
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆరే మా సారు’అనే నినాదంతో రానున్న ఎన్నికలకు వెళ్లాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేసిన పథకాలు, ప్రజల్లో వాటి ప్రభావంపై టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సర్వే చేయించారు. సంక్షేమ పథకాల కన్నా ఎక్కువగా కేసీఆర్‌కే అన్నివర్గాలు ఆదరణ చూపించినట్లు సర్వే ఫలితాలు రావడంతో ఆ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో ఎక్కువగా ఆదరణ ఉన్న పథకాన్ని లేదా అంశాన్ని రానున్న ఎన్నికల్లో నినాదంగా చేసుకోవాలనే యోచనతో ఈ సర్వే చేయించినట్లు సమాచారం.
మిషన్ భగీరథ, రైతు బంధు, సాగునీటి ప్రాజెక్టులు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు వంటి అన్ని అంశాలపైనా నిర్దిష్టమైన సర్వే జరిపించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పరిపాలనా తీరు వంటివి సర్వే చేయించి, సమగ్ర వివరాలు తీసుకున్నారు. అన్ని పథకాల కంటే కూడా సీఎం కేసీఆర్‌కే ఎక్కువ ఆదరణ ఉన్నట్లు సర్వే ఫలితాలు వచ్చినట్లుగా టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, కల్యాణక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు వంటి ముఖ్యమైన పథకాల కంటే కేసీఆర్ నాయకత్వంపైనే ఎక్కువమంది విశ్వాసాన్ని చూపించినట్లు సర్వే ఫలితాలు వచ్చినట్టుగా తెలిపారు. దీంతో కేసీఆర్ నాయకత్వమే ప్రచారాస్త్రంగా చేసుకోవాలని భావిస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీల్లో కేసీఆర్‌కు సరితూగే నాయకుడెవరూ లేరని అన్నివర్గాలు ఆమోదిస్తున్నాయని చెబుతున్నారు. కేసీఆర్ నాయకత్వంపైనే ప్రజలు విశ్వాసంతో ఉన్నారని వచ్చిన సర్వే ఫలితాలను ఆసరాగా చేసుకుని ప్రతిపక్షపార్టీలపై దాడికి దిగాలని భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో బహుళ నాయకత్వం, సరైన సయోధ్య లేకపోవడం, అంతర్గత వైరుధ్యాలతో ఆ పార్టీని ఎవరూ నమ్మట్లేదని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment