కొంపల్లిలో భారతి లేక్‌వ్యూ అపార్ట్‌మెంట్ పేరుతో చీటింగ్
రూ.60 కోట్లు వసూలు చేసిన సంస్థ యజమానులు
ఆపై రూ.100 కోట్ల విలువైన భూమి ఇతరులకు విక్రయం
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
భారతి బిల్డర్స్‌కు చెందిన ముగ్గురి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్ దందా వెలుగులోకి వచ్చింది. కొంపల్లిలో భారీ అపార్ట్‌మెంట్ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ప్రచారం చేసి, కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి చేతులెత్తేసిన భారతి బిల్డర్స్ కు చెందిన ముగ్గురు యజమానులను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓ డబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేసి, కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వివరాలను డీసీసీ కె.ప్రసాద్ వెల్లడించారు.
నగరానికి చెందిన దూపాటి నాగరాజు, మల్పూరి శివరామకృష్ణలు 2021 లో మాదాపూర్‌లో భారతి బిల్డర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ క్రమంలో మేడ్చల్ మల్కా జిగిరి జిల్లా కొంపల్లిలో 6.23 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భారతి లేక్ వ్యూ పేరుతో అపార్ట్‌మెంట్లను నిర్మిస్తామని ప్రకటించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రీ లాంచ్ ఆఫర్‌కు తెరలేపారు. చదరపు అడుగు రూ.3,200కే విక్రయిస్తు న్నామని ప్రచారం చేశారు. ఈ మేరకు కొంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేకంగా సమావేశాలు సైతం నిర్వహించారు.
రూ.60 కోట్లు వసూలు..: తమ ప్రణాళికను అమలు చేసేందుకు తొడ్డాకుల నర్సింహారావు అలియాస్ పొన్నారిని కంపెనీ సీఈఓగా నియమించారు. భారీ కమీషన్ ఇస్తామని ఆశ చూపించారు. ఈ నేపథ్యంలో దాదాపు 350 మంది కస్టమ ర్ల నుంచి రూ.60 కోట్లు వసూలు చేశారు. కానీ నిర్మాణాన్ని ప్రారంభించలేదు. మరోవైపు రూ.100 కోట్ల విలువైన 6.23 ఎకరాల స్థలాన్ని సంస్థ యజమానులు రెట్టింపు ధరకు ఇతర వ్యక్తులకు విక్రయించేశారు.
అటు అపార్ట్‌మెంట్ నిర్మాణం ప్రారంభం కాక, వాటా స్థలమైనా దక్కే అవకాశం లేక కస్టమర్లు రోడ్డున పడ్డారు. బాధితుల్లో ఒకరైన బీవీఎస్ ప్రసాద్ సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్–1999 కింద కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులు నాగరాజు, శివరామకృష్ణ, నర్సింహారావులను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment