
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో సభ్యుల ప్రవర్తనపై కఠినంగా ఉండాల్సిందేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. మంగళవారం శాసనమండలి లాబీల్లో తనను కలసిన విలేకరులతో కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వం రద్దు, ఇతర సభ్యులపై సస్పెన్షన్ వేటు అంశాలపై ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు చూసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శిక్షలు కఠినంగా ఉండాల్సిందేనని పేర్కొన్నారు. నేరానికి పాల్పడినవారే కాదు, దానికి ప్రోత్సహించిన వారూ శిక్షార్హులేనన్నారు. అనుచితంగా వ్యవహరించిన సభ్యుల సభ్యత్వంపై వేటు పడితే, అందుకు ప్రోత్సహించిన వారిపై బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేదాకా వేటు పడిందన్నారు. ఈ తరహా చర్యలు తీసుకోవడం దేశంలో కొత్తేమీ కాదన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అసెంబ్లీల్లో అనుచితంగా ప్రవర్తించిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకున్నారని తెలిపారు.