పారిపోయి చీకటి గదుల్లో కూర్చున్నారు
♦ విపక్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజం
♦ ప్రజెంటేషన్‌పై విమర్శలు హాస్యాస్పదం
సాక్షి, హైదరాబాద్: ‘‘నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రతిపక్షాలకు అవగాహన లేదు. అసెంబ్లీలో చర్చిద్దామంటే పారి పోయి.. చీకటి గదుల్లో కూర్చుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూశారు’’ అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా ఆకుపచ్చ తెలంగాణ దిశగా తమ ప్రస్థానం కొనసాగుతుందన్నారు. శనివారం ఓ టీవీ చానల్ లైవ్‌షోలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. అవగాహన లేనివారు ప్రాజెక్టులపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ‘‘ప్రతిపక్షాలు టోకుగా, టూకీగా చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాల్లేవు. ఎగువ రాష్ట్రాల నుంచి నీరొచ్చే పరిస్థితి లేనందున శాశ్వత ప్రాతిపదికన తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
సందర్భాన్ని బట్టి కృష్ణా, గోదావరి నదులను అనుసంధానిస్తాం. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారానే రంగారెడ్డి జిల్లాకు నీరిస్తాం. బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు సమర్థంగా వాదించి కృష్ణా నుంచి మన నీటి వాటా సాధిస్తాం. 2017 చివరికల్లా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మల్లన్నసాగర్ వరకు నీటిని తరలిస్తాం. 2018 నాటికి ప్రాజెక్టుల పనులను 60 శాతం పూర్తిచేస్తాం. 2022 నాటికి కోటి ఎకరాలకు నీరందిస్తాం’’ అని సీఎం చెప్పారు.
పదింతల వృద్ధి దిశగా...
2016-17 బడ్జెట్‌లో రూ.90వేల కోట్లు ఖర్చు చేస్తామని సీఎం చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ 2019-20 నాటికి రూ.2 లక్షల కోట్లు దాటి నా ఆశ్చర్చపోవాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణపై బడ్జెట్‌లో ఏటా రూ.15 వేల కోట్లకు మించి ఖర్చు చేయలేదు. నీటి పారుదల రంగం నిర్లక్ష్యానికి గురై, సమగ్ర జల విధానం లేక భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులతో రాష్ట్రం పదింతల వృద్ధి సాధిస్తుంది. మిషన్ కాకతీయకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. మిషన్ భగీరథకు ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ప్రశంసలు లభిస్తున్నాయి.
ఈ ప్రాజెక్టు పనులను 2017 నాటికి 90 శాతం పూర్తి చేస్తాం’’ అని సీఎం అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను చెరువులతో అనుసంధానించి పూర్వ వైభవం తెస్తామని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో రాజకీ య జోక్యం లేకుండా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు అప్పగించామని, అవకతవకలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని వివరించారు. లబ్ధిదారులపై త్వరలో సర్వే జరిపి గ్రామాలవారీగా జాబితా రూపొందిస్తామన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ, ప్రైవేటు ఉపాధ్యాయులకు కనీస వేతనాలు, 108 ఉద్యోగుల సమస్య పరిష్కారం, వృత్తి కాలేజీల్లో నాణ్యమైన విద్య తదితరాలపై సీఎం మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు బిల్లును పార్లమెంటు ఆమోదించినా, అపాయింటెడ్ డేను 2014 జూన్ 2గా నిర్ణయించడంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.