‘భగీరథ’ పనుల వేగం పెంచండి: హరీశ్
సాక్షి, హైదరాబాద్: పాత మెదక్ జిల్లాకు సంబంధించి మిషన్ భగీరథ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో జరుగుతున్న భగీరథ పనులను గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రి సమీక్షిం చారు. హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి మండలాల్లో మిషన్ భగీరథ పనులు పూర్తయితే ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటి సౌకర్యం కల్పించిన జిల్లాగా సిద్దిపేటకు దేశంలో ప్రథమ స్థానం లభిస్తుందన్నారు.
ఇకపై ప్రతివారం పనులను సమీక్షించాలని, స్థానిక ఎమ్మెల్యేలను సమన్వయపర్చుకుని భాగస్వాములను చేసుకో వాలని అధికారులను ఆదేశించారు. కనీసం రోజుకు 7 కిలోమీటర్ల చొప్పున పనులు పూర్తి చేస్తేనే పురోగతి ఊపందుకుంటుందన్నారు. సిబ్బంది కొరత ఉన్నచోట అధికా రులను సర్దుబాటు చేయాలని, అవసరమైతే పంచాయతీరాజ్‌శాఖ రిటైర్డ్ అధికారుల సేవలను వినియోగించుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఒక కార్యాచరణ ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, ప్రభాకర్, మదన్‌రెడ్డి, బాబూమోహన్ పాల్గొన్నారు.