ప్రధాని సభ ఖర్చు రూ.50 కోట్లు
గజ్వేల్ మండలం కోమటిబండలో ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నెల 7వ తేదీన మోదీ మెదక్ జిల్లా కోమటిబండ వద్ద ‘మిషన్ భగీరథ’ను ప్రారంభిస్తున్న విషయం విదితమే. ప్రధాని అబ్చురపడేలా సభా వేదికను తీర్చిదిద్దుతున్నారు. సభ నిర్వహణ కోసం ప్రభుత్వం రూ 50 కోట్ల వరకు ఖర్చు చేస్తోం దని అంచనా. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వేదికను ఏర్పాటు చేస్తున్నారు.
రూ. 7 కోట్లతో వేదిక: కోమటిబండ గుట్ట దిగువ భాగంలోని 80 ఎకరాల విస్తీర్ణంలో 2 లక్షల మంది కూర్చునేందుకు వీలుగా సభావేదికను ఏర్పాటు చేస్తున్నారు. వేదిక నిర్మాణంలో అల్యూమినియంరేకులు, స్టెయిన్‌లెస్‌స్టీల్ రాడ్స్ వాడుతున్నారు. ప్రధాని ప్రసంగించే వేదికను 80/60 అడుగుల వైశాల్యంతో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. సభి కుల కోసం 900/700 అడుగుల వైశాల్యంతో రెయిన్ ప్రూఫ్ షెడ్, 500/700 వైశాల్యంతో సన్‌ప్రూఫ్ టెంట్లు వేస్తున్నారు. 50కిపైగా ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. సభావేదిక ఖర్చు రూ.7 కోట్లు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
రూ.19.5 కోట్లతో రోడ్లు
కోమటిబండకు అనుసంధానంగా రోడ్డు నిర్మాణాలు ఊపందుకున్నాయి. చౌదరిపల్లి-నెంటూరు మధ్య 4.5 కిలోమీటర్ల రోడ్డును, నెంటూరు-కోమటిబండ మధ్య 11.5 కిలోమీటర్ల వరకు యుద్ధప్రాతిపదికన రెండు లేన్ల తారురోడ్లు వేస్తున్నారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లటానికి వీలుగా కోమటిబండ గుట్ట కింద నుం చి గుట్ట మీదికి 700 మీటర్ల పొడవునా రెండు లేన్ల రోడ్డు వేస్తున్నారు. రూ.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు.
రూ కోటితో పైలాన్.. 50 లక్షలతో హెలిపాడ్లు
రూ. కోటితో ‘మిషన్ భగీరథ’ ప్రారంభ సూచిక పైలాన్, దాని చుట్టూ అందమైన గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కోమటిబండ హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ వద్ద 32 అడుగుల ఎత్తు, 40/40 అడుగుల వెడల్పుతో పైలాన్ నిర్మిస్తున్నారు. పైలాన్‌పై మిషన్ భగీరథ చిహ్నం, ప్రవహిస్తున్న జలధారచిత్రాలు ఉన్నాయి. వర్గల్ మండలం నెంటూరు శివారులో 3 హెలిప్యాడ్లు నిర్మిస్తున్నారు. ప్రధాని హెలిపాడ్, రెండు కేంద్ర సైనిక హెలిపాడ్లు రానున్నాయి. వీటికి 1.5 కి.మీ. దూరంలో కోమటిబండ ఉంటుంది. వీటి కోసం రూ.50 లక్షలు వెచ్చిస్తున్నారు.
రవాణా, భోజనాల కోసం రూ. 8 కోట్లు
ప్రధానమంత్రి మోదీ సభకు జనాన్ని తరలించే బాధ్యతను మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం సభకు 2,800 బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సు 14 గంటల పాటు 320 కిలోమీటర్ల ప్రయాణించేలా రూ. 11,400కి ఒప్పందం చేసుకున్నారు. ఈ లెక్కన బస్సులకే రూ 3.20 కోట్లు ఖర్చు అవుతున్నాయి. మరో 10 వేల వరకు కార్లు, జీపులు, ఇతర వాహనాల్లో తరలివస్తారని అంచనా. వీటికి మరో రూ 3 కోట్ల వరకు ఖర్చవుతోంది. రె ండు లక్షల మందికి ఒకపూట భోజనానికి కనీసం రూ. 2 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే, పార్కింగ్ స్థలాల కోసం రూ. 30 లక్షలు, పోలీసు బలగాలు, అధికారుల రవాణా ఖర్చులు రూ.2 కోట్లు, ఇతర ఖర్చులకు రూ. 5 కోట్లు అవుతుందని అంచనా.
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇవే
ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలసి గజ్వేల్ మండలం కోమటిబండ అటవీ ప్రాంతంలోని గుట్టపై ఉన్న ‘మిషన్ భగీరథ’ హెడ్‌వర్క్స్ ప్రాంగణంలో పథకం ప్రారంభ సూచికగా నల్లాను ఆన్ చేస్తారు. అంతకుముందు పైలాన్ ను ఆవిష్కరిస్తారు. ఆపై ఎన్టీపీసీ 1,600 మెగావాట్ల పవర్‌స్టేషన్ , ఎఫ్‌సీఐఎల్‌కు చెందిన రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్, వరంగల్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేమార్గం పనులకు శంకుస్థాపన చేస్తారు.