krupakar reddy
-
13530 ఉద్యోగాలంటూ నకిలీ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథలో ఉద్యోగాలు అనే వార్తలు అవాస్తవం అని ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి తెలిపారు. సామాజిక మధ్యమాల్లో ప్రచారం అవుతున్న పోస్టు నకిలీదని పేర్కొన్నారు. నిరుద్యోగులను మోసం చేసేందుకు కొంతమంది యత్నిస్తున్నారు. తప్పుడు వార్తను నమ్మి డబ్బులు కట్టి ఎవరూ మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు. కాగ మిషన్ బగీరథలో ఉద్యోగాలు అంటూ ఓ నకిలీ నోటిఫికేషన్ కాపీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివిధ విభాగాల కింద మొత్తం 13530 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని అందులో పేర్కొన్నారు. జిల్లాల వారిగా ఉన్న ఖాళీలను కూడా పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత, 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఈ ఉద్యోగులకు అర్హులని, అప్లికేషన్‌కు ఈ నెల 30 చివరి తేది అని నోటిఫికేషన్లో పేర్కొనబడింది. ఇందుకు గాను అభ్యర్థులు రూ.110 చెల్లించాలని అందులో పేర్కొన్నారు. ఫీజు చెల్లింపు పద్దతిని కూడా నోటిఫికేషన్లో ఉంది. అయితే అచ్చం ప్రభుత్వం విడుదల చేసినట్లుగా ఉన్న ఈ నోటిఫికేషన్‌ను చూసి చాలా మంది మోసపోతున్నారు. -
మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయ పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ఆర్బిట్రేటరీ (న్యాయ వివాదాలకు మధ్యవర్తిత్వం) వ్యవస్థతో వేగంగా న్యాయవివాదాల పరిష్కారం సాధ్యమవుతుందని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసొల్యూషన్ (ఐసీఏడీఆర్) రీజినల్ ఇన్చార్జి జేఎల్ఎన్ మూర్తి అన్నారు. ప్రత్యామ్నాయ న్యాయవివాదాల పరిష్కారాలపై ఇంజినీర్లకు అవగాహన కల్పించేందుకు ఎర్రమంజిల్‌లోని ఈఎన్సీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సులో ఆయన ప్రసంగించారు. మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ వినోభా దేవి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జేఎల్ఎన్ మూర్తి స్వాగతోపాన్యాసం చేస్తూ.. ఆర్బిట్రేటరీలతో ఉన్న ప్రయోజనాలను వివరించారు. రూ.40 లక్షల్లోపు విలువైన పనులకు మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించవచ్చని తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడాన్ని ఆయన స్వాగతించారు. ఇంజినీరింగ్ పనుల్లో జాప్యం నివారించి, అభివృద్ధి వేగిరపరిచేలా ఆర్బిట్రేటరీ దోహదపడుతుందన్నారు. కేసుల ఆధారంగా సంబంధిత రంగంలో నిపుణులైన వ్యక్తులు (మెడికల్, ఇంజనీరింగ్, సీఏ, ఫైనాన్స్) కేసులు వాదించడంతో సత్వర పరిష్కారం దొరికేందుకు వీలు చిక్కుతుందన్నారు. నచ్చిన సమయంలో, నచ్చిన వేదిక, నచ్చిన భాషను జడ్జిని ఎంచుకునే వీలు ఉండటం దీని ప్రత్యేకత అని వివరించారు. ఆగ్నేసియా దేశాలైన సింగపూర్, మలేసియా ఆర్థికాభివృద్ధిలో ఆర్బిట్రేటరీ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. 1996లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన వ్యవస్థకు ప్రధాని మోదీ ఇటీవల చేసిన చట్టసవరణల ద్వారా ఆర్బిట్రేటరీ ద్వారా సులువుగా, వేగంగా జాతీయ, అంతర్జాతీయ న్యాయవివాదాలు సమసిపోతున్నాయన్నారు. మనరాష్ట్రంలోకూడా పలు కేసుల శీఘ్ర పరిష్కారానికి పలువురు ఆర్బిట్రేటరీని ఆశ్రయిస్తున్నారని వెల్లడించారు. గృహహింస, వరకట్న వేధింపులు, కుటుంబ పరమైన వివాదాలు, పలు ఇతర ఐపీసీ కేసులను అంతర్జాతీయ ప్రత్యామ్నాయ న్యాయ వివా దాల పరిష్కార వేదిక (ఐసీఏడీఆర్) వేగంగా పరిష్కరిస్తుందన్నారు. అనంతరం మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మిషన్ భగీరథలో తలెత్తే వివాదాలపై ఇంజనీర్లకు అవగాహన కల్పించేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
మార్చి 31 నాటికి ‘భగీరథ’ నీళ్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటిలో నల్లా బిగించి, పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఎవరు కూడా మంచినీళ్ల కోసం బిందె పట్టుకుని బయట కనిపించవద్దని చెప్పారు. కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు అనే తేడా లేకుండా రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారానే మంచినీళ్లు అందివ్వాలని స్పష్టం చేశారు. ఈ పథకం పూర్తి చేయడంలో ఖర్చుకు వెనుకాడవద్దని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో మిషన్ భగీరథ పథకంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు అనురాగ్‌శర్మ, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, మిషన్ భగీరథ ఈ.ఎన్.సీ. కృపాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, జోగు రామన్న, గొంగిడి సునీత, రాజేందర్‌రెడ్డి, కె.విద్యాసాగర్‌రావు, ఎన్.భాస్కర్‌రావుతో పాటు వివిధ జిల్లాల సీఈలు, ఈఈలు హాజరయ్యారు. సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. నీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదు.. రాష్ట్రంలో 23,968 ఆవాస ప్రాంతాలు ఉండగా... మిషన్ భగీరథతో ప్రస్తుతం 23,947 ప్రాంతాలకు ప్రస్తుతం నీరు అందుతోందని, మరో 21 గ్రామాలకు మాత్రమే అందాల్సి ఉందన్నారు. ఆ గ్రామాలు కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ఉన్నవేనని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని 95 శాతం ఇళ్లకు నల్లాలు బిగించి మంచినీరు అందిస్తున్నట్లు నివేదించారు. ఓవర్ హెడ్ స్టోరేజీ రిజర్వాయర్ (ఓహెచ్ఎస్ఆర్) నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు. కేసీఆర్ మాట్లాడుతూ... ‘దళితవాడలు, ఆదివాసీగూడేలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలు అన్నింటికీ మిషన్ భగీరథతోనే శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడం ప్రభుత్వ లక్ష్యం. అచ్చంపేట, సిర్పూరు నియోజకవర్గాలు... ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కొత్తగూడెం లాంటి జిల్లాల్లోని మారుమూల చిన్న పల్లెలకు, ఎత్తయిన ప్రాంతాల్లోని ఆవాస ప్రాంతాలకూ కష్టమైనా, ఆర్థికంగా భారమైనా‡ మిషన్ భగీరథతోనే మంచినీరు సరఫరా చేయాలి. జనవరి 10లోగా అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు చేరుకోవాలి. మార్చి 31లోగా అన్ని ప్రాంతాల్లో అన్ని పనులు పూర్తి చేయాలి. ఆ తర్వాత రాష్ట్రంలో నల్లా ద్వారా మంచినీళ్ల సరఫరా కాని ఇల్లు ఒక్కటీ మిగలొద్దు. ప్రతీ ఊరికి నీళ్లు పంపి, ప్రతీ ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదు. ఆ తర్వాత కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరగాలి. ఒకసారి భగీరథతో శుద్ధి చేసిన నీరు తాగిన తర్వాత ప్రజలు మరో రకం నీళ్లు తాగలేరు. ఏ ఒక్క రోజు నీరు అందకున్నా తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేయడం ఎంత ముఖ్యమో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా దాన్ని నిర్వహించడం అంతే ముఖ్యం. ప్రతీ రోజు మంచినీటి సరఫరా చేయడానికి అవలంబించాల్సిన వ్యూహం ఖరారు చేసుకోవాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సందేహాలు తొలగాయి... ‘మిషన్ భగీరథ చేపట్టాలని అనుకున్న రోజు చాలా మందికి చాలా అనుమానాలుండేవి. ఈ కార్యక్రమం అవుతుందా? అనే సందేహాలు ఉండేవి. అధికారులు, ఇంజనీర్లు కష్టపడి ఇంజనీరింగ్ పరంగా అద్భుతమైన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వేల కిలోమీటర్ల పైపులైన్లు వేశారు. నదీ జలాలను ప్రతీ ఊరికి తరలిస్తున్నారు. ప్రతీ ఇంటికి మంచినీళ్లు అందిస్తున్నారు. దేశంలో మరెవ్వరూ చేయని అద్భుతాన్ని తెలంగాణ రాష్ట్రం చేసి చూపెడుతున్నది. దేశానికి ఇది ఆదర్శంగా నిలిచింది. అనేక రాష్ట్రాలు మిషన్ భగీరథ లాంటి పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించాయి. మన నుంచి సహకారం కోరుతున్నాయి. ఆయా రాష్ట్రాలకు అవసరమైన సహకారం అందించడానికి మనం సంసిద్ధత వ్యక్తం చేశాం. మిషన్ భగీరథ తెలంగాణకు గర్వకారణం. దీన్ని విజయవంతం చేసిన ఘనత అధికారులు, ఇంజనీర్లదే. వారికి నా అభినందనలు. ఎంతో శ్రమకోడ్చిన ప్రతీ ఒక్కరికీ కతజ్ఞతలు’’అని సీఎం చెప్పారు. కాళేశ్వరం పర్యటన వాయిదా ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం వాయిదా పడింది. మంగళ, బుధవారాల్లో ఆయన కాళేళ్వరం ప్రాజెక్టును, పంప్‌హౌజ్‌లను సందర్శించాల్సి ఉంది. అయితే తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన ఎప్పుడు ఉంటుందో త్వరలో నిర్ణయిస్తారు. -
దాహార్తి తీరుస్తాం
సాక్షి, మహబూబ్‌నగర్ :ఈ ఏడాది వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు పక్కాగా అన్నిరకాల చర్యలు తీసుకున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కృపాకర్‌రెడ్డి పేర్కొన్నారు. వర్షాలు సరిగాలేని కారణంగా భూగర్భజలాలు వేగంగా అడుగంటుతున్నందున తాగునీటి కోసం ప్రత్యేక ప్రణాళిక రచించినట్లు తెలిపారు. అందుకోసం ఇదివరకే సర్వే కూడా చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు వివరించారు. ప్రభుత్వ ఆలోచనల మేరకు ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా ఉండేందుకు తమ సిబ్బంది నిరంతరం పనిచేస్తారని, వేసవి ముగిసే వరకు సెలవులు తీసుకోకుండా ఆదివారం కూడా విధులకు హాజరవుతారని స్పష్టం చేశారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఆర్డబ్ల్యూఎస్ తీసుకున్న చర్యలపై ఎస్ఈ కృపాకర్‌రెడ్డి ‘సాక్షి ’కి వివరించారు. సాక్షి: వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొవడానికి ప్రణాళికలు చేశారా? కృపాకర్‌రెడ్డి: ఈసారి వేసవిలో తాగునీటికి తీవ్రఇబ్బందులు ఉంటాయనే ఆలోచనతో పక్కా ప్రణాళిక రచించాం. సాధారణంగా జిల్లాలో 604 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 476 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. దీంతో భూగర్భజలాలు తీవ్రంగా అడుగంటుతున్నాయి. సాధారణంగా గతేడాది 8.75 మీటర్ల లోతులో ఉన్ననీరు ప్రస్తుతం 11.35 మీటర్ల లోతుకు పడిపోయింది. వర్షాలు సరిగా కురవకపోవడంతో నీటి ఇబ్బంది రావచ్చనే ఉద్దేశంతో చాలా అప్రమత్తతంగా ఉన్నాం. గత ఏడాది నవంబర్, డిసెంబర్లోనే మా సిబ్బంది జిల్లాలోని అన్ని గ్రామాలను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో గుర్తించాం. సాక్షి: ఏ మేరకు ఇబ్బంది ఉన్నట్లు మీ సర్వేలో తేలింది. కృపాకర్‌రెడ్డి: మేం ఊచినట్లే జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగానే ఉంది. ఇప్పటివరకు మా సిబ్బంది గుర్తించారు. జిల్లాలో మొత్తం 1313 గ్రామ పంచాయతీల పరిధిలో 3,417 ఆవాసాలున్నాయి. వీటిలో 483 ఆవాసాలకు మల్టీవిలేజ్ స్కీం ద్వారా తాగునీరందిస్తున్నాం. 2216 ఆవాసాల్లో పీడబ్ల్యూఎస్, 1250 ఎంపీడబ్ల్యూఎస్ ద్వారా తాగునీరు అందిస్తున్నాం. కానీ ఈసారి జిల్లాలో మొత్తంగా 363 గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తనున్నట్లు మా సిబ్బంది నిర్వహించిన ప్రత్యేక సర్వేలో తేలింది. సాక్షి: వాటిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కృపాకర్‌రెడ్డి: తాగునీటి ఎద్దడిని అరికట్టేందుకు మేం ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. చేతిపంపులు, బోరు మోటర్లను పరీక్షించిన తర్వాత సమస్యాత్మకంగా ఉన్న 363 గ్రామాలకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టాం. గుర్తించిన గ్రామాల్లో కొత్తగా బోర్లు వేయడానికి ప్రభుత్వ అనుమతి లేదు. కాబట్టి 195 గ్రామాల్లో ట్యాం కర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, మిగతా 168 గ్రామాల్లో లీజు బోర్ల ద్వారా తాగునీరు అందించాలని నిర్ణయించాం. సాక్షి: లీజుకు తీసుకున్న బోర్లకు, ట్యాంకర్లకు డబ్బుల చెల్లింపు బాధ్యత ఎవరిది? కృపాకర్‌రెడ్డి: వీటికి నిధుల సమస్య రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వానికి ఇదివరకే నివేదిక అందజేశాం. సీఆర్ఎఫ్ ఫండ్ ద్వారా రూ.5.74కోట్లు అవసరమవుతాయని అంచనాలు పంపించాం. అలాగే నాన్ సీఆర్ఎఫ్ ఫండ్ ద్వారా రూ.47.13 లక్షలు అవసరమవుతాయని తెలిపాం. సాక్షి: వీటి నిర్వాహణ బాధ్యత ఎవరిది? కృపాకర్‌రెడ్డి: తాగునీటి నిర్వాహణ బాధ్యతను కూడా పక్కాగా ఉండేట్లు చర్యలు తీసుకున్నాం. మండల స్థాయిలో ఎంపీడీఓ, తహశీల్దార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కలిసి ఏ గ్రామంలో తాగునీటి సమస్య ఉంటుందో అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ట్యాంకర్, లేదా లీజుబోరు ఏది అవసరమైతే వాటిని ఉపయోగించేలా చర్యలు తీసుకొని వారికి నిధులు అందేలా చూస్తారు. సాక్షి: నీటి ఎద్దడిని గుర్తించిన గ్రామాల్లో సరఫరాను ప్రారంభించారా? కృపాకర్‌రెడ్డి: చర్యలు ప్రారంభించాం. 363 గ్రామాలకు గాను ప్రస్తుతం 12 గ్రామాల్లో చర్యలు ప్రారంభించాం. ఐదు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా, మరో ఏడు గ్రామాల్లో లీజు బోర్ల ద్వారా నీటి ఎద్దడి తీరుస్తున్నాం. సాక్షి: మీ సర్వేలో తేలని గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తితే పరిస్థితి ఏంటి? కృపాకర్‌రెడ్డి: వాటి విషయంలో కూడా ఓ కన్నేసి ఉంచాం. ముఖ్యంగా వేసవిలో తాగునీటి కారణంగా ప్రజలు ఇబ్బంది పడరాదనేదే మా ప్రధాన ఉద్దేశం. అందుకోసం మండల స్థాయిలో ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ ఎప్పటికప్పుడు అన్ని గ్రామాలను పర్యవేక్షిస్తుంది. తహశీల్దార్, ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ముగ్గురు కూడా నిరంతరం పర్యవేక్షించి ఇబ్బంది ఉంటే మాకు సమాచారం అందజేస్తారు. సాక్షి: నీటి ఎద్దడి పరిష్కారం కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక విభాగం ఉందా? కృపాకర్‌రెడ్డి: జిల్లా స్థాయిలో కూడా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాం. ఫిర్యాదు స్వీకరించి ఎప్పటికప్పుడు పరిష్కారం కోసం ప్రత్యేక మానిటరింగ్ విభాగం ఏర్పాటు చేసి, కొంతమంది సిబ్బందిని కూడా నియమించాం. అంతేకాదు ఈ విభాగం ప్రతిరోజూ అన్ని మండలాలను పర్యవేక్షిస్తుంది. ఎక్కడైనా ఇబ్బంది తలెత్తిందని ఫోన్లో తెలిపినా వెంటనే చర్యలు తీసుకుంటాం. మానిటరింగ్ సెల్ కూడా ఇదివరకే ప్రారంభమైంది. సెలవు రోజైన ఆదివారం కూడా మా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే వేసవి ముగిసేంత వరకు.. జూన్ దాకా సిబ్బంది ఏ ఒక్కరూ సెలవు తీసుకోవడానికి వీల్లేదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. -
జడవకండి
పాలమూరు, న్యూస్‌లైన్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా ఉండేలా తగిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకుగాను గ్రామాల వారీగా తమ శాఖకు చెందిన సిబ్బందితో సర్వే నిర్వహిస్తున్నామని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ, శానిటేషన్ మిషన్ మెంబర్ కార్యదర్శి కృపాకర్‌రెడ్డి పేర్కొన్నారు.ఈ నెల 15 కల్లా సర్వే పూర్తిచేసి తగిన ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (ఎన్ఆర్డబ్ల్యుపీ) ద్వారా శాశ్వత చర్యలకు గాను జిల్లాకు రూ.6.28 కోట్లు కేటాయించారన్నారు. శాఖా పరంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై పలు అంశాలు.. ఆయన మాటల్లోనే.. వర్షాలు సమృద్ధిగా పడటంతో.. జిల్లాలో కొన్ని చెరువుల్లో నేటికీ నీరు నిలిచి ఉన్న కారణంగా భూగర్భ జలాల స్థాయి నిలకడగా ఉంది. గతేడాది పిబ్రవరి నెలలోనే పలుగ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేపట్టాం.ఈసారి జిల్లాలో తాగునీటికి అంతగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నాం. ఈ కారణంగానే గ్రామాల్లో నీటివనరులపై సర్వే చేపట్టాం. ఆ తర్వాత పరిస్థితుల ఆధారంగా ప్రత్యామ్నాయం చేపడతాం. నిధులకు ఢోకా లేదు.. నిధుల కొరత ఏమీ లేదు. ఆన్లైన్ విధానం ద్వారా ఎప్పటికప్పుడు ఆయా పనులను నమోదు చేస్తే నిధులు మంజూరవుతాయి. ఏడాదిలో మూడుసార్లు స్టేట్‌లెవల్ సెలక్షన్ కమిటీ (స్లాక్స్) సమావేశం జరుగుతుంది. ఇందులో ప్రతిపాదనలు పెట్టి సమస్యాత్మక గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కావల్సిన పనులకు అనుమతి పొందుతాం. సాధారణమైన వాటికి కలెక్టర్ అనుమతితో ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాం. అయిదు కేటగిరీలుగా ఎంపిక సమస్యాత్మక గ్రామాలను అయిదు కేటగిరీలుగా విభజించి ఎంపిక చేస్తాం. అందులో ఏమాత్రం నీటి వనరులు లేని గ్రామాలను ఎన్ఎస్ఎస్ (నో సేఫ్ సోర్స్) కేటగిరీ కింద నిర్ణయించి వీటికి కచ్చితంగా నీరందించేందుకు చర్యలు చేపడతాం. పీసీ-1 కేటగిరీలో ఆయా గ్రామాల్లో ఉన్న జనాభాను బట్టి ఒక్కొక్కరికి 10 లీటర్ల కంటే తక్కువ నీరు అందే పరిస్థితులు ఉంటే వారికోసం బోర్ల ఫ్లషింగ్, డీపనింగ్, వ్యవసాయ బోర్ల లీజ్, నీటిని సరఫరా చేసేందుకు ట్యాంకర్లు తదితర చర్యలు చేపడతాం. పీసీ2 నుంచి పీసీ4 వరకు (20 నుంచి 40 లీటర్ల లోపు నీటి సామర్థ్యం కలిగిన గ్రామాల్లో) కేటగిరీల్లో అక్కడి అవసరాలను బట్టి ప్రజలకు ఉపయోపడే విధంగా బోర్ల ఫ్లషింగ్, డీపనింగ్ చేపడతాం. కాంట్రాక్టు విధానం ద్వారా చేపట్టే ఈ పనులకు సంబంధించి బిల్లులు సమర్పిస్తే సంబంధిత వ్యక్తులకు డబ్బులు ఆన్లైన్లోనే అందిస్తాం పది ల్యాబుల్లో పరీక్షలు నీటి శుద్ధతను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 10 ల్యాబుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. గతేడాది మా శాఖలో 15 శాతం సిబ్బంది మాత్రమే ఉండేది. ఆ మధ్య చేపట్టిన ఏపీపీఎస్సీ నియామకాలతో జిల్లాకు 19 మంది ఏడబ్ల్యుఈలు, 28 మంది ఏఈలు వచ్చారు. దీంతో సిబ్బంది కొరతను అధిగమించగలిగాం. పారిశుద్ధ్యంపై విసృ్తత ప్రచారం గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టే విధంగా పంచాయతీలకు సాంకేతిక పరంగా మా శాఖ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఈ సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నిస్తున్నాం. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టే విధానాన్ని కూడా వివరిస్తున్నాం. పల్లెల్లో పారిశుద్ధ్య చర్యలు సమర్థంగా చేపట్టిన వారికి నిర్మల్ పురస్కారంతో ప్రోత్సహిస్తున్నాం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యల పురోగతి సాధ్యమవుతోంది. భవిష్యత్తులో మరిన్ని మార్పులు రానున్నాయి. నిర్మల్ భారత్‌పై ప్రత్యేక దృష్టి...! నిర్మల్ భారత్ అభియాన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి పెట్టాం. 2013-14 సంవత్సరానికి గాను 1 లక్ష మరుగు దొడ్ల నిర్మాణం లక్ష్యం కాగా.. ఇందులో 40వేలకు పైగా పూర్తి చేయగలిగాం. ముఖ్యంగా పల్లెల్లోని ప్రజలకు మరుగుదొడ్ల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను విసృ్తత పరిచాం. గోడలపై రాతలు, రెండు చోట్ల నిర్మల్ భారత్ అభియాన్ ఉద్దేశాన్ని వివరించే బోర్డులను ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా 64 బృందాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా సీఎల్డీఎస్ పద్ధతిన గ్రామ ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమై మరుగుదొడ్ల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియపరుస్తున్నాం. వీటి నిర్మాణాలు పెంచేందుకు మండల కోఆర్డినేటర్లను నియమించాం. ఇప్పుడు గ్రామ కోఆర్డినేటర్లను నియమించేందుకు చర్యలు చేపట్టాం. గ్రామాల్లో నిర్మల్ అభియాన్ పథకాన్ని అమలుపర్చే కోఆర్డినేటర్లకు నెలసరి వేతనం కాకుండా ఒక మరుగుదొడ్డిని నిర్మిస్తే రూ.75 ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విధానం ద్వారా గ్రామాల్లో పూర్తి స్థాయిలో మరుగుదొడ్లను నిర్మించుకునే అవకాశం ఏర్పడుతుంది. అన్ని ఇళ్లల్లో కొళాయిల ఏర్పాటు.. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల పరిధిలో చేపట్టిన పరిశీలన ఆధారంగా ఇళ్లల్లో మంచినీటి కొళాయిలను ఏర్పాటు చేసుకున్న వారు 23శాతం మంది ఉన్నారు. మిగతావారు వీధుల్లో వినియోగించ కుండా ప్రతీ ఇంటికి కొళాయిలు ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేస్తున్నామన్నారు.