పెరిగే ఓ కొత్త వైరస్‌ను పరిశోధకులు కనుగొన్నారని పారిస్ వైరాలజిస్టు డాక్టర్ సిమన్ వైన్ హాబ్సన్ ప్రకటించారు. 2015లోనే బిల్ గేట్స్ ఒక ప్రకటన చేస్తూ ‘సాంక్రమిక వ్యాధులను నిరోధించే వ్యవస్థపై మనం ఇంతవరకు చాలా తక్కువ మొత్తాలనే వెచ్చించామని, రాబోయే కొత్త వైరస్‌ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా లేమ’ని హెచ్చరించారు. 2019 చివరలో తొలి కోవిడ్–19 వైరస్ సోకిన రోగులను వూహాన్‌లోని ఆసుపత్రులలో కనిపెట్టారు. తర్వాత జరుగుతున్న చరిత్ర తెలిసిందే.
వూహాన్ ల్యాబ్‌లో కరోనా తరహా వైరస్‌లపై శోధించిన డాక్టర్ ఝెంగ్లి షి మధ్య చైనాలోని వూహాన్‌లో ఇలాంటి వైరస్ పుట్టుకొస్తుందని ఊహించలేకపోయానని పేర్కొన్నారు. వూహాన్ మాంసం మార్కెట్లో గబ్బిలాల మాంసాన్ని అమ్మరని, సమీప ప్రాంతాల్లోని గాంగ్ డంగ్, గ్వాంగ్జీ, యూనాన్ నగరాల్లో జంతువులనుంచి మానవులకు సోకే వైరస్‌లకు అవకాశముందని కానీ వూహాన్లో అలాంటి తరహా వైరస్ పుట్టుకురావడం ఊహించలేదని చెప్పారు. }
గబ్బిలాలనుంచి సోకే కరోనా వైరస్‌లు మరింతగా సాంక్రమిక వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయని, అవి మనల్ని కనుక్కోక ముందే వాటిని మనమే కనుక్కోవలిసి ఉంటుందని ఆమె పేర్కొంటూ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రపంచానికి ఇప్పటికీ అర్థం కానిది ఒక్కటే. వూహాన్ ల్యాబ్‌లోనే ఈ వైరస్ పుట్టిందా? అలా కరోనా వైరస్ ల్యాబ్‌లో తయారైంది కాకుంటే మానవుల్లోకి అలుగు వంటి ఇతర జంతువుల నుంచి కరోనా వైరస్ సోకి ఉంటుందా అనేది తెలియాలంటే ఈ రంగంలో పనిచేస్తున్న నిపుణులు ఫోరెన్సిక్ స్థాయి పరిశోధనలు చేపట్టాల్సి ఉంది.
అందుకే న్యూయార్క్‌కి చెందిన ఎపోక్ టైమ్స్‌లో జాషువా పిలిఫ్ రాసిన వ్యాసంలో ఈ సంక్లిష్ట సమయంలో నిశ్శబ్దంగా ఉండటమనేది ప్రపంచంలోని వందలాది కోట్ల ప్రజానీకం ఆరోగ్యంపై తీవ్ర పరిణామాలు కలిగిస్తుందని హెచ్చరించారు. అలాగని చైనాను మాత్రమే దీనికి బాధ్యురాలిని చేయడం సరైందేనా? అమెరికా, ఫ్రాన్స్‌తో సహా డాక్టర్ ఝెంగ్–లి షితో కలిసి సంవత్సరాల పాటు బ్యాట్ కరోనా వైరస్‌పై పరిశోధనలకు సహకరించినవారందరూ దీనికి బాధ్యత వహించాల్సిందే. ఎవరినో ఒకరిని నిందించడం కంటే అన్ని వైపుల నుంచి నిజాయితీతో కూడిన ప్రయత్నాలు ప్రారంభం కావాలి.
ఈ సమస్యకు మూలం ఏమిటి? కోవిడ్–19 వైరస్ చైనానుంచే వచ్చిందని అందరూ అంగీకరిస్తున్నారు. ఈ వైరస్‌పట్ల మన అవగాహనలో అంతరాలు ఉన్నాయి. అందుకే అది ఎలా ప్రారంభమైంది, ఎక్కడినుంచి వచ్చింది అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంటోంది. కరోనా వైరస్ గురించి చైనా అబద్ధాలు చెప్పింది అనే విషయం కూడా నిర్ధారణ కావలసిందే. అయితే ఈ వైరస్ మూలం విషయంలో అమెరికా, ఫ్రాన్స్‌కు కూడా పాత్ర ఉండొచ్చు అనే వార్తల నేపథ్యంలో చైనాను మాత్రమే నిందించడం ఫలితాలనివ్వదు పైగా అది బెడిసికొట్టే ప్రమాదం కూడా ఉంది. దాచి ఉంచే చైనా దౌత్యం ఎలా ప్రమాదకరమైందో, అమెరికా నిందారోపణల క్రీడ కూడా ఉత్తమమైనది కాదు.
అంతిమంగా ఎన్ని దేశాలు వైరస్ మూలం గురించి పరిశోధిం చినా చైనా సహకారం, పారదర్శకత లేకుంటే సత్యం ఎన్నటికీ బయటపడదు. ఈ నేపథ్యంలో పరస్పరం ఆరోపించుకుంటున్న పక్షాల మధ్య మధ్యవర్తిత్వం వహించే మిత్ర పక్షం ఒకటి కావాలి. బలమైన నాయకత్వం, దౌత్యపరమైన శక్తి, శాస్త్రీయ సమర్థతం, ఈ సమస్యతో ముడిపడివున్న దేశాలతో ఆర్థికపరమైన సంబంధాలు కలిగిన భారతదేశం ఈ సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని కనుగొనే మధ్యవర్తి పాత్ర పోషించగలదని నా నమ్మిక. భారత్ నాయకత్వం వహిస్తే వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ, జాతీయ నిపుణులు ఒకచోట చేరి కోవిడ్–19 అనంతర యుగంలో శాంతి, సౌభాగ్యాలకు హామీ ఇచ్చే మార్గాన్ని కనుగొనగలరు.
వ్యాసకర్త: డా. శ్రీనివాస కె. రావు, బయోమెడికల్ సైంటిస్టు, న్యూయార్క్
Comments
Please login to add a commentAdd a comment