
రైతులతో నేరుగా చర్చలు
రైతులు, మత్స్యకారులు, గొర్రెల పెంపకందారులతో సమావేశాలు
► సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం
► పలు కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచన
సాక్షి, హైదరాబాద్: రైతులు, మత్స్యకారులు, గొర్రెల పెంపకందారులతో నేరుగా చర్చించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. త్వరలో ‘జనహిత’లో ఆయా వర్గాలతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తానని ప్రకటించారు. ఎక్కువ మంది జనాభాకు జీవనాధారమైన వ్యవసాయం– అనుబంధ రంగాలు, గొర్రెల పెంపకం, మత్స్య శాఖల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటోందని సీఎం ఉద్ఘాటించారు. వ్యవసాయం, ఉద్యానవనం, నీటి పారుదల, మత్స్యశాఖ, గొర్రెల పెంపకం తదితర అంశాలపై శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి సమీక్షించారు.
ఈ రంగాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, భవిష్యత్తు నిర్ణయాలు, చేయాల్సిన కార్యక్రమాలపై డాక్యుమెంటరీలు రూపొందించి అవగాహన కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల రూపకల్పన ప్రజల భాగస్వామ్యంతో, వారికి అవసరమైన రీతిలో జరగాలని కోరారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం తమ అభివృద్ధి, సంక్షేమం కోసం చేస్తున్నదే అన్న విశ్వాసం ఆయా వర్గాల్లో కలగాలన్నారు.
లాభమంతా మత్స్యకారులకే..
ఇంతకాలం రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ నిర్లక్ష్యానికి గురైందని, చేపలు దిగుమతి చేసుకునే దుస్థితి నెలకొందని కేసీఆర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో చేపల పెంపకానికి అధిక ప్రాధాన్యమిస్తామని, చేప పిల్లల ఉత్పత్తి, పెంపకం, మార్కెటింగ్, వసతుల కల్పన, నిర్వహణ భారాన్నంతా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. నిర్వహణ వ్యయం పోగా మిగిలిన లాభం అంతా మత్స్యకారులకే దక్కేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. చేపలు పట్టుకుని జీవించే కులాలు, కుటుంబాలకు మేలు జరిగేలా కార్యక్రమం రూపొందిస్తామన్నారు.
పెద్ద ఎత్తున నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ చెరువులు, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులతో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో కూడా మనకు వాటాలు దక్కుతాయన్నారు. చేపల పెంపకం కోసం ప్రాజెక్టులను బాగా ఉపయోగించుకోవాలని, ప్రాజెక్టుల వద్దే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పాలని ఆదేశించారు. మిషన్ భగీరథ కోసం ప్రతి ప్రాజెక్టు వద్ద 10 శాతం నీళ్లు నిల్వ ఉంచాలని నిర్ణయం తీసుకున్నందున నీటి కొరత ఉండదన్నారు.
గొర్రెల
పెంపకానికి ప్రోత్సాహం..
రాష్ట్రంలోని యాదవులు, కుర్మల ను ప్రోత్సహించి గొర్రెల పెంప కాన్ని విస్తృతంగా పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర అవసరాలు తీర్చడమే కాకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసేలా గొర్రెల పెంపకం ఉండాలన్నారు. ఏడాదికి లక్ష చొప్పున కనీసం రెండు లక్షల మందికి గొర్రె పిల్లలు కొనివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దీనికి అనుగుణంగా గొర్రె పిల్లల పంపిణీకి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నీటిపారుదల శాఖ ఈఎన్ సీ మురళీధర్‌రావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
అవసరాలకు తగ్గట్టు ప్రణాళిక
‘ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. నీటిపారుదల రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం వల్ల రాష్ట్రంలో సాగుభూమి పెరుగుతుంది. రాష్ట్రంలోని వాతావరణం, వర్షపాతం, నేల స్వభావానికి ఏ రకమైన పంటలు అనుకూలమైనవి? ఏ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ ఉంది? ఏ నేలలో ఏ పంట వేయాలి? పంట ఉత్పత్తుల మార్కెటింగ్ పరిస్థితి ఏంటి? వ్యవసాయదారుల కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలేంటి? వ్యవసాయ యాంత్రీకరణ, గ్రీన్ హౌజ్, పాలీ హౌజ్ సాగు విధానాల ద్వారా ఎలాంటి పంటలు పండించవచ్చు? తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పించాలి. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు, కార్యక్రమాలుండాలి’ అని సీఎం ఆదేశించారు.