పాతాళంలో గంగ | river | Sakshi
Sakshi News home page

పాతాళంలో గంగ

Published Sat, Feb 14 2015 2:58 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

river

సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఈ ఏడాది సరైన వర్షాలు పడక చెరువులు, కుంటలు వెలవెలబోయాయి. భూగర్భజలాలు ఆందోళనకర స్థాయికి చేరాయి. తాగునీటి ఎద్దడి తీవ్రస్థాయిలో ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో సగటు భూగర్భజలాల నీటిమట్టం 11.35 మీటర్ల కంటే లోతుకు పడిపోయింది. గతేడాది ఇదే సమయంలో 8.75 మీటర్ల లోతులో ఉంటే ఈసారి ఏకంగా మూడు మీటర్లకు పైగా లోతుకు పడిపోయాయి.
 
  పది మండలాల్లో 20 మీటర్ల కంటే లోతుకు నీటిమట్టం చేరింది. ఫలితంగా బోర్లలో చుక్కనీరు రావడం లేదు. అంతేకాదు జలాలు అడుగంటడంతో కొత్తగా బోర్లు వేయడానికి వీల్లేదని భూగర్భజలశాఖ నివేదిక అందించింది. దీంతో ఈ సారి వేసవిలో తాగడానికి నీళ్లు దొరకడమే గగనం కానుంది. ఈ మేరకు జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక అందించారు. జిల్లాలో 1313 గ్రామ పంచాయతీల పరిధిలో 3,417 ఆవాసాలున్నాయి. వీటిలో 483 ఆవాసాలకు మల్టీ విలేజ్ స్కీం ద్వారా తాగునీరు అందిస్తున్నారు.
 
  రిజర్వాయర్ల నుంచి నీటిని తరలించి శుద్ధి చేసిన నీరు అందిస్తున్నారు. 2,216 ఆవాసాలలో పీడబ్ల్యూఎస్ (బోర్ల ద్వారా ట్యాంక్, అక్కడి నుంచి నల్లాల ద్వారా సరఫరా), 1,250 ఆవాసాలలో ఎంపీడబ్ల్యూఎస్ (బోరు మోటర్ల ద్వారా నేరుగా సరఫరా) అవుతోంది. మల్టీ విలేజ్ స్కీం ద్వారా తాగునీరు అందుతున్న గ్రామాలను మినహాయిస్తే మిగతాచోట్ల వేసవి వచ్చిందంటే చుక్కనీటి కోసం పుట్టెడు కష్టం పడాల్సి వస్తోంది. జిల్లాలో మొత్తం 13,118 చేతి పంపులు, 5273 బోరు మోటర్లున్నా వేసవి వచ్చిందంటే ప్రజల దాహార్తిని తీర్చలేకపోతున్నాయి. ప్రతి ఏటా ట్యాంకర్ల ద్వారానో లేదా లీజు బోర్ల ద్వారా కాసింత ఉపసమనం కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
 
 వేగంగా పడిపోతున్న
 భూగర్భ జలాలు..
 వేసవి రాకముందే జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. సాధారణంగా జిల్లాలో 8 మీటర్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 11.35 మీటర్ల లోతుకు పడిపోయాయి. సాధారణంగా 604.60 మి.మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 476 మి.మీటర్లు మాత్రమే నమోదైంది. బలమైన వర్షాలు లేనందున చెరువులు, కుం టలు కూడా నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. దీంతో భూగర్భజలాలు రోజు రోజుకు అడుగంటుతున్నాయి. అయితే గతేడాది మాత్రం సాధారణ వర్షపాతం కంటే దాదాపు 277.33 మి.మీటర్లు అదనంగా కురిసింది. తద్వారా భూగర్భజలాల పరిస్థితి మెరుగ్గా ఉంది. వేసవిలో తాగునీటికి అంతగా ఇబ్బంది ఏర్పడలేదు. కానీ ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఈసారి సాధారణ వర్షపాతం కంటే 16శాతం లోటు ఏర్పడింది. ఏప్రిల్, మే నెలలో నమోదు కావాల్సిన భూగర్భ జలాల నీటిమట్టం ఇప్పుడే కావడం ఆందోళనకరంగా మారింది. భూగర్భజలాల గణాంకాలను పరిశీలిస్తే ఈ సారి వేసవిలో తాగునీటికి కటకట తప్పేట్లు లేదు.
 
 అంతటా అదే పరిస్థితి...
 జిల్లాలో మొత్తం 64 మండలాలు ఉంటే 50 మండలాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. సాధారణ వర్షపాతం కంటే అతితక్కువగా నమోదు కావడం వల్ల ప్రస్తుతం జిల్లాలో పది మండలాలలో 20మీటర్ల కంటే ఎక్కువ లోతుకు నీటి మట్టం పడిపోయింది. కల్వకుర్తి మండలంలోని మార్చలలో అత్యంత దారుణంగా 34.56 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. ఇక షాద్‌నగర్‌లో 30.10మీ, కల్వకుర్తిలో 26.59, వెల్దండలో 25.53, మిడ్జిల్‌లో 24.95, తలకొండపల్లిలో 24.22 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి.
 
 ప్రభుత్వానికి నివేదిక
 ఈ ఏడాది వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు భారీ అంచనాలు వేశారు. భూగర్భ జలశాఖ ఇచ్చిన నివేదికతో పాటు జిల్లాలో ప్రత్యేక సర్వే చేశారు. గతేడాది నవంబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు గ్రామాల్లో నీటి సరఫరాపై డ్రైవ్ నిర్వహించారు. ఈ మేరకు జిల్లా పరిస్థితిని వివరిస్తూ కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.
 
 ఈ ఏడాది ట్యాంకర్ల ద్వారా మొత్తం 195 గ్రామాల్లో తాగునీటి అందించాల్సి ఉంటుందని.. అందుకోసం రూ.5.74 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేసింది. లీజు బోర్ల ద్వారా 168 గ్రామాల్లో తాగునీటి అందించాలని, అందుకోసం రూ.47.13 లక్షలు ఖర్చు అవుతాయని పేర్కొంది. ప్రస్తుతం పనిచేస్తున్న వాటిలో దాదాపు 355 బోర్లను ప్రెషింగ్ చేయాలని.. అందుకోసం 49.49 లక్షల రూపాయలు అవసరమవుతాయని రూరల్ వాటర్ స్కీం అధికారులు సూచించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement