సాక్షి, మహబూబ్‌నగర్ :ఈ ఏడాది వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు పక్కాగా అన్నిరకాల చర్యలు తీసుకున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కృపాకర్‌రెడ్డి పేర్కొన్నారు. వర్షాలు సరిగాలేని కారణంగా భూగర్భజలాలు వేగంగా అడుగంటుతున్నందున తాగునీటి కోసం ప్రత్యేక ప్రణాళిక రచించినట్లు తెలిపారు.
అందుకోసం ఇదివరకే సర్వే కూడా చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు వివరించారు. ప్రభుత్వ ఆలోచనల మేరకు ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా ఉండేందుకు తమ సిబ్బంది నిరంతరం పనిచేస్తారని, వేసవి ముగిసే వరకు సెలవులు తీసుకోకుండా ఆదివారం కూడా విధులకు హాజరవుతారని స్పష్టం చేశారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ తీసుకున్న చర్యలపై ఎస్‌ఈ కృపాకర్‌రెడ్డి ‘సాక్షి ’కి వివరించారు.
సాక్షి: వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొవడానికి ప్రణాళికలు చేశారా?
కృపాకర్‌రెడ్డి: ఈసారి వేసవిలో తాగునీటికి తీవ్రఇబ్బందులు ఉంటాయనే ఆలోచనతో పక్కా ప్రణాళిక రచించాం.
సాధారణంగా జిల్లాలో 604 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 476 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. దీంతో భూగర్భజలాలు తీవ్రంగా అడుగంటుతున్నాయి. సాధారణంగా గతేడాది 8.75 మీటర్ల లోతులో ఉన్ననీరు ప్రస్తుతం 11.35 మీటర్ల లోతుకు పడిపోయింది. వర్షాలు సరిగా కురవకపోవడంతో నీటి ఇబ్బంది రావచ్చనే ఉద్దేశంతో చాలా అప్రమత్తతంగా ఉన్నాం. గత ఏడాది నవంబర్, డిసెంబర్‌లోనే మా సిబ్బంది జిల్లాలోని అన్ని గ్రామాలను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో గుర్తించాం. సాక్షి: ఏ మేరకు ఇబ్బంది ఉన్నట్లు మీ సర్వేలో తేలింది.
కృపాకర్‌రెడ్డి: మేం ఊచినట్లే జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగానే ఉంది. ఇప్పటివరకు మా సిబ్బంది గుర్తించారు. జిల్లాలో మొత్తం 1313 గ్రామ పంచాయతీల పరిధిలో 3,417 ఆవాసాలున్నాయి. వీటిలో 483 ఆవాసాలకు మల్టీవిలేజ్ స్కీం ద్వారా తాగునీరందిస్తున్నాం. 2216 ఆవాసాల్లో పీడబ్ల్యూఎస్, 1250 ఎంపీడబ్ల్యూఎస్ ద్వారా తాగునీరు అందిస్తున్నాం. కానీ ఈసారి జిల్లాలో మొత్తంగా 363 గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తనున్నట్లు మా సిబ్బంది నిర్వహించిన ప్రత్యేక సర్వేలో తేలింది.
సాక్షి: వాటిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కృపాకర్‌రెడ్డి: తాగునీటి ఎద్దడిని అరికట్టేందుకు మేం ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. చేతిపంపులు, బోరు మోటర్లను పరీక్షించిన తర్వాత సమస్యాత్మకంగా ఉన్న 363 గ్రామాలకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టాం. గుర్తించిన గ్రామాల్లో కొత్తగా బోర్లు వేయడానికి ప్రభుత్వ అనుమతి లేదు. కాబట్టి 195 గ్రామాల్లో ట్యాం కర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, మిగతా 168 గ్రామాల్లో లీజు బోర్ల ద్వారా తాగునీరు అందించాలని నిర్ణయించాం.
