కాలుష్య ఫ్యాక్టరీలపై క్రిమినల్‌ కేసులు | Criminal cases on factory pollution | Sakshi
Sakshi News home page

కాలుష్య ఫ్యాక్టరీలపై క్రిమినల్‌ కేసులు

Published Sun, Apr 16 2017 3:31 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

కాలుష్య ఫ్యాక్టరీలపై క్రిమినల్‌ కేసులు - Sakshi

కాలుష్య ఫ్యాక్టరీలపై క్రిమినల్‌ కేసులు

- ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు: మంత్రి కేటీఆర్‌
- హైదరాబాద్‌లో వారంపాటు స్పెషల్‌ డ్రైవ్‌కు ఆదేశం
- జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఆకస్మిక తనిఖీలు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని నగరంలో కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు వారం రోజులపాటు రాత్రింబవళ్లు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. రాజకీయ జోక్యం లేకుండా తాను చూసుకుంటానని, తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, అక్రమంగా నాలాల్లోకి పారిశ్రామిక వ్యర్థాలు డంప్‌ చేసే వాహనాలను జప్తు చేయాలన్నారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో పోలీసు శాఖ  సహకారం కూడా తీసుకోవాలని పేర్కొన్నారు.

ప్రభుత్వం పరిశ్రమలతో స్నేహపూర్వకంగా మెలుగుతున్నా చట్టబద్ధ ప్రమాణాలు, ప్రజారోగ్యం కూడా ముఖ్యమేనని అన్నారు. ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలను గౌరవిస్తూనే కాలుష్యకారక ఫ్యాక్టరీలపై చట్టబద్ధ చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. శనివారం జీడిమెట్ల పారిశ్రామికవాడల్లో మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్ల నిర్వహణలో లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్మికులకు పూర్తిస్థాయి రక్షణ సదుపాయాలు కల్పించాలని అధికారులు ఆదేశించారు. నమూనాల సేకరణ పాయింట్‌ వద్ద బయట నుంచి వచ్చే ట్యాంకర్లలోని నమూనాలను మంత్రి స్వయంగా పరిశీలించారు.

ఓపెన్‌ నాలాల్లో వ్యర్థాలను డంపింగ్‌ చేస్తున్న పలు ప్రాంతాల్లో కూడా కేటీఆర్‌ పర్యటించారు. జీడిమెట్ల పరిసర కాలనీల ప్రజలతో మాట్లాడారు. కాలుష్యంతో ఘాటైన వాసనలు, బోరు బావుల్లోంచి రంగు నీళ్లు వస్తున్నాయని ఈ సందర్భంగా స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీర్ఘకాలిక పరిష్కారాలతో మాత్రమే పరిస్థితి మెరుగుపడుతుందని, అ దిశగా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. పలు ప్రాంతాల్లో వ్యర్థాలను కాల్చేస్తుండటంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఔటర్‌ అవతలికి పరిశ్రమలు
హైదరాబాద్‌ నుంచి కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతలికి పరిశ్రమలను తరలించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేస్తూనే... ప్రస్తుతం నగరంలో కాలుష్య నియంత్రణ ప్రమాణాలను ఉల్లంఘిస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జీడిమెట్ల, బొల్లారం, బాలానగర్‌ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ చర్యల కోసం ఈ నెల 18న స్థానిక పరిశ్రమలతో సమావేశమై ప్రభుత్వ విధానాన్ని, అలోచనను స్వయంగా వివరిస్తానన్నారు. 

జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో ఓపెన్‌ నాలాల్లో వ్యర్థాలు డంప్‌æ చేస్తున్న వారిని నియంత్రించేందుకు సీసీ కెమెరా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధుల నుంచి ఇందుకు రూ.కోటి కేటాయిస్తామని, కెమెరాలను పోలీస్, జీహెచ్‌ఎంసీ, పీసీబీ కార్యాలయాలతో అనుసంధానం చేస్తామని చెప్పారు. వచ్చే హరితహారం కార్యక్రమంలో అధికంగా మొక్కలు నాటాలని, సువాసనలు వెదజల్లే మొక్కలకు పెద్దపీట వేయాలని సూచించారు. దీంతో కొంత వరకు దుర్వాసన తగ్గే అవకాశం ఉందన్నారు. పారిశ్రామిక వాడల్లో హరితహారంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement