
ఇంటింటికీ సురక్షిత నీరు
- త్వరలోనే అన్ని గ్రామాలకూ మిషన్ భగీరథ ఫలాలు
- ప్రతి ఇంటికీ రోజుకు 135 లీటర్ల సురక్షిత నీరు
- ఔటర్ లోపల ఉన్న 190 గ్రామాల ప్రజలకు లబ్ధి
- మూడేళ్లు వర్షాలు పడకున్నా ఎలాంటి ఇబ్బందీ లేదు
- కోటి ఎకరాల మాగాణమే కేసీఆర్ ధ్యేయం: కేటీఆర్
- కొంపల్లిలో మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరణ
- 1,200 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన
హైదరాబాద్
ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందజేసేందుకు ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రాజెక్టు మిషన్ భగీరథ అని, దీని ఫలాలు త్వరలోనే అన్ని గ్రామాలకూ అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మిషన్ భగీరథ పూర్తయితే మూడేళ్ల పాటు వర్షాలు పడకపోయినా మంచినీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, అందుకు అనుగుణంగా రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.
కొంపల్లి గ్రామంలో అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా రూ.628 కోట్లతో చేపట్టిన పైపులైన్ పనుల పైలాన్‌ను మంత్రి కేటీఆర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 190 గ్రామాలకు మంచి నీరు సరఫరా కానుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సుమారు 160 కిలోమీటర్ల విస్తీర్ణంలో 7 మున్సిపాల్టీలు, 12 మండలాల్లో ఈ పనులు జరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం 7 మిలియన్ గ్యాలెన్ల నీరు సరఫరా అవుతుండగా మరో ఏడాదిలోపు నాలుగింతలు అదనంగా 30 మిలియన్ గ్యాలెన్ల నీటిని అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
దీంతో ప్రతి ఇంటికీ రోజుకు 135 లీటర్ల సురక్షిత నీరు లభిస్తుందని, ఔటర్ గ్రామాల్లో ఉన్న 10 లక్షల జనాభాకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. అదనంగా మరో 1.50 లక్షల కొత్త నీటి కనెక్షన్లు కూడా ఇవ్వనున్నట్లు చెప్పారు. నగరంతో పాటు ఔటర్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే కోటి వరకు జనాభా ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం కేశవాపురంలో రిజర్వాయర్ నిర్మిస్తున్నారని, ఇది పూర్తయితే నగరం, శివారు ప్రాంతాలో నీటి సమస్య ఉండదని స్పష్టం చేశారు.
కోటి ఎకరాల మాగాణం..
‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు దాశరథి. అదే స్ఫూర్తితో నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు’’అని కేటీఆర్ చెప్పారు. గోదావరి నీటితో బీడు భూములకు నీరిచ్చే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకున్నారన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని, పరిశ్రమలు తరలిపోతాయని కొందరు దుష్ప్రచారం చేసి భయాలు, అనుమానాలు సృష్టించారని, సీఎం కేసీఆర్ వాటిని పటాపంచలు చేస్తూ నిరంతరం విద్యుత్ ఇస్తున్నారని చెప్పారు. దేశంలోనే నాణ్యమైన నీటిని సరఫరా చేస్తున్న వాటర్ వర్క్స్ సిబ్బంది పనితీరు వల్ల ఐఎస్‌ఓ సర్టిఫికెట్ లభించిందన్నారు.
రూ.1,900 కోట్లతో శివారు ప్రాంతాలకు తాగు నీరు అందించేందుకు 57 రిజర్వాయర్ల నిర్మాణ పనులు చేపట్టామని, ఇప్పటి వరకు 30 రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయ్యిందని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు స్వాగతోపన్యాసం చేశారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లారెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, కలెక్టర్ ఎంవీ రెడ్డి, వాటర్ వర్క్స్ ఎండీ దానకిశోర్, పలువురు ఉన్నతాధికారులు, సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
‘డబుల్’ఇళ్లకు శంకుస్థాపన..
పేదవాడి ఆత్మగౌరవ ప్రతీకగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.18 వేల కోట్లను దీనికి కేటాయించామని కేటీఆర్ చెప్పారు. డి.పోచంపల్లిలో 1,200 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం 9,400 బెడ్‌రూమ్‌లను నిర్మిస్తున్నామని చెప్పారు. గత పాలకులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టి.. కుటుంబాన్ని మొత్తం ఒకే గదిలో పెట్టడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, నాటి పాలకుల నిర్లక్ష్యం వల్ల నీటి సమస్య తీవ్రంగా ఉందని అన్నారు.
ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టబోయే ఇంటి నిర్మాణానికి రూ.8.5 లక్షలు ఖర్చు చేస్తున్నామని, ఇది బహిరంగ మార్కెట్‌లో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు వరకు ఉంటుందని గుర్తుచేశారు. ప్రతి పేదవారికి డబుల్ బెడ్‌రూమ్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే షాపూర్‌నగర్‌లో రూ.6.5 కోట్లతో నిర్మించిన 6 ఎంఎల్ రిజర్వాయర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. వచ్చే ఆరు నెలల్లో మరో ఐదు రిజర్వాయర్లు ప్రారంభిస్తామని చెప్పారు.