
‘ప్రాణహిత’కు అటవీ భూమి
వన్యప్రాణి సంరక్షణ బోర్డు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టు ప్రధాన కాలువ, తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన 622 హెక్టార్ల అటవీ భూములను మళ్లించేందుకు రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఆదిలాబాద్ చీఫ్ ఇంజనీర్ (ప్రాజెక్టులు) పంపించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు భూములు కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ ఫారెస్ట్ డివిజన్ల పరిధిలో ఉన్నాయి. మంగళవారం సాయంత్రం సచివాలయంలో అటవీశాఖ మంత్రి జోగురామన్న అధ్యక్షతన రాష్ట్ర స్థాయి వన్యప్రాణి సంరక్షణ మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలకమైన నిర్ణ్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ఇక కొత్తగూడెం, మైలవరం కాపర్ మైన్స్ నుంచి రాజాపురం ఉల్వనూర్ రహదారి విస్తరణ కోసం కిన్నెరసాని వన్యపాణి సంరక్షణ కేంద్రం పరిధిలోని 38.798 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించేందుకు వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతినిచ్చింది. భద్రాద్రి జిల్లాలో ట్రాన్స్‌కో విద్యుత్ కేంద్రం నిర్మాణానికి, మణుగూరు సబ్‌స్టేషన్‌కు, ఖమ్మం జిల్లా కిన్నెరసాని వద్ద మిషన్ భగీరథ పనులకు ఓకే చెప్పింది. ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ మీదుగా భారీ వాహనాల రాకపోకల అనుమతిపై అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు ప్రతిపాదనలపై ఈ భేటీలో చర్చించారు.