
కొండపాక వద్ద నిర్మించిన మిషన్ భగీరథ పంప్‌హౌస్
వచ్చేస్తున్నాయ్.. ఇంటింటికీ నీళ్లు..
♦ మిషన్ భగీరథ పనుల్లో జనగామ జిల్లా ఫస్ట్
♦ వందశాతం పురోగతితో రాష్ట్రంలో తొలిస్థానం
♦ తరువాతి స్థానాల్లో మేడ్చల్, వనపర్తి, సిద్దిపేట
♦ చివరి స్థానంలో నిలిచిన కొమురంభీం జిల్లా
♦ తొలి విడతలో మరో 12 జిల్లాలపై ఫోకస్
♦ డిసెంబర్ చివరి నాటికి పనుల పూర్తే లక్ష్యం
జనగామ నుంచి ఇల్లందుల వెంకటేశ్వర్లు :
ప్రతి జనావాసానికి స్వచ్ఛమైన తాగునీటిని అందిం చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ ఫలాలు ప్రజలకు అంద బోతున్నాయి. మిషన్ భగీరథ పనుల పురోగతిలో జనగామ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. హైద రాబాద్ మినహా మిగతా 30 జిల్లాల్లో భగీరథ పను లను చేపట్టారు. ఇందులో జనగామ ప్రజలకు తొలి ఫలితాలు అందుతుండగా తరువాత సిద్దిపేట జిల్లాకు చేరుతున్నాయి. పైపులైన్ నిర్మాణంతోపాటు ట్యాంకు ల నిర్మాణం, ఇంటింటికీ నల్లా కనెక్షన్ల పనుల తదితర అంశాల్లో జనగామ మొదటి స్థానంలో ఉంది.
12 జిల్లాలపై ఫోకస్..
భగీరథ పనులను త్వరితగతిన పూర్తి చేయడం కోసం తొలి విడతలో 12 జిల్లాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు తొలి విడతలో జనగామ, సంగారెడ్డి, జగిత్యాల, నిర్మల్, మెదక్, జోగులాంబ గద్వాల, ఖమ్మం, కామారెడ్డి, వనపర్తి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలను ఎంచుకున్నారు. ఈ జిల్లాల్లో 60 శాతం వరకు పనులు కావడంతో మిగిలిన పనులను డిసెంబర్ వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గడువు కంటే ముందే నీళ్లు..
గడువు కంటే ముందే భగీరథ జలాలు ఇంటింటికీ వస్తున్నాయి. మూడు నెలల ముందుగానే జనగామలో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. జనగామ, సిద్దిపేట, మేడ్చల్, వనపర్తి జిల్లాల్లో ట్రయల్ రన్ పూర్తి చేసి నీటిని అందిస్తున్నారు. జనగామలో 704 ఆవాసాలకు తాగునీరు అందించాల్సి ఉండగా ఇప్పటివరకు 704 గ్రామాల్లో ట్రయల్ రన్ పనులను నిర్వహించారు. ఇందులో 684 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తు న్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో జరుగుతున్న నేషనల్ హైవే నిర్మాణ పనుల కారణంగా 20 గ్రామాలకు నీటిని సరఫరా చేయలేకపోతున్నారు.
రోజుకు మూడు గంటల పాటు నీటి సరఫరా..
మిషన్ భగీరథ ద్వారా ట్రయల్‌రన్ చేస్తున్న గ్రామాల్లో రోజుకు
మూడు గంటల చొప్పున నీటిని పంపింగ్ చేస్తున్నారు. పంప్ హౌస్‌ల నుంచి నేరుగా గ్రామాలకు నీటిని తరలిస్తు న్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విడతల వారీగా నీటిని వదులుతున్నారు. కరెంటుతో సంబంధం లేకుండా పంప్‌హౌస్‌ల నుంచి నీటిని వదులుతున్నారు. గతంలో కరెంటు ఉంటేనే మోటార్ల ద్వారా ట్యాంకులకు నీటిని వదిలి పెట్టేవారు. కానీ ఇప్పుడు పంప్‌హౌస్‌ల నుంచే నీటిని గ్రామాలకు అందిస్తున్నారు. ట్రయల్ రన్ చేస్తున్న గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల బాధ తప్పినట్టయింది.
విద్యుత్ బిల్లులు ఆదా..
జనగామ మున్సిపాలిటీకి తాగునీటిని అందించడం కోసం నెలకు రూ.8 లక్షల మేర కరెంటు చార్జీల రూపంలో బిల్లు వస్తుండేది. కానీ రెండు నెలల నుంచి ఎలాంటి బిల్లులు లేకుండానే భగీరథ ద్వారా జిల్లా కేంద్రంలోని ప్రజలకు తాగునీటిని అందిస్తుండడం విశేషం.
మిషన్ భగీరథ పథక వ్యయం రూ.45,000 కోట్లు
ఇప్పటికి వరకు పథకం పూర్తి అయినది 65% .
తాగునీరు అందనున్న ఆవాసాలు 24,215
రూ.35,000 కోట్లు మెయిన్ గ్రిడ్ వ్యయం
39,509 కి.మీ ఇంట్రా విలేజ్ పైపులైన్
95,000 కి.మీ మెయిన్ గ్రిడ్ పైపులైన్
ఇంట్రా విలేజ్ వ్యయం రూ.10,000 కోట్లు