మార్చి 31 నాటికి ‘భగీరథ’ నీళ్లు | CM KCR sets fresh deadlines for Mission Bhagiratha | Sakshi
Sakshi News home page

మార్చి 31 నాటికి ‘భగీరథ’ నీళ్లు

Published Tue, Dec 18 2018 4:40 AM | Last Updated on Tue, Dec 18 2018 9:31 AM

CM KCR sets fresh deadlines for Mission Bhagiratha - Sakshi

సోమవారం ప్రగతి భవన్‌లో మిషన్‌ భగీరథపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో స్మితా సబర్వాల్, అనురాగ్‌ శర్మ, జోగు రామన్న తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్‌ భగీరథ ద్వారా ప్రతీ ఇంటిలో నల్లా బిగించి, పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రంలో ఎవరు కూడా మంచినీళ్ల కోసం బిందె పట్టుకుని బయట కనిపించవద్దని చెప్పారు. కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు అనే తేడా లేకుండా రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారానే మంచినీళ్లు అందివ్వాలని స్పష్టం చేశారు.

ఈ పథకం పూర్తి చేయడంలో ఖర్చుకు వెనుకాడవద్దని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో మిషన్‌ భగీరథ పథకంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు అనురాగ్‌శర్మ, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, మిషన్‌ భగీరథ ఈ.ఎన్‌.సీ. కృపాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, జోగు రామన్న, గొంగిడి సునీత, రాజేందర్‌రెడ్డి, కె.విద్యాసాగర్‌రావు, ఎన్‌.భాస్కర్‌రావుతో పాటు వివిధ జిల్లాల సీఈలు, ఈఈలు హాజరయ్యారు. సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.  

నీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదు..
రాష్ట్రంలో 23,968 ఆవాస ప్రాంతాలు ఉండగా... మిషన్‌ భగీరథతో ప్రస్తుతం 23,947 ప్రాంతాలకు ప్రస్తుతం నీరు అందుతోందని, మరో 21 గ్రామాలకు మాత్రమే అందాల్సి ఉందన్నారు. ఆ గ్రామాలు కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ఉన్నవేనని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని 95 శాతం ఇళ్లకు నల్లాలు బిగించి మంచినీరు అందిస్తున్నట్లు నివేదించారు. ఓవర్‌ హెడ్‌ స్టోరేజీ రిజర్వాయర్‌ (ఓహెచ్‌ఎస్‌ఆర్‌) నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు. కేసీఆర్‌ మాట్లాడుతూ... ‘దళితవాడలు, ఆదివాసీగూడేలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలు అన్నింటికీ మిషన్‌ భగీరథతోనే శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడం ప్రభుత్వ లక్ష్యం. అచ్చంపేట, సిర్పూరు నియోజకవర్గాలు... ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కొత్తగూడెం లాంటి జిల్లాల్లోని మారుమూల చిన్న పల్లెలకు, ఎత్తయిన ప్రాంతాల్లోని ఆవాస ప్రాంతాలకూ కష్టమైనా, ఆర్థికంగా భారమైనా‡ మిషన్‌ భగీరథతోనే మంచినీరు సరఫరా చేయాలి.

జనవరి 10లోగా అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు చేరుకోవాలి. మార్చి 31లోగా అన్ని ప్రాంతాల్లో అన్ని పనులు పూర్తి చేయాలి. ఆ తర్వాత రాష్ట్రంలో నల్లా ద్వారా మంచినీళ్ల సరఫరా కాని ఇల్లు ఒక్కటీ మిగలొద్దు. ప్రతీ ఊరికి నీళ్లు పంపి, ప్రతీ ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదు. ఆ తర్వాత కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరగాలి. ఒకసారి భగీరథతో శుద్ధి చేసిన నీరు తాగిన తర్వాత ప్రజలు మరో రకం నీళ్లు తాగలేరు. ఏ ఒక్క రోజు నీరు అందకున్నా తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేయడం ఎంత ముఖ్యమో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా దాన్ని నిర్వహించడం అంతే ముఖ్యం. ప్రతీ రోజు మంచినీటి సరఫరా చేయడానికి అవలంబించాల్సిన వ్యూహం ఖరారు చేసుకోవాలి’ అని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

సందేహాలు తొలగాయి...  
‘మిషన్‌ భగీరథ చేపట్టాలని అనుకున్న రోజు చాలా మందికి చాలా అనుమానాలుండేవి. ఈ కార్యక్రమం అవుతుందా? అనే సందేహాలు ఉండేవి. అధికారులు, ఇంజనీర్లు కష్టపడి ఇంజనీరింగ్‌ పరంగా అద్భుతమైన మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వేల కిలోమీటర్ల పైపులైన్లు వేశారు. నదీ జలాలను ప్రతీ ఊరికి తరలిస్తున్నారు. ప్రతీ ఇంటికి మంచినీళ్లు అందిస్తున్నారు. దేశంలో మరెవ్వరూ చేయని అద్భుతాన్ని తెలంగాణ రాష్ట్రం చేసి చూపెడుతున్నది. దేశానికి ఇది ఆదర్శంగా నిలిచింది. అనేక రాష్ట్రాలు మిషన్‌ భగీరథ లాంటి పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించాయి. మన నుంచి సహకారం కోరుతున్నాయి. ఆయా రాష్ట్రాలకు అవసరమైన సహకారం అందించడానికి మనం సంసిద్ధత వ్యక్తం చేశాం. మిషన్‌ భగీరథ తెలంగాణకు గర్వకారణం. దీన్ని విజయవంతం చేసిన ఘనత అధికారులు, ఇంజనీర్లదే. వారికి నా అభినందనలు. ఎంతో శ్రమకోడ్చిన ప్రతీ ఒక్కరికీ కతజ్ఞతలు’’అని సీఎం చెప్పారు.

కాళేశ్వరం పర్యటన వాయిదా
ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం వాయిదా పడింది. మంగళ, బుధవారాల్లో ఆయన కాళేళ్వరం ప్రాజెక్టును, పంప్‌హౌజ్‌లను సందర్శించాల్సి ఉంది. అయితే తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన ఎప్పుడు ఉంటుందో త్వరలో నిర్ణయిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement