మిషన్ భగీరథపై బేస్ లైన్ సర్వే
ఈ ఏడాది మే 29వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు సర్వే చేశారు.1,424 గ్రామాలతో పాటు వివిధ నగర పంచాయతీలకు చెందిన 76 వార్డుల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ప్రతీ గ్రామంలోని 8 ఇళ్ల చొప్పున మొత్తంగా 12 వేల ఇళ్లల్లో సర్వే నిర్వహించారు. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సర్వే నిర్వహించడం గమనార్హం. సామాజిక, ఆర్థిక అధ్యయనాల సంస్థ (సెస్) చరిత్రలోనే ఇది అతి పెద్ద సర్వే అని నిర్వాహకులు తెలిపారు. సర్వేలోని సమాచారాన్ని ఈ నెల ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు విశ్లేషణ చేస్తారు. ముసాయిదా నివేదికను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 31వ తేదీలోగా పూర్తిచేస్తారు.
తుది నివేదికను నవంబర్ ఒకటో తేదీ నుంచి 30వ తేదీ మధ్య తయారు చేస్తారు. బేస్‌లైన్ సర్వే తర్వాత మిడ్ టర్మ్ సర్వే నిర్వహిస్తారు. చివరగా ఫైనల్ సర్వే జరుగుతుంది. కాగా, ఐదు సంవత్సరాల పాటు ఈ సర్వే కొనసాగుతుంది. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి సర్వే ఫలితాలను విశ్లేషించి మధ్యంతర నివేదికలను యునిసెఫ్–సెస్ తయారు చేస్తుంది. పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉండే ఉన్నతస్థాయి కమిటీ ఈ నివేదికలను విశ్లేషించి ప్రభుత్వానికి అందజేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, గిరిజన ఆవాసాలకు సంబంధించి ప్రత్యేక సర్వే ఫలితాన్ని విడుదల చేస్తారు.
బేస్ లైన్ సర్వే ముగియడంతో నివేదిక స్వరూపం, ఏయే అంశాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వాలన్న విషయాలపై చర్చించారు. ప్రస్తుతమున్న తాగునీటి వనరులు, వినియోగం, నాణ్యతతో పాటు నీటి సంబంధిత వ్యాధుల విషయాలను నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. నీటి కొరతతో మహిళలు, విద్యార్థినులు, గర్భిణులు, చిన్నపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు యునిసెఫ్ రూపొందించిన ‘సుస్థిర అభివృద్ధి’ లక్ష్యాలను ఈ నివేదికలో పొందుపరచనున్నారు. ఈ సమావేశంలో సెస్ డైరెక్టర్, సర్వే సమన్వయకర్త డాక్టర్ గాలెబ్, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ జగన్మోహన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, కన్సల్టెంట్ నందారావు, సెస్ ప్రొఫెసర్ రేవతి, యూనిసెఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.