భళా.. భగీరథ! | Mission Bhagiratha Drinking Water Telangana | Sakshi
Sakshi News home page

భళా.. భగీరథ!

Published Tue, Oct 18 2016 1:34 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

భళా.. భగీరథ! - Sakshi

భళా.. భగీరథ!

దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది: సీఎం కేసీఆర్
కేంద్రం అమలు చే యాలని యోచిస్తోంది
ఇప్పటికే ఆరు రాష్ట్రాలు అధ్యయనం చేశాయి
వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ‘భగీరథ’ లక్ష్యం పూర్తికావాలి
అధికారులు బాగా పనిచేస్తున్నారంటూ కితాబు

సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని ఆలోచిస్తోందని, ఆరు రాష్ట్రాలు ఇప్పటికే మిషన్ భగీరథను అధ్యయనం చేశాయని చెప్పారు. వివిధ ఆర్థిక సంస్థలు మిషన్ భగీరథకు రూ.22 వేల కోట్లు అప్పుగా ఇచ్చేందుకు అంగీకరించాయని, మరో ఏడెనిమిది వేల కోట్ల రుణం వస్తుందని తెలిపారు. ఇంకా అవసరమైతే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. మిషన్ భగీరథ పథకం అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

అధికారులు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తూ రాష్ట్ర గౌరవం పెంచుతున్నారని సీఎం కితాబిచ్చారు. 2017 డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ పూర్తి కావడమే లక్ష్యంగా పని చేయాలని  పిలుపునిచ్చారు. గ్రామాల్లో పైపులైన్ల నిర్మాణం, ఇంట్లో నల్లాలు బిగించే పనులు అతి ముఖ్యమైనవిగా భావించాలన్నారు. పథకం ప్రారంభంలో ఎదురయ్యే బాలారిష్టాలను అధిగమించాలని, ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయన్న సంగతిని అందరూ గుర్తించాలన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, పైపులైన్ల నిరా్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల పురోగతిపై సీఎం అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిధుల కొరత లేదని, బిల్లులు కూడా వెంటనే చెల్లిస్తున్నందున పనులు వేగంగా జరిగేలా వర్క్ ఏజెన్సీలతో మాట్లాడాలని చెప్పారు.

పనులు సకాలంలో చేస్తే ప్రోత్సాహకం
గ్రామాల్లో అంతర్గత పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేస్తే 1.5 శాతం ప్రోత్సాహకం (ఇన్సెంటివ్) ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. పైపులైన్లు వేసే సందర్భంలోనే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కూడా అందులోనే వేయాలని, దీనికి ఐటీ శాఖ నుంచి సాంకేతిక అంశాలపై సలహా తీసుకోవాలని సూచించారు. తక్కువ జనాభా ఉన్న ఆవాస ప్రాంతాల్లో హెచ్‌డీపీఈ పైపులు వేయాలా? పీవీసీ పైపులు వేయాలా? అన్న అంశంపై నిర్ణయాధికారాన్ని ఈఈలకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు 365 రోజులపాటు 24 గంటలూ అందేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

మిషన్ భగీరథ పథకం నిర్వహణ బాధ్యత కూడా ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకే ఉంటుందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, మురికి కాల్వల నిర్మాణం పనులు కూడా చేయాల్సి ఉన్నందున ఈ శాఖకు పనిభారం ఎక్కువవుతుందని, అందుకే ఆర్‌డబ్ల్యూఎస్ శాఖను పునర్వ్యవస్థీకరించుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్‌లను కలిపేయాలని, అవసరాన్ని బట్టి పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు. పని విభజన పకడ్బందీగా జరగాలన్నారు.
 
ప్రశాంత్‌రెడ్డి మంత్రితో సమానం
మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి మంత్రితో సమానమని సీఎం అన్నారు. ‘‘మిషన్ భగీరథకు ప్రత్యేకంగా మంత్రి లేరు. ఆ శాఖ నా వద్దే ఉంది. వైస్ చైర్మన్‌గా నియమితులైన వేముల ప్రశాంత్‌రెడ్డికి కేబినెట్ హోదా కల్పించినం. ఆయనే మంత్రితో సమానం. అధికారులతో సమీక్షలు నిర్వహించే అధికారం ఉంది. స్వయంగా ఇంజనీర్ అయిన ప్రశాంత్‌రెడ్డి మీ శాఖ ద్వారా జరిగే పనులు పర్యవేక్షిస్తారు. ఇతర శాఖల మంత్రులు, అధికారులతో కూడా సమన్వయం కుదురుస్తారు’’ అని కేసీఆర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement