మోదీ చేత్తో అట్టహాసంగా..
హైదరాబాద్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారు. ప్రత్యేక హెలికాప్టర్ లో గజ్వేల్ లోని నెమటూర్ హెలిప్యాడ్‌కు చేరుకున్న ఆయన హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కోమటిబండ చేరుకున్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించి పథకానికి అంకురార్పణ చేశారు. ఆ వెంటనే గ్రామాలకు నీటి సరఫరా చేసే పంపును స్విచ్ తో ప్రారంభించారు. అలాగే, మిషన్ భగీరథ మొదటి నల్లా ప్రారంభిస్తారు. దీంతోపాటు మిషన్ భగీరథ తీరుతెన్నులపై ప్రదర్శన కార్యక్రమాన్ని తిలకించారు.
అలాగే, ఇదే వేదిక నుంచి 1,600 మెగావాట్ల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ శంకుస్థాపన, రామగుండం ఎరువుల కర్మాగారం (ఎఫ్‌సీఐ) పునరుద్ధరణ, మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేలైన్ శంకుస్థాపన, వరంగల్‌లోని కాళోజీ విశ్యవిద్యాలయం శిలాఫలకాలను రిమోట్ ద్వారా ఆవిష్కరించారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి నిర్మించిన 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ స్టేషన్‌ను జాతికి అంకితం చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారి ప్రధాని మోదీ తెలంగాణ గడ్డపై అడుడుపెట్టారు. సరిగ్గా మ2.15గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి సురేశ్ ప్రభు, అనంతకుమార్ కూడా ఉన్నారు. వీరితోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు కూడా ఉన్నారు.
ప్రధాని మోదీ ప్రారంభించిన పథకాల విశేషాలు..
మిషన్ భగీరథ
రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చేపట్టిన బృహత్ పథకమిది. మొత్తం రూ.42 వేల కోట్ల అంచనాతో 26 ప్యాకేజీలుగా ఈ పథకాన్ని సర్కారు చేపట్టింది. తొలిదశలో తొమ్మిది నియోజకవర్గాలకు తాగునీటిని అందించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని 243 ఆవాసాల్లో 66 వేల కుటుంబాలకు తాగునీటిని అందించే ఈ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు.
సింగరేణి విద్యుత్ కేంద్రం
ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో రూ.8,250 కోట్లతో సింగరేణి ఈ ప్రాజెక్టును చేపట్టింది. 1,200 మెగావాట్ల ఈ విద్యుత్ కేంద్రం మొదటి యూనిట్‌లో జూన్ నుంచి, రెండో యూనిట్‌లో జూలై 27 నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇప్పటివరకు తొలి యూనిట్ 140 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసింది. ఈ ప్లాంటును ప్రధాని జాతికి అంకితం చేశారు.
రామగుండం ఎరువుల కర్మాగారం
మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.5,254 కోట్లతో పునరుద్ధరిస్తోంది. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ సంయుక్త భాగస్వామ్యంలో ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 2,200 ఎంటీపీడీ అమ్మోనియా యూనిట్‌ను, 3,850 ఎంటీపీడీ యూనిట్ల యూరియా ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. గ్యాస్ ఆధారితంగా నిర్మించే ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తారు.
1,600 మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంట్
పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. మొదటి దశలో 1,600 మెగావాట్ల ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాంగణంలోనే రూ.10,598 కోట్ల ఖర్చుతో చేపట్టే ఈ విద్యుత్ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేశారు.
మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్
హైదరాబాద్-కరీంనగర్ జిల్లాలను కలిపే మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మించాలనేది ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండ్. ఎట్టకేలకు ప్రధాని గజ్వేల్ సభలో ఈ పనులకు పునాదిరాయి వేశారు. రూ.1,160 కోట్ల ఖర్చుతో ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఇప్పటికే గజ్వేల్ వరకు 900 ఎకరాల మేరకు భూసేకరణ పూర్తి చేసి రైల్వేకు అప్పగించారు. మొత్తం 150 కిలోమీటర్ల పొడవుండే ఈ లైన్‌ను మూడేళ్లలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మనోహరాబాద్ (మేడ్చల్) నుంచి గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా ఈ లైన్ కరీంనగర్ (కొత్తపల్లి)కు చేరుతుంది.
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం
విభజనలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పేరుతో వరంగల్ కేంద్రంగా ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దానికి ప్రధాని శంకుస్థాపన చేశారు.