సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్. చిత్రంలో పద్మాదేవేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వంద శాతం నిల్వలతో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మార్కెటింగ్, గిడ్డంగుల మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం 10.64 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యమున్న గిడ్డంగులు ఉండగా, 86 శాతం మాత్రమే వినియోగం ఉండేదని, ప్రస్తుతం 20.43 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యము న్న గిడ్డంగులుండగా, వంద శాతం వినియోగం ఉందని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల బోర్డు సమావేశం శనివారం లక్డీకాపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్ లో జరిగింది. ఈ సమావేశానికి మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మందుల సామెల్, ఎండీ జగన్‌మోహన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు గిడ్డంగులు నిండుగా ఉండి, ప్రభుత్వ గిడ్డంగులు ఖాళీగా ఉండేవన్నారు. ప్రస్తుతం పరిస్థితి తారుమారై నాయకుల గిడ్డంగులు ఖాళీగా, ప్రభుత్వ గిడ్డంగులు నిండుగా ఉన్నాయన్నారు. మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 13 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. దానికి అనుగుణంగా మార్కెటింగ్ శాఖ 364 గిడ్డంగులను రూ.1024 కోట్లతో చేపట్టగా, 320 పూర్తయినట్లు తెలిపారు.
ధాన్యం నిల్వల కోసం గిడ్డంగులను పౌర సరఫరాల శాఖ, మార్క్‌ఫెడ్, నాఫెడ్ సంస్థలు గతంలో ప్రైవేటు గోదాముల్లో నిల్వలు చేస్తే.. బస్తాకు రూ.4.30 పైసలు చెల్లించేవని ఇప్పుడు ప్రభుత్వ గిడ్డంగుల్లో నిల్వకు బస్తాకు రూ.3.25 పైసల చొప్పునే కేటాయించడంతో రూ.18.17 కోట్ల మేర ఆదా అవుతోందని తెలిపారు. 2017–18 ఏడాదిలో గిడ్డంగుల సంస్థకు రూ.140.91 కోట్ల ఆదాయం సమకూరిందని, ఇది గతంతో పోలిస్తే చాలా ఎక్కువని వెల్లడించారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, ఆర్థిక పురోగతిలో రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉందని, గిడ్డంగుల్లోనూ నంబర్‌వన్‌గా మారి కొత్త చరిత్ర సృష్టించామన్నారు. గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ మందుల సామెల్ మాట్లాడుతూ.. గిడ్డంగుల సంస్థలో ఉద్యోగుల కొరత ఉందని, వారిని భర్తీ చేయాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment