ఐదేళ్ల ‘అభివృద్ధి’కి మిగిలేవి మూడేళ్లే!
♦ పట్టణ ఆరోగ్యంపై సదస్సులో మంత్రి కేటీఆర్
♦ పాలన అర్థం చేసుకునే లోపే తొలి ఏడాది గడిచిపోతుంది
♦ ఎన్నికల్లో గెలిచేందుకు చివరి ఏడాది పోతుంది
♦ ఈ మూడేళ్లలోనే ప్రభుత్వ శాఖలన్నీ కలసికట్టుగా పనిచేయాలి
సాక్షి, హైదరాబాద్ : ‘‘ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి. పరిపాలనను అర్థం చేసుకోవడంలోనే మొదటి ఏడాది గడిచిపోతుంది. మళ్లీ పోరాడి ఎన్నికలు గెలవడానికి చివరి ఏడాది పోతుం ది. మధ్యలో మిగిలిన మూడేళ్లలోనే అభివృద్ధి పనులు చేసుకోవాలి. ప్రభుత్వ శాఖలు ఎవరికి వారుగా కాకుండా సమన్వయంతో కలసికట్టుగా పని చేస్తేనే ఈ మూడేళ్లలో అభివృద్ధి సాధ్యమవుతుంది’’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో త్వరలో 2 వేల కి.మీ మేర పైప్‌లైన్ నిర్మాణం కోసం రోడ్ల తవ్వకాలు జరపాల్సి ఉందని, తవ్విన రోడ్ల స్థానంలో వెంటనే మరమ్మతులు చేసే పనుల టెండర్లు పూర్తయిన తర్వాతే తవ్వకాలకు అనుమతిస్తామని తెలిపారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపంతో నగరంలో రోడ్ల తవ్వకాలు ఇబ్బందికరంగా మారాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జాతీయ పట్టణ ఆరో గ్య పథకం (ఎన్‌హెచ్‌యూఎం) అమలుపై పురపాలికల అధికారులకు గురువారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగి న అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ, మరో 15, 20 ఏళ్లలో దేశంలోని అత్యధిక జనాభా పట్టణాల్లో ఉండనుందన్నారు.
మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రజలు పట్టణాలకు తరలివస్తు న్నా రని, ఏ రకమైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయో ఆలోచిం చాలని ఆయన అధికారులకు సూచించారు. మార్పు వెంటనే రాదు..: ‘వెంటనే మార్పు రాదు..సమయం పడుతుంది..మార్పు ప్రారంభమైందన్న విషయాన్ని గమనించాలి’అని మీడియాకు మంత్రి కేటీఆర్ సూచించారు. బంగారు తెలంగాణ నినాదంలో ఆరోగ్య తెలంగాణ అంతర్భాగమన్నారు. ఇంటింటికీ రక్షిత నీటి సరఫరా కోసం చేపట్టిన మిషన్ భగీరథ మరో 18 నెలల్లో పూర్తి అవుతుందని, దీంతో ప్రజల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని అన్నారు. గర్భిణి, శిశు మరణాల రేటును తగ్గించుకోవడంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కేసీఆర్ కిట్ పేరుతో రూ.12 వేలు విలువ చేసే సరుకులను బాలింతలకు అందజేస్తుండడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30 శాతం నుంచి 50 శాతానికి పెరిగాయన్నారు.
రాష్ట్ర పౌరుల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేసే కార్యక్రమాన్ని త్వరలో సిరిసిల్ల నుంచి శ్రీకారం చుట్టనున్నామన్నారు. ఆగస్టు 16న మహబూబ్‌నగర్‌లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో రాష్ట్రంలోని అన్ని పట్టణాలను బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలను జీహెచ్‌ఎంసీకి అప్పగిస్తే ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా సేవలు అందిస్తామని, ఈ విషయాన్ని పరిశీలించాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఎస్‌ఐఐసీ చైర్మెన్ బాలమల్లు, వైద్య శాఖ డైరెక్టర్ వాకాటి కరుణ, పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఆ ఘటననే రోజంతా చూపెట్టి
‘‘రాష్ట్రం అంతటా లక్షల మొక్కలు నాటే మంచి కార్యక్రమం జరుగుతుంటే, ఎక్కడో జరిగిన ఓ సంఘటనను దేశం అంతటా టీవీ చానళ్లు రోజంతా పదేపదే చూపించాయి. చెట్లు నాటే కార్యక్రమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వలేదు. చంద్రుడి మీద ఒక మచ్చ ఉంటే మొత్తం చంద్రుడికి మచ్చలున్నాయని అనడం సరికాదు’’అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో బుధవారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనాతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై మీడియా చానళ్ల స్పందన పట్ల మంత్రి కేటీఆర్ పరోక్షంగా పై వ్యాఖ్యలు చేశారు.