సాక్షి: లీజుకు తీసుకున్న బోర్లకు, ట్యాంకర్లకు డబ్బుల చెల్లింపు బాధ్యత ఎవరిది?
కృపాకర్‌రెడ్డి: వీటికి నిధుల సమస్య రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వానికి ఇదివరకే నివేదిక అందజేశాం. సీఆర్‌ఎఫ్ ఫండ్ ద్వారా రూ.5.74కోట్లు అవసరమవుతాయని అంచనాలు పంపించాం. అలాగే నాన్ సీఆర్‌ఎఫ్ ఫండ్ ద్వారా రూ.47.13 లక్షలు అవసరమవుతాయని తెలిపాం.
సాక్షి: వీటి నిర్వాహణ బాధ్యత ఎవరిది?
కృపాకర్‌రెడ్డి: తాగునీటి నిర్వాహణ బాధ్యతను కూడా పక్కాగా ఉండేట్లు చర్యలు తీసుకున్నాం. మండల స్థాయిలో ఎంపీడీఓ, తహశీల్దార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ కలిసి ఏ గ్రామంలో తాగునీటి సమస్య ఉంటుందో అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ట్యాంకర్, లేదా లీజుబోరు ఏది అవసరమైతే వాటిని ఉపయోగించేలా చర్యలు తీసుకొని వారికి నిధులు అందేలా చూస్తారు.
సాక్షి: నీటి ఎద్దడిని గుర్తించిన గ్రామాల్లో సరఫరాను ప్రారంభించారా?
కృపాకర్‌రెడ్డి: చర్యలు ప్రారంభించాం. 363 గ్రామాలకు గాను ప్రస్తుతం 12 గ్రామాల్లో చర్యలు ప్రారంభించాం. ఐదు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా, మరో ఏడు గ్రామాల్లో లీజు బోర్ల ద్వారా నీటి ఎద్దడి తీరుస్తున్నాం.
సాక్షి: మీ సర్వేలో తేలని గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తితే పరిస్థితి ఏంటి?
కృపాకర్‌రెడ్డి: వాటి విషయంలో కూడా ఓ కన్నేసి ఉంచాం. ముఖ్యంగా వేసవిలో తాగునీటి కారణంగా ప్రజలు ఇబ్బంది పడరాదనేదే మా ప్రధాన ఉద్దేశం. అందుకోసం మండల స్థాయిలో ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ ఎప్పటికప్పుడు అన్ని గ్రామాలను పర్యవేక్షిస్తుంది. తహశీల్దార్, ఎంపీడీఓ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ముగ్గురు కూడా నిరంతరం పర్యవేక్షించి ఇబ్బంది ఉంటే మాకు సమాచారం అందజేస్తారు.
సాక్షి: నీటి ఎద్దడి పరిష్కారం కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక విభాగం ఉందా?
కృపాకర్‌రెడ్డి: జిల్లా స్థాయిలో కూడా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాం. ఫిర్యాదు స్వీకరించి ఎప్పటికప్పుడు పరిష్కారం కోసం ప్రత్యేక మానిటరింగ్ విభాగం ఏర్పాటు చేసి, కొంతమంది సిబ్బందిని కూడా నియమించాం. అంతేకాదు ఈ విభాగం ప్రతిరోజూ అన్ని మండలాలను పర్యవేక్షిస్తుంది. ఎక్కడైనా ఇబ్బంది తలెత్తిందని ఫోన్‌లో తెలిపినా వెంటనే చర్యలు తీసుకుంటాం. మానిటరింగ్ సెల్ కూడా ఇదివరకే ప్రారంభమైంది. సెలవు రోజైన ఆదివారం కూడా మా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే వేసవి ముగిసేంత వరకు.. జూన్ దాకా సిబ్బంది ఏ ఒక్కరూ సెలవు తీసుకోవడానికి వీల్లేదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం.
దాహార్తి తీరుస్తాం
Published Wed, Mar 4 2015 1:30 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